నవతెలంగాణ -ముధోల్
బాసర ఐఐఐటి ని, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా, ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. వర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్ల ప్రక్రియ గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందో లేదో అధికారులను అడిగారు. విద్యార్థుల రక్షణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. మహిళా విద్యార్థుల కొరకు ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. సిబ్బందిని నియమించుకునే ప్రక్రియలో తప్పనిసరిగా రిజర్వేషన్ పద్ధతిని పాటించాలని ఆదేశించారు. వివిధ అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
విద్యార్థులతో నేరుగా మాట్లాడుతూ, వారికి అందిస్తున్న వసతులు, వారికి ఉన్న సమస్యలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పలువురు అధికారులు, చైర్మెన్, సభ్యులను సన్మానించారు. జ్ఞాపికలను అందించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు కుస్త్రం నీలాదేవి, వైస్ చాన్స్ లర్ గోవర్ధన్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



