రూ.816 కోట్ల అక్రమ లావాదేవీలు
ముంబయి : హిందుజా గ్రూప్ ప్రమోట్ చేసిన ఇండస్ ఇండ్ బ్యాంక్‌లోని ఓ ప్రధాన అధికారి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని తెలుస్తోంది. ఆ సంస్థ మాజీ జోనల్ హెడ్ సమీర్ అగర్వాల్‌పై వచ్చిన ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందనే వార్త ఇప్పుడు ఆర్థిక రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. అక్టోబర్ 2024లోనే బ్యాంక్ అంతర్గత విజిలెన్స్ కమిటీ సమీర్ అగర్వాల్ అక్రమాలను గుర్తించింది. ఈయన తన కుటుంబ సభ్యుల ఖాతాలను ఉపయోగించి, బ్యాంక్ రుణ పోర్ట్‌ఫోలియోలోని కంపెనీల రహస్య సమాచారం ఆధారంగా సుమారు రూ.816 కోట్ల విలువైన అనధికారిక లావాదేవీలు నిర్వహించినట్లు తేలింది. ముఖ్యంగా కేసోరామ్ ఇండిస్టీస్ వంటి సంస్థల షేర్లలో ట్రేడింగ్ చేయడం ద్వారా సుమారు రూ.53.2 కోట్ల మొత్తం లాభాన్ని ఆర్జించగా, అందులో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారానే రూ.36.1 కోట్ల లాభం వచ్చినట్లు నివేదిక స్పష్టం చేసింది.
కాగా.. ఇంత భారీ అక్రమం జరిగినట్లు నిర్ధారణ అయినప్పటికి ఆ బ్యాంక్ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని సెబీకి లేదా స్టాక్ ఎక్స్ఛేంజీలకు అధికారికంగా నివేదించకపోవడం ఇప్పుడు అతిపెద్ద వివాదంగా మారింది. నిబంధనల ప్రకారం ఇలాంటి అక్రమాలను వెంటనే రెగ్యులేటరీ సంస్థల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉన్నప్పటికీ.. బ్యాంక్ యాజమాన్యం గోప్యత పాటించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. జోనల్ హెడ్‌గా తాను నేరుగా పర్యవేక్షించే కంపెనీల స్టాక్స్‌ను తన వ్యక్తిగత, కుటుంబ ఖాతాల ద్వారా ట్రేడింగ్ చేయడం బ్యాంకింగ్ నిబంధనలకు విరుద్ధమని.. ఇది ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసే చర్య అని నిపుణులు అభిప్రా యపడుతున్నారు. ఈ వ్యవహారం వెలుగు లోకి రావడంతో ఇండుస్‌ఇండ్ బ్యాంక్ పారదర్శకతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో ఇన్సైడర్ ట్రేడింగ్..!
- Advertisement -
- Advertisement -



