మార్క్స్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న సీపీఐ(ఎం) నాయకులు
నవతెలంగాణ – మిరుదొడ్డి
సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కారల్ మార్క్స్ 143వ వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.భాస్కర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తత్వవేత్త, ఆర్థికవేత్త, సామాజిక శాస్త్రవేత్త సమాజంలోని అసమానతలు, కార్మిక దోపిడీ, ఆర్థిక సంక్షోభాలపై శాస్త్రీయ విశ్లేషణ చేసిన మేధావి మార్క్స్ అన్నారు. సమాజంలోని అసమానతలకు కారణాలు ఏమిటి అన్నది విశ్లేషించడం సంపద ఎందుకు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతుందో కార్మికుల శ్రమ దోపిడీకి కారణాలు,ఆర్థిక వ్యవస్థలోని వైరుధ్యాలు యుద్ధాలు, సంక్షోభాలకు ఎలా దారితీస్తాయో ఆనాడే వివరించాడని తెలిపారు.
కమ్యూనిస్టు ప్రణాళిక 1848లో ప్రచురితమైన చారిత్రక పత్రం ప్రపంచ కార్మిక ఉద్యమాలకు, ప్రపంచ రాజకీయాలలో ఒక గొప్ప మలుపు అన్నారు. ,“ప్రపంచ కార్మికులారా ఏకం కండి” సమాజాల చరిత్ర మొత్తం వర్గపోరాటాల చరిత్రే” ఈ రెండు నినాదాలు ఈరోజుకు ప్రపంచంలో చిరస్మరణీయంగా నిలిచాయన్నారు. పారిశ్రామిక పెట్టుబడి, బ్యాంకింగ్ పెట్టుబడి కలసి “ఫైనాన్స్ కేపిటల్” ఏర్పడుతుందనీ, మార్కెట్లు, వనరుల కోసం దేశాలు పోటీ పడతాయనీ ఈ పోటీ చివరకు యుద్ధాలకు దారితీస్తుందనీ దీనినే “పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క అత్యున్నత దశ – సామ్రాజ్యవాదం”గా పేర్కొన్నారు.
మార్క్స్ ఆలోచనలు కార్మిక హక్కుల ఉద్యమాలకు బలం ఇచ్చాయనీ, సంక్షేమ విధానాలపై చర్చలకు దారితీశాయనీ, వలస వ్యతిరేక ఉద్యమాలకు ప్రభావం చూపాయనీ గుర్తు చేశారు. మార్క్స్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్తూ వర్గ పోరాటాలను ముందుకు తీసుకెళ్లి ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) దుబ్బాక పట్టణ కార్యదర్శి కొంపల్లి భాస్కర్ నాయకులు ఎండి సాజిద్, కంపే ఎల్లం లక్ష్మీనర్సయ్య,రాజు,మల్లేశం,నాగరాజు,లక్ష్మీనారాయణ,కృష్ణారి తదితరులు పాల్గొన్నారు.



