ఈ వారంలో ఎప్పుడైనా ఎన్నికల సంఘం శాసనసభ ఎన్నికల షెడ్యూలు ప్రకటిస్తుందని రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరిలలో వివిధ పార్టీలు అభ్యర్థుల ఎంపికను కూడా కొంత వరకూ పూర్తి చేశాయి. ప్రధానమంత్రి, సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా సుడిగాలి పర్యటనలు చేసి ప్రచారం సాగిస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా చేయగలిగిన వాగ్దానాల ప్రకటన పథకాల అమలు కోసం హడావుడి పడుతున్నారు. ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్కుమార్తో సహా ఆయా రాష్ట్రాలలో పర్యటించి, సమీక్షలు సన్నాహాలు కానిచ్చేస్తున్నారు. కేంద్ర సాయుధ పోలీసుల బలగాల తరలింపు కూడా వేగంగా జరిగిపోతున్నది. గతంలో లేనిదీ ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది ‘సర్’ సవాలు. దాదాపు రెండు లక్షల మంది సాయుధ బలగాలు సిద్ధం చేయబడ్డాయి. గతంలో లేకుండా ఇప్పుడు ప్రత్యేక సమస్యగా తయారైన ప్రత్యేక సమగ్ర పరిశీలన సర్ తతంగం సుప్రీంకోర్టులో సవాలు చేయబడుతున్నది. తమిళనాడు కేరళ, అస్సాంల సమస్య ఎలాగో అయిందనిపించినా బెంగాల్ మాత్రం మండుతూనే వుంది.
ఎందుకు వగరుస్తున్నావంటే ఎల్లుండి కొండెక్కాలని అన్నట్టు ఎన్నికలకు నెలల ముందునుంచే కేంద్రంలోని బీజేపీ, ఆరెస్సెస్ పరివార్ ప్రేరణతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగడం ఈసారి సరికొత్త సమస్యలు సృష్టించింది. దానికి బలమైన కారణాలున్నాయి. మోడీ పదేళ్లపాలన నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. దానికి ముందు రాజ్యాంగ వ్యవస్థలో ప్రతి అంగమూ దిగ్బంధానికి గురైంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా పెట్టుకుని దాడి చేశాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు జైళ్లపాలైనారు. కాంగ్రెస్, సీపీఐ(ఎం)వంటి రాజకీయ పక్షాలపై కక్ష సాధింపు సాగింది. ఎన్నికల ప్రచారంలో కూడా ప్రతిపక్షానికి సమాన అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల కమిషన్ శోచనీయమైన పాత్ర పోషించింది. వెన్నెముక లేని కమిషనర్లతో నియమించ బడిన ఎన్నికల కమిషన్ ఎన్నికల నియమావళి ఘోర ఉల్లంఘనలను శిక్షించడంలో గట్టిగా నిలబడలేక విఫలమైంది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగాలలో ముస్లింలపై విషం కక్కుతున్నా హద్దు అదుపూ లేకపోయింది. పోలింగ్ శాతానికి సంబంధించిన లెక్కలను క్రోడీకరించడంలో పారదర్శకత చూపించలేక సందేహాలకూ తావిచ్చింది. ఈ కీలక రాజ్యాంగ వ్యవస్థ విశ్వసనీయతకు విఘాతమేర్పడింది. కార్పొరేట్ మీడియావరణాన్ని పూర్తిగా బీజేపీ గుత్తాధి పత్యంలోకి తెచ్చేసుకుంది. సోషల్ మీడియాలోనూ భారీ వనరులు గుమ్మరించింది. ప్రచారంలోనూ ఓటర్లకు పంచిపెట్టడం కోసమూ వేలకోట్ల రూపాయలు వెచ్చించింది. ఇంతచేసినా వారు ఆశించిన ఫలితం రాలేదు, అబ్కా పార్ చార్సౌ పార్ తలకిందులైంది. 303 స్థానాలున్న బీజేపీ సీట్ల సంఖ్య ఈసారి 240కి పడిపోయింది. అంటే 21 శాతం తగ్గింది, ఎన్డీయేకు 292, ఇండియా వేదికకు 234 స్థానాలు వచ్చాయి. చివరకు టీడీపీ, జేడీయూ ల మద్దతుతోనే అధికారంలోకి రాగలిగింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మోడీ ప్రభంజనం తలకిందులైంది.
కుట్రలు మొదలు
లోక్‌సభ ఎన్నికల తర్వాత కీలకమైన శాసనసభ ఎన్నికల పర్వం మొదలైంది. జమ్మూకాశ్మీర్, జార్ఖండ్‌లలో బీజేపీ హడావుడి ఫలించలేదు. అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్, ఇక్కడ ఇండియా వేదిక విజయం సాధించాయి. దాంతో బీజేపీ భయపడిపోయింది. హర్యానా ఎన్నికలలో ఖచ్చితంగా ఇండియా కూటమి వస్తుందని అన్ని సర్వేలు చెప్పినా కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల సంకుచితత్వం కుమ్ములాటల వల్ల అది జరగలేదు. ఆపైన ఎన్నికల నిర్వహణపైనా చాలా సందేహాలు వ్యక్తమైనాయి. ఇక ఢిల్లీలోనైతే ఏకంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌నే అరెస్టు చేసి గందరగోళం సృష్టించారు. ఈ కాలమంతటా జమిలి ఎన్నికల మంత్రం వినిపిస్తూనే వున్నారు. అయితే రాజ్యాంగ సవరణ చేయడానికి కావలసిన బలం అప్పుడు బీజేపీకి లేదు. కనుకనే రాజ్యాంగంలో ఎక్కడా లేని, చెప్పని సర్ మంత్రం కనిపెట్టారు. బీహార్ ఎన్నికల క్రమంలో అనేక చోట్ల సర్ ఓట్లు కోల్పోయిన పేదలు ఆందోళనలు చేశారు.
కానీ ఎవరు పట్టించుకున్నారు? ఆ పైన పోలింగ్‌పైనా సందేహాలు, కాంగ్రెస్ ఆర్జేడీల అవకతవకలు అన్నీ కలిపి మళ్లీ నితీశ్ కుమార్ కొనసాగారు. బీహార్ సర్ తంతు కాగానే అస్సాంపైన పడాలి. ఎందుకంటే విదేశీయులను పంపించి వేయాలనే చిచ్చు మొదట రాజుకున్నదే అక్కడ. ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిశ్వాశర్మ ఆధ్వర్యంలో ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేష వ్యాఖ్యలు పరాకాష్టకు చేరిందీ అక్కడే. చెప్పాలంటే సరిహద్దు రాష్ట్రమైన అస్సాంలో 1980లలోనే అక్కడ విదేశీయుల పంపివేత వంటి రాజకీయ ఉద్యమాలు నడిచాయి. విదేశీయులను ఓటేయనివ్వ బోమని రంకెలు వేసే హోంమంత్రి అమిత్ షా అక్కడ మాత్రం పూర్తిస్థాయి సర్ లేకుండా చేశారు. తదుపరి జనాభా లెక్కలు తేలేదాక అక్కడ సర్ అమలు చేయబోమని, చట్టాలు అడ్డువస్తాయని దాటేసింది ఎన్నికల సంఘం. ఎస్ఐఆర్ అనే సర్దాకా వెళ్లకుండా ఎస్‌ఆర్‌తో సరిపెట్టింది. కానీ ఆ గ్యాప్ రాకుండా ముఖ్యమంత్రి పదవి కోసం హిమంత కాంగ్రెస్ నుంచి దూకడం, ఎజిపి బీజేపీని నెత్తిన తెచ్చిపెట్టడం ఈ పరిస్థితికి దారితీసింది.
ఆ మూడు రాష్ట్రాలు..
తర్వాత బీజేపీ చూపు తమకు కొరకరాని కొయ్యల్లాంటి మూడు రాష్ట్రాలపై పడింది. అవే కేరళ, బెంగాల్, తమిళనాడు. అక్కడ మామూలుగా ప్రజలు ఓటేయలేని పరిస్థితిని కల్పించాలి, ఆదరాబాదరగా నోటీసులు, సమీక్షలు లేకుండా ఓట్లను తొలగించవద్దని సుప్రీంకోర్టు కూడా లాంఛనంగా వ్యాఖ్యానించింది. కానీ ఏదో ఒకటి సాకుతో చివరకు అదే చేస్తూ చివరకు భారీగా తొలగించారు. బీహార్‌లో మొదలై 12 రాష్ట్రాలలో సాగిన సర్ తతంగం భారత పౌరుల ఓటింగు హక్కుకు పెద్ద ప్రమాదంగా తయారైంది. తొలుత ప్రచురించబడిన బెంగాల్లో ఓటర్ల జాబితాలో తొలగింపుల తర్వాత మిగిలిన సంఖ్య 6.56 కోట్లు. సగటున ఓట్లలో13.5శాతం లేకుండా పోయాయి. ఆసక్తికరమైందేమంటే ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 2.89 కోట్ల ఓట్లు తొలగించబడటం. తర్వాత స్థానంలోని తమిళనాడులో 90 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. చేర్పింపులు అతి తక్కువ.అధ్యయనాలు చేసినపుడు ఇసిఐ లెక్కలు, జనాభా లెక్కలకు పొంతన లేదని తేలింది. యూపీ విషయం తీసుకుంటే గ్రామీణ ప్రాంతంలో మూడుకోట్ల ఓట్ల తేడా వచ్చింది.
మళ్లీ శాసనసభ ఎన్నికల దగ్గరకు వస్తే తను ఎన్నడూ గెలవని ప్రధాన శక్తిగా లేని కేరళ, తమిళనాడులలో కాలూనడానికి మామూలు ప్రచారాలు, ఎత్తుగడలు చాలవని బీజేపీకి బాగా తెలిసిపోయింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌తో కలసి కపటనాటకాలాడి కమ్యూనిస్టులను దెబ్బతీసినా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అయితే అక్కడ మళ్లీ మార్క్సిస్టులు మాత్రం బలపడకుండా చూడాలి. అందుకే టిఎంసి, బీజేపీలు లాలూచీ కుస్తీ చేస్తూ ప్రజలను తికమక పెట్టాయి, ఉద్రిక్తతలు పెంచాయి, బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో మత తత్వ రాజకీయాలను కూడా రగిలించాయి. ఈ క్రమంలో ముస్లింల, మహిళల ఓట్లు విపరీతంగా తగ్గించబడ్డాయి. వీటిపై తానే పోరాడుతున్నట్లు మమత బిల్డప్ ఇస్తుంటే పరోక్షంగా ఆమెపైనే విమర్శలు కేంద్రీకరిస్తూ ప్రధాని హోంమంత్రి పర్యటనలతో రెచ్చగొడుతున్నారు. రెండు పార్టీల రాష్ట్రనేతలు కూడా అటూ ఇటూ మారిన వారే.
కీలక కర్తవ్యాలు
కేరళలో పినరాయి విజయన్ నాయకత్వంలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వం ప్రజానుకూల విధానాలతో సమర్థవంతమైన పాలనతో ఆదరణ చూరగొనగలిగింది. గత యాభై ఏళ్ల చరిత్రలో లేని విధంగా వరసగా రెండోసారి అధికారంలోకి రావడమే అందుకో నిదర్శనం. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షకూటమి యూడిఎఫ్కు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ ఇటీవల ఓ సదస్సులో మాట్లాడుతూ పినరాయి మళ్లీ అధికారంలోకి వస్తారనే విషయంలో సందేహం లేదని వ్యాఖ్యానిం చారు. మళయాల మనోరమ సర్వే కూడా విజయన్నే కోరుతున్నట్టు వచ్చింది. ఆరెస్సెస్ దాడులు, మత రాజకీయాలు, కేంద్రం సాగిస్తున్న కుట్రలు గమనించకుండా రాహుల్‌తో సహా ఎల్డిఎఫ్పైనే దాడి కేంద్రీకరించడం దారుణ వాస్తవం. తెలంగాణలో రేవంత్ కాంగ్రెస్ సర్కార్ గొప్పగా పాలిస్తున్నట్టు అక్కడ మళయాల పత్రికలలో భారీగా అడ్వర్టయిజ్మెంట్లు గుప్పిస్తున్నారు.
మోడీ నిరంకుశ విధానాలపై పోరాడవలసిన అవసరాన్ని ఏమాత్రం గుర్తించకుండా కాంగ్రెస్ స్థానికంగా అధికారంలోకి రావడమే పరమావధిగా వారితో అవకాశవాదంగా చేతులు కలిపిన ఉదంతాలు కూడా వున్నాయి. లోక్‌సభ ఎన్నికలలోనూ స్థానిక ఎన్నికలలోనూ బీజేపీకి కొంత ప్రభావం చూపడం, తిరువనంతపురం కార్పొరేషన్ గెల్చుకోవడం ఈ పూర్వరంగంలో జరిగినవే. వీటిపైన సమీక్ష చేసిన సీపీఐ(ఎం) మరింత పటిష్టంగా యుడిఎఫ్, బీజేపీలను ఓడించి హ్యాట్రిక్ సాధించాలని పట్టుదలగా పనిచేస్తున్నది. తమిళనాడులో సీఎం స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకె, కాంగ్రెస్ వామపక్షాల కూటమి బలమైందిగా కొనసాగు తున్నది. కమల్‌హాసన్ ఎంఎన్ఎం కూడా జతకలిసింది. ఇక అన్నా డిఎంకెతో జట్టుకట్టి మత రాజకీయాలతో పాగా వేయాలని బీజేపీ నానా తంటాలు పడుతున్నది.
దళపతి విజయ్ స్థాపించిన టివికెను కూడా తమతో కలుపుకోవాలని బీజేపీ ఒత్తిడి పెట్టినా ఆయన నిరాకరించారు. మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళ కూడా కొత్త పార్టీ పెట్టారు. ఇన్నిటి మధ్యనా డిఎంకె కూటమికే ఓటర్లు అనుకూలంగా వున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. పాండిచ్చేరిలోనూ కాంగ్రెస్ చీలికవర్గమైన రంగస్వామి కాంగ్రెస్‌తో కలసి పాలన చేస్తున్న బీజేపీకి ఈసారి ఎదురుగాలి వీస్తున్నట్టు చెబుతున్నారు.ఇక ఈశాన్య ప్రాంతంలోని అస్సాంలో అచ్చంగా మతోద్రిక్తతలు పెంచడం, అక్కడ మియాలుగా పిలవబడే మైనార్టీలపై విషప్రచారం హిమంత బిశ్వాశర్మ ఏకైక మార్గంగా చేసుకున్నారు.ఈ తరుణంలో కేరళలో ఎల్‌డిఎఫ్‌ను మళ్లీ గెలిపించుకోవడం మొదటి కర్తవ్యం కాగా తమిళనాడులోనూ డిఎంకె లౌకిక శక్తుల కూటమిప్రభుత్వం నిలబెట్టుకోవడం అవసరం.
బెంగాల్లో టిఎంసి బీజేపీలను తిప్పికొట్టి ప్రజాస్వామిక లౌకిక శక్తులను బలోపేతం చేసుకోవాలి. అస్సాంలో దేశసమైక్యత లౌకికతత్వం కోసం నిలబడే బీజేపీ వ్యతిరేక శక్తులన్నిటినీ ఒక్కతాటిపైకి తెచ్చి పోరాడాలి.ఎన్నికల తేదీల ప్రకటన వచ్చేస్తున్నది గనక ఈపని మరింత వేగం పుంజుకోవలసి వుంటుంది. అయితే బీహార్‌లో గొప్పగా గెలిచారన్న నితీశ్ కుమార్‌ను గద్దెదింపిన తీరుచూస్తే మిగిలిన ప్రాంతీయ పార్టీలను మోడీ ఏం చేయబోయేది అర్థమవుతుంది. వివిధ ప్రాంతీయ పార్టీల తగు మెళకువ చూపకపోతే బీజేపీ కబళించడం ఖాయం. ఈ పోరాటంలో అన్ని లౌకిక పక్షాలు, వామపక్ష ప్రజాస్వామిక శక్తులు ఆ విధమైన విజ్ఞత ప్రదర్శిస్తాయని ఆశిద్దాం.
తెలకపల్లి రవి



