వృత్తిదారుల సంక్షేమానికి రూ. 25వేల కోట్లు కేటాయించాలి
పోస్టర్ను అవిష్కరించిన సంఘం నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 17న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు సమన్వయ కమిటీ కన్వీనర్ ఎం వీ రమణ తెలిపారు. గురువారం హైదరాబాద్లో సంబంధిత పోస్టర్ను అవిష్కరించారు.వచ్చే బడ్జెట్లో వృత్తిదారుల సంక్షేమానికి రూ. 25వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 2025-26 బడ్జెట్లో కేటాయించిన నిధులు ఈ నెల చివరి వరకు పూర్తిగా ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అమరావతి, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి వెంకట నరసయ్య, విశ్వకర్మ వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాళ్ల బండి కుమారస్వామి, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళి, కార్యదర్శి ఎం.నరహరి, క్షౌర వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నారం మల్లేశం, రజక వృత్తి దారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు లంక సోమయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు.
ప్రతి ఏడాది బడ్జెట్లో 25 వేల కోట్ల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. వృత్తిదారుల రాష్ట్ర కార్పొరేషన్, ఫెడరేషన్లకు గతేడాది బడ్జెట్లో తక్కువ కేటాయించారనీ, వాటిని కూడా ఖర్చు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సబ్ ప్లాన్ చట్టం చేయాలనీ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలనీ, వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. వృత్తిదారుల మహా ధర్నాకు కల్లుగీత, చేనేత, మత్స్యకారులు, గొర్రెలు, మేకల పెంపకం దారులు, రజక , విశ్వకర్మ వృత్తిదారులు వడ్రంగి, ఇనుము పని, బంగారం, ఇత్తడి, శిల్పాలు చెక్కుట, క్షౌర వృత్తి దారులు, మేదర, దూదేకుల, కుమ్మరి, దాసరి, సగర, ఉప్పర, బట్రాజులు, బోయ, పూసల, టైలర్, బ్యాండు, వాయిద్య, ఒగ్గు, మందహెచ్చుల, దుబ్బుల కొలుపు, పడపోత్ర, గంగిరెద్దుల, జెట్టి, ఏనూటి తదితర సాంస్కృతిక వృత్తులవారు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.



