నవతెలంగాణ – తుంగతుర్తి
పాడిరైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని మండల పశువైద్యాధికారి డాక్టర్ నరేష్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో స్థానిక సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణకు ఏటా రెండుసార్లు, ప్రతి 6 నెలలకు ఒకసారి వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. పశువులకు గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైందని, ఈ వ్యాధి సోకిన పశువుల నోటిలో,కాళ్లలో పుండ్లు ఏర్పడి మేత మేయక, నడవలేక నీరసిస్తాయన్నారు.
పాడి పశువుల్లో పాల ఉత్పత్తి పడిపోతుందన్నారు. వ్యాధి సోకిన పశువులకు చికిత్స చేయకుంటే మరణిస్తాయన్నారు. అందుకే ముందుగానే నివారణ టీకాలు వేయించుకోవాలని కోరారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున పశువులను ఎండబారి నుండి కాపాడుకోవాలని, స్వచ్ఛమైన త్రాగునీరు, మేత అందించాలని సూచించారు. గ్రామంలో 31 పశువులకు, 76 గేదెలకు, మొత్తం 107 జీవులకు టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. శుక్రవారం నుండి సోమవారం వరకు టీకాలు వేయడం జరుగుతుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెలిశాల సరిత, ఎల్ఎస్ఏ రాజశేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ రవి, గోపాలమిత్రలు లింగయ్య, శ్రీను, రైతులు తదితరులు పాల్గొన్నారు.



