నవతెలంగాణ హైదరాబాద్: పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ నిర్బంధాన్ని రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ గతేడాది లేహ్ ప్రాంతంలో అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ పిలుపుతోనే ఈ ఆందోళనలు జరిగాయని కేంద్రం అప్పుడు వెల్లడించింది. ఈ క్రమంలోనే జాతీయ భద్రత చట్టం(ఎన్ఎస్ఎ) కింద అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. శాంతి భద్రతలను కాపాడాలనే ఉద్దేశంతో కస్టడీలోకి తీసుకున్నట్టు హోంశాఖ ప్రకటనలో వెల్లడించింది. అయితే దీనిపై ఆయన భార్య గీతాంజలి జె.ఆంగ్మో న్యాయపోరాటమే చేశారు.
లద్దాఖ్‌లో శాంతికి కట్టుబడి ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో వాంగ్‌చుక్ నిర్బంధాన్ని తక్షణమే రద్దు చేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న బంద్‌లు, నిరసనల వాతావరణం శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నాయని అభిప్రాయపడింది.



