భారతదేశ క్రీడా యవనికపై తన ముద్ర వేయాలనే బలమైన సంకల్పం. కఠినమైన పేదరికాన్ని సైతం ఎదిరించి నిలుస్తోంది. తెలంగాణ మట్టిలో పుట్టిన ఒక యువ కిరణం. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం. అడుగుతీసి అడుగు వేస్తే అప్పుల బాధలు. ఇలాంటి కఠినమైన దారిద్ర్యం మధ్య పెరిగిన ఓ యువతి, ఆ పేదరికాన్నే పరుగుగా మలచుకుంది. మైదానంలో స్వేద చుక్కలను పతకాలుగా మార్చుతూ, పరుగు
ఇటీవల అంతర్జాతీయ క్రీడా వేదికపై ఈ తెలంగాణ గ్రామీణ క్రీడాకారిణి సరికొత్త చరిత్ర సృష్టించింది. చైనాలోని ఓర్డోస్ (ORDOS) లో జరిగిన ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత జట్టు తరపున ప్రాతినిధ్యం వహించింది. మహిళల 4 x 400 మీటర్ల రిలే బృందంలో పాల్గొంది. తన అద్భుతమైన ప్రదర్శనతో దేశానికి బంగారు పతకం (గోల్డ్ మెడల్) అందించి సగర్వంగా నిలిచింది. చైనాలో జాతీయ జెండాను చేతబూని మైదానంలో ఆమె చేసిన సందడి భారతదేశ క్రీడా కీర్తి పతాకాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎగురవేసింది.
కన్నవారి కష్టమే ప్రేరణగా…
ప్రవళిక నల్గొండ జిల్లా డిండి సమీపంలోని గుండ్లపల్లి గ్రామంలో పుట్టి పెరిగింది. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే నిరుపేద కుటుంబం ఆమెది. తండ్రి రాంబాబు మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తన చుట్టూ దారిద్ర్యం ఉన్నా ప్రవళికను కుంగదీయలేదు. సరికదా ఆ పేదరికమే ఆమెకు ఒక ఇంధనంగా మారి ట్రాక్‌పై అలుపెరగక పరిగెత్తేలా ప్రేరేపించింది. కనీస వసతులు లేకపోయినా, ఎన్ని సవాళ్లు ఎదురైనా వేగంగా పరుగెత్తాలనే ఆమె ఆశయాన్ని ఏవీ అడ్డుకోలేకపోయాయి. కన్నవారి కష్టాన్ని కళ్లారా చూసిన ప్రవళిక, ఆ కష్టాల నుండి తన కుటుంబాన్ని, తాను పుట్టిన మట్టిని అంతర్జాతీయ వేదికపై సగర్వంగా నిలబెట్టాలనే గొప్ప సంకల్పంతో పరుగు లంకించుకుంది. తన పట్టుదల, ఆత్మవిశ్వాసంతో గత ఏడేండ్లుగా అథ్లైట్ (ట్రాక్ అండ్ ఫీల్డ్) రంగాన్ని ఎంచుకుని ముందుకు సాగుతోంది 20 ఏండ్ల ఆ యువతి.
ఆకలిని దిగమింగుతూ…
ప్రవళిక ప్రస్తుతం నల్గొండలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో బి.ఎస్సీ (బి.జెడ్.సి) చివరి ఏడాది చదువుతోంది. చదువుతో పాటు క్రీడల్లోనూ సమానమైన ప్రతిభను కనబరుస్తోంది. డిండిలోని ‘TGSWREIS గర్ల్స్ అథ్లెటిక్స్ అకాడమీ’ లో ప్రముఖ కోచ్ పసుపుల పరశురాముడు పర్యవేక్షణలో ఆమె వారానికి ఏకంగా 26 గంటల పాటు కఠినమైన శిక్షణ పొందుతోంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ట్రాక్‌పై ఆమె చిందిస్తున్న ప్రతి చెమట చుక్క వెనుక కూలీ పనులకు వెళ్తున్న కన్నవారి ముఖాలే కనిపిస్తాయి. వారానికి 26 గంటల శారీరక శ్రమను ఓర్చుకుంటూ, ఆకలిని సైతం దిగమింగుతూ తన లక్ష్యం వైపు చిరుతలా దూసుకుపోతోంది. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో ప్రత్యేక నైపుణ్యం సాధించిన ఈమె ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఎందరో సీనియర్ క్రీడాకారులకు గట్టి పోటీనిస్తోంది.
కళ్ళు చెదిరే రికార్డులు
కేవలం కొద్ది సెకన్ల వ్యవధిలో గమ్యాన్ని ముద్దాడుతూ దేశం గర్వించదగ్గ రికార్డులను ఆమె సృష్టిస్తోంది. వ్యక్తిగత రికార్డుల విషయానికి వస్తే.. 100 మీటర్లను 12.10 సెకన్లలో, 200 మీటర్లను 24.72 సెకన్లలో, 400 మీటర్ల దూరాన్ని 55.41 సెకన్లలో పూర్తి చేసి అబ్బుర పరిచింది. రాష్ట్ర స్థాయిలో ఈ స్వల్ప కాలంలోనే విజయాల పరంపర కొనసాగిస్తూ ఏకంగా 33 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. అందులో 21 స్వర్ణం, ఆరు రజతం, ఐదు కాంస్య పతకాలున్నాయి. అలాగే జాతీయ స్థాయి పోటీలలో 26 సార్లు ప్రాతినిధ్యం వహించి, మూడు జాతీయ కాంస్య పతకాలను కైవసం చేసుకుని దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. చైనాలో సాధించిన తాజా ఆసియా అండర్-23 స్వర్ణ పతకంతో పాటు, రాబోయే సీనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్, అండర్-23 నేషనల్ ఛాంపియన్షిప్ వంటి ప్రతిష్టాత్మక పోటీలలో పాల్గొనేందుకు ఆమె మరింత ఉత్సాహంతో సన్నద్ధమవుతోంది.
అడుగులు ముందుకే…
భారతదేశం తరఫున ఒలింపిక్ వేదికపై నిలబడి బంగారు పతకం సాధించాలనేది ప్రవళిక జీవితకాల ఆశయం. అయితే ఈ అంతర్జాతీయ స్థాయి కల సాకారం కావడానికి ఆమెకు కేవలం ప్రతిభ మాత్రమే సరిపోదు. అంతర్జాతీయ అథ్లెట్లతో పోటీ పడాలంటే ఆమెకు అత్యంత నాణ్యమైన శిక్షణతో పాటు తగిన ఆర్థిక వనరులు, సామగ్రి అత్యవసరం. ముఖ్యంగా అత్యుత్తమ రన్నింగ్ షూస్ (నైక్ ఎయిర్ జూమ్ మ్యాక్స్ ఫ్లై స్పైక్స్, నైక్ పెగాసస్ 42), ప్రత్యేక క్రీడా దుస్తులు, క్రీడా పరికరాలు కూడా అవసరం. వీటితో పాటు ఒక అథ్లెట్ శారీరక దృఢత్వానికి అవసరమైన పోషకాహార సప్లిమెంట్లు (ప్రోటీన్ ఐసోలేట్, మల్టీవిటమిన్, ఐరన్, ఫిష్ ఆయిల్, క్రియేటిన్, విటమిన్ డి, కాల్షియం వంటివి) కావాలి. వీటిని ప్రతి నెలా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కూలీ పనులు చేసుకునే ప్రవళిక తల్లిదండ్రులు ఈ ఖర్చులను భరించడం అసాధ్యం. ఇది వారి ఆర్థిక స్తోమతకు మించిన భారం. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ ప్రతిభావంతురాలైన క్రీడాకారిణి ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది.
మన చెల్లికి అండగా నిలుద్దాం..
ఒక సాధారణ కూలీ బిడ్డ ఒలింపిక్స్ వేదికపై దేశం జెండాను ఎగురవేయాలనే కలకు మన సమాజం అండగా నిలవాల్సిన సమయం ఇది. ఇక్కడ మన మానవతా దృక్పథం పరీక్షించబడుతోంది. పేదరికం ఒక అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని సమాధి చేయకూడదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ క్రీడాకారిణి ప్రయాణం ఆగిపోతే, అది కేవలం ప్రవళిక ఓటమి కాదు. ఆమె ప్రతిభను గుర్తించలేని మన సమాజం ఓటమి అవుతుంది. కార్పొరేట్ సంస్థలు తమ సామాజిక బాధ్యతగా భావించాలి. అలాగే క్రీడాభిమానులు, పెద్ద మనసున్న దాతలు స్పాన్సర్షిప్ రూపంలో ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించాలి. మరీ ముఖ్యంగా ఇటువంటి క్రీడాకారిణులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండి ప్రోత్సహించాలి. అప్పుడే ఎలాంటి మానసిక ఆందోళనలు లేకుండా ప్రవళిక తన శిక్షణపై దృష్టి పెట్టగలుగుతుంది. ఆర్థికంగా సహకరించాలనుకునే వారు, స్పాన్సర్ చేయాలనుకునే వారు నేరుగా సంప్రదించవచ్చు. మొబైల్ నంబర్: 6281468004, ఇమెయిల్ ఐడీలు: [email protected], [email protected].
పందెంలో సరికొత్త ఆశగా అవతరించింది. ఆమే నారిమళ్ల ప్రవళిక. ఒడిదుడుకులను లెక్కచేయక దేశానికి బంగారు పతకాన్ని అందిస్తున్న ఆ యువ అథ్లైట్ స్ఫూర్తిదాయక పరిచయం నేటి మానవిలో…
కష్టాల కడలి నుంచి.. ఒలింపిక్స్ దాకా…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



