Saturday, March 14, 2026
E-PAPER
Homeఆటలుపాక్ బ్యాటర్ సల్మాన్ అలీ ఆఘాకు ఐసీసీ మందలింపు

పాక్ బ్యాటర్ సల్మాన్ అలీ ఆఘాకు ఐసీసీ మందలింపు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ బ్యాటర్ సల్మాన్ ఆఘా ఐసీసీ చర్యలకు గురయ్యాడు. విచిత్ర రీతిలో రనౌట్ కావడంపై అసహనం వ్యక్తం చేస్తూ క్రికెట్ పరికరాలను దురుసుగా విసిరికొట్టినందుకు అతడిని మందలించడంతో పాటు, ఒక డిమెరిట్ పాయింట్‌ను జతచేశారు. శుక్రవారం షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సల్మాన్ ఆఘా, మహ్మద్ రిజ్వాన్ కలిసి 109 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. పాకిస్థాన్ ఇన్నింగ్స్ 39వ ఓవర్‌లో బంగ్లా కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ వేసిన బంతిని రిజ్వాన్ నెమ్మదిగా పుష్ చేశాడు. నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో క్రీజు బయట ఉన్న పాక్ బ్యాటర్ ఆఘా వద్దకు బంతి దొర్లుకుంటూ వచ్చింది. అతడు బంతిని చేత్తో పట్టుకుని బౌలర్‌కు తిరిగి ఇవ్వబోయాడు. వెంటనే అప్రమత్తమైన మిరాజ్… ఆఘా కంటే ముందే ఆ బంతిని అందుకుని వికెట్లను గిరాటేశాడు. ఆఘా క్రీజు బయటే ఉండటంతో థర్డ్ అంపైర్ అతడిని రనౌట్‌గా ప్రకటించాడు.

ఈ ఊహించని పరిణామంతో తీవ్ర నిరాశకు గురైన సల్మాన్ ఆఘా, పెవిలియన్‌కు వెళుతూ కోపంతో తన గ్లోవ్స్‌ను నేలకేసి కొట్టాడు. ఇది ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించడమే. ఈ విషయంపై మ్యాచ్ రిఫరీ నేమూర్ రషీద్ ‘ది డైలీ స్టార్‌’తో మాట్లాడుతూ.. “సల్మాన్‌కు గతంలో ఇలాంటి ప్రవర్తనకు పాల్పడిన చరిత్ర లేదు. అన్ని అంశాలను, ఐసీసీ నిబంధనలను పరిగణలోకి తీసుకుని అతడిని మందలించి, ఒక డిమెరిట్ పాయింట్ ఇచ్చాం” అని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -