గాంధీని చంపిన వారు కూడా నీతులు చెబుతున్నారు
పేదలకి అన్యాయం జరగనివ్వం
నదీ పరివాహక ప్రాంతంలోనే పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తాం
విమర్శలు మాని…సలహాలివ్వండి
శాసనసభలో చర్చిద్దాం
మెజారిటీ ఆలోచనలతోనే ముందుకెళ్దాం :’మూసీ ఇన్వైట్స్’లో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నదుల పరిరక్షణ కోసమంటూ పార్లమెంటులో చట్టాలు చేసిన వారే రాష్ట్రంలో అవి అమలు కాకుండా అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌డీసీఎల్) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మూసీ ఇన్వైట్స్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మూసీ అభివృద్ధి పనుల్ని బాధ్యతాయుతంగా చేపడుతున్నామనీ, దీనికోసం రెండేండ్లుగా నిపుణులు, అధికారులతో ప్రతి అంశాన్నీ కూలంకషంగా పరిశీలించామన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి కొంత మంది తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, మరికొంత మంది సరైన సమాచారం లేకపోవడంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
”గాంధీని చంపిన వారు కూడా నీతులు చెబుతున్నారు మెజారిటీ ఆలోచనలతోనే ముందుకెళ్దాం చారిత్రక ప్రాజెక్ట్‌కు అందరూ సహకరించండి” అని ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా నదీ పరీవాహకంలోని నగరాలను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. అదే విధంగా హైదరాబాద్ నగరాన్ని కూడా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇప్పటికే పునరుజ్జీవ ప్రాజెక్టుతో ప్రభావితమయ్యే ప్రజల వివరాలు సేకరించామని తెలిపారు. అలాంటి వారు దాదాపు 10 వేల మంది ఉన్నారనీ, వారికి అత్యధిక పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రపంచ పర్యావరణ మార్పులను పరిగణనలోకి తీసుకుని నగరాన్ని సురక్షిత నగరంగా మార్చాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దీనిపై విమర్శలు చేయడం మానుకోవాలనీ, సూచనలు, సలహాలిస్తే స్వీకరిస్తామని స్పష్టం చేశారు.
శాసనసభలో దీనిపై చర్చిస్తామని ఆయన ప్రకటించారు. రాజకీయ విబేధాలు ఉన్నంత మాత్రాన పాలసీలన్నింటినీ ఏకపక్షంగా వ్యతిరేకించడం సరికాదని సీఎం హితవు ప్రతిపక్షాలకు పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ముఖ్యమంత్రులుగా పని చేశారనీ, వారిలో కొందరే గుర్తున్నారని తెలిపారు. నిజాం లేకపోయినా ఆయన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన పనులే కారణమన్నారు. మూసీ నీళ్లు కాలుష్యం స్థాయి దాటి విషంగా మారి నల్లగొండ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చడంతో పాటు మూసీ నదిని జీవనదిలా మార్చేందుకు 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించే పనులు చేపడుతున్నామని చెప్పారు.
ఈ నీటి వాటాలో 2.5 టీఎంసీల నీరు నిరంతరం మూసీ నదిలో ప్రవహించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. మిగిలిన 17.5 టీఎంసీల గోదావరి జలాలతో హైదరాబాద్ ప్రజల దాహార్తి తీరుస్తామని స్పష్టంచేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. పాతబస్తీలో మెట్రోరైల్ నిర్మాణం కోసం రోడ్ల విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.. ”నిజాంలు హైదరాబాద్‌ను, బ్రిటీషర్లు సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించారు. ఈసీ, మూసీ వరదల నియంత్రణకు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నిర్మించారు. వందేండ్ల క్రితం నిర్మించిన జలాశయాలు నేటికీ ప్రజల దాహార్తి తీరుస్తున్నాయి.
ప్రపంచ పరిణామాలు, పర్యావరణ మార్పులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. హైడ్రా తెచ్చినప్పుడు ఆందోళన చెందిన ప్రజలే ఇప్పుడు హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పేదలను రెచ్చగొడుతున్న వారు ఆ ప్రాంతంలో నివసిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. గతంలో నిజాం చేసిన దాంట్లో 10 శాతం కూడా చేయొద్దా? అని ప్రశ్నించారు. మానవ తప్పిదాల కారణంగా మూసీ మురికి కూపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పేదలకు అన్యాయం జరగనివ్వబోమని హామీనిచ్చారు. నిరాశ్రయులను కానివ్వబోమని చెప్పారు.
సంపాదన నా కోసం కాదు…
‘ఏం సంపాదించినా ఇక్కడే వదిలేసి పోవాలి. మంచి ఇక్కడే. చెడు ఇక్కడే. పైకి తీసుకుపోగలిగే మార్గాలేవి లేవు. నేను మంచికి ప్రతినిధిగా ఉండాలనుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వృధా చేసుకోను. నేను ప్రాక్టీసింగ్ హిందువును. హిందూ మతాన్ని విశ్వసిస్తాను అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఇతర మతాలను గౌరవిస్తాను. ప్రకృతి కంటే మనం గొప్పవారం కాదు. అందరికి ఇండ్లు ఇస్తాం. పేదవారు నాకు శతృవులు కాదు. నాకు ఫాం హౌజ్ లేదు. ప్రభుత్వ బడిలో చదువుకున్న వాణ్ని.. పేదలతోనే ఉంటున్నవాణ్ని. పభుత్వం రియల్ ఎస్టేట్‌తోపాటు అన్ని రకాల టూరిజాలను ప్రోత్సహిస్తుంది. అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకే.
అయితే ప్రభుత్వం చేస్తున్న మంచి కంటే మాటల్లో విషం, చూపుల్లో పగతో వ్యతిరేక ప్రచారమే సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఉంటున్నది. దాన్ని మీరంతా తిప్పికొట్టాలి…’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రకృతిని కాపాడుకుందామా? కాలానికి వదిలేద్దామా? అనేది తేల్చుకోవాలని ఆయన సూచించారు. అంతకుముందు మూసీ పునర్జీవ ప్రాజెక్టు మేనేజింగ్ డైరెక్టర్ ఇ.వి.నర్సింహారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ.అబ్బాస్, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి జహంగీర్‌తో పాటు సీపీఐ నేతలు పాల్గొన్నారు.



