గగన్యాన్, చంద్రయాన్-4 లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సంసిద్ధమవుతున్నవేళ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో సీనియర్ శాస్త్రవేత్తల వరస స్వచ్ఛంద రాజీనామాలు, ఉద్యోగ విరమణల నిర్ణయాలు దేశం మొత్తాన్ని కుదిపేస్తున్నాయి. ఇలా సీనియర్ల రాజీనామాలు ఇస్రోలో కొత్తేమీ కాదు. కానీ, ఒకేసారి నూట ఇరవై మంది, అది కూడా ‘ఏ’ గ్రూప్ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు రాజీనామాలు చేయడం మాత్రం కచ్చితంగా ఇదే మొదటిసారి. వీరంతా ఎందుకు రాజీనామాలు చేశారు? అసలు ఇస్రోలో ఏం జరుగుతోంది? ఈ పరిణామాలు దేనికి సంకేతం? ఇవి ఇప్పుడు అందరిని వేధిస్తున్న ప్రశ్న.
నిజానికి 2020 వరకు అంతరిక్ష రంగానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఇస్రో ఆధిపత్యమే కొనసాగేది. కానీ 2023లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘‘భారత అంతరిక్ష విధానం’’ ఈ రంగాన్ని సమూ లంగా మార్చేసింది. ప్రయివేటు రంగానికి తలుపులు బార్లా తెరవడంతో అనేక స్టార్టప్లుపుట్టగొడుగుల్లా పుట్టు కొచ్చాయి. ఉపగ్రహాల తయారీ, రాకెట్ల నిర్మాణం, భూమి నుంచి అంతరిక్ష కార్యకలాపాలను పరిశీలించే కేంద్రాల నిర్వహణలో కార్పొరేట్ కంపెనీల పాత్ర గణనీయంగా పెరిగింది. ప్రయివేటీకరణ వల్ల ఇస్రోపై భారం తగ్గుతుందనే కుంటిసాకులు చెప్తున్నప్పటికీ, అసలు సవాలు అది కాదు. ఈ ప్రయివేటురంగ సంస్థలు అనుభవజ్ఞులైన ఇస్రో శాస్త్రవేత్తలకు భారీ వేతనాలు, మెరుగైన సదుపాయాలు కల్పించి తమ వైపు తిప్పు కుంటున్నాయి. దీనిపై కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్రసింగ్ స్పందిస్తూ ‘‘ఎంతో మంది వెళ్తుంటారు.. వస్తుంటా రు’’ అని ఒక్క మాటలో తేల్చేశారంటే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో స్పష్టమవుతుంది.
అంతరిక్ష రంగాన్ని ప్రయివేటు సంస్థలకు, దేశీ-విదేశీ పెట్టుబడి శక్తులకు తెరిచి ఉంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ఇస్రో స్వయం ప్రతిపత్తిని దెబ్బతీశాయి. లాభాపేక్షే పరమావధిగా పనిచేసే ప్రయివేటు కార్పొరేట్ సంస్థలు, ఇస్రోలో తయారైన మేధోసంపత్తిని భారీ ప్యాకేజీలతో తమ వైపు తిప్పుకుంటున్నాయి. ప్రభుత్వ రంగంలో శాస్త్రవేత్తల శ్రమకు తగిన గుర్తింపు, సరైన వేతనాలు, పరిశోధనలకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులను ఉద్దేశపూర్వకంగానే తగ్గించడం వెనుక ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర దాగి ఉంది. ప్రభుత్వ రంగాన్ని బలహీనపరిచి, ఆ తర్వాత ‘‘నిర్వహణ సాధ్యం కావడం లేదు’’ అనే మిషతో ప్రయివేటుకు అప్ప గించే క్రమబద్ధమైన దోపిడీ వ్యూహం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.
భద్రత, సార్వభౌమత్వంతో ముడిపడి ఉన్న అంతరిక్ష రంగాన్ని కేవలం లాభనష్టాల కోణంలో చూడటం చారిత్రక తప్పిదమవుతుంది. ప్రయివేటీకరణ వల్ల తాత్కాలికంగా నిధులు సమకూరినట్టు అనిపించినా, దీర్ఘ కాలంలో అది దేశ స్వయం సమృద్ధిని దెబ్బతీస్తుంది. జాతీయ ప్రయోజనాల కంటే కార్పొరేట్ లాభాలు ముఖ్యం కాదనే సత్యాన్ని పాలకులు గుర్తించి, అంతరిక్ష రంగంలో ప్రయివేటీకరణ దూకుడుకు బ్రేకులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వరుస రాజీనామాలు దేశ సార్వభౌమత్వానికి, ప్రజాస్వామ్య ఆర్థిక వ్యవస్థకు కేంద్ర పాలకులు చేస్తున్న ద్రోహాన్ని కండ్లకు కడుతున్నాయి.
అనుభవజ్ఞులు వెళ్లిపోతే వారి స్థానాలు భర్తీ చేయడం అంత సులభం కాదు. రాజీనామాల నేపథ్యంలో ప్రభుత్వం ఎదుర్కోవలసిన పెద్ద సవాలిదే. అంతరిక్ష రంగంలో ప్రయివేటు రంగం పాత్ర పెరగాలన్నది ప్రభుత్వ విధానం. ఉపగ్రహాలు, రాకెట్ల తయారీ, భూమ్మీద నుంచి అంతరిక్ష వ్యవహారాలను పరిశీలించే కేంద్రాలు ప్రయివేటు రంగంలో పెంచాలన్నది ప్రభుత్వ ఆలోచన. అనుభవజ్ఞులైన, సామర్థ్యం గల శాస్త్రవేత్తలు ఇస్రో వదిలి వెళ్ల కూడదంటే వారి ఉద్యోగాల్లో ఎదుగుదలకు తగిన అవకాశాలు కల్పించాలి. పరిశోధన చేయడానికి ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వాలి. విధాన నిర్ణయాల్లోనూ తగిన స్వతంత్రత ఉండాల్సిందే. ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలన్న ధ్యాస ప్రభుత్వానికి ఉంటే ఇవన్నీ ఆశించవచ్చు. ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం అయినప్పుడు వీటన్నింటికీ అవకాశం ఎక్కడ ఉంటుంది?
రక్షణ విభాగంలోనే ప్రయివేటు రంగానికి పెద్దపీట వేస్తున్న దశలో ప్రభుత్వ రంగ వ్యవస్థల పరిరక్షణకు ప్రాధాన్యం ఉంటుందనుకోలేం. అయితే గగన్యాన్, చంద్రమండలం నుంచి నమూనాల సేకరణ, చంద్రయాన్-4 లాంటి భారీ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆ లక్ష్యాలు సాధించడం ఎలా అన్నది అసలు సమస్య. ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహిం చడమంటే ప్రభుత్వ రంగం పీక నొక్కేయడం కాకూడదు. కానీ ప్రయివేటు రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆతృతలో ప్రభుత్వమే పనిగట్టుకుని ప్రభుత్వ రంగ సంస్థలను బలిపెట్టిన ఉదంతాలు కొల్లలుగానే ఉన్నాయి. గగన్యాన్ అంటే మానవులు ఉండే అంతరిక్ష పరిశోధనలు, అంతరిక్షంలో మన పరిశోధనా కేంద్ర నిర్మాణం లాంటివి ఉదాత్తమైన లక్ష్యాలే. అవి సాధ్యం కావాలంటే ఇస్రోలో ఉన్న సమర్థులను కాపాడుకోవడానికి తగిన ఆలోచన ప్రభుత్వానికి ఉందా అనేదే అసలు ప్రశ్న.
మేధో వలస
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



