రెండు సార్లు ఫొటోలతో కష్టాలు
పనిచేయని నూతన యాప్.. మండుటెండల్లో మగ్గుతున్న వైనం
కేంద్రం తెచ్చిన నూతన పథకంతో ఇబ్బందులు.. రాష్ట్రాలపై భారం..
ఎనిమిది వారాలుగా ‘ఉపాధి’ కూలీలకు అందని వేతనాలు
పని ప్రదేశాల్లో నీడ, నీళ్లు, మెడికల్ కిట్స్ కరువు
ఉపాధి హామీ కూలీల సమస్యలు వర్ణనాతీతం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఓ వైపు ఎండలు మండుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనుల్లేవు. ఉత్తగనే ఉంటే ఇల్లు గడవదు కదా అని కూలీలు ‘ఉపాధి పనులు’ చేస్తున్నారు. పొద్దున పని మొదలెట్టి మధ్యాహ్నం వరకు మండుటెండల్లో మగ్గి పని చేస్తున్నారు. అయినా పని ప్రదేశంలో సరైన సదుపాయాలు ఉండవు. మంచినీళ్లు, నీడ కోసం టెంట్లు, మెడికల్ కిట్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించరు. అయినా కష్టపడి పనిచేస్తున్నా.. వేతనాలు సమయానికి ఇవ్వడం లేదు. సుమారు ఎనిమిది వారాలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో పస్తులుంటున్న పరిస్థితి. పని చేసిన 15 రోజుల్లో వేతనాలు చెల్లించాలని ఈజీఎస్ చట్టమున్నా ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ముఖ యాప్‌తో కూలీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పని ప్రారంభానికి ముందు, పని ముగిసిన తర్వాత రెండుసార్లు ఫేస్ ఫొటో తీయాల్సి రావడంతో వారు అదనంగా పని ప్రదేశంలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్రం ఈ పథకానికి నిధుల్లో కోత పెట్టి నిర్వీర్యం చేయాలని చూస్తుంటే.. కేంద్రం పెట్టిన భారంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవనే సాకుతో కూలీలకు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపాధి కూలీల పని ప్రదేశం వద్దకు వెళ్లిన ‘నవతెలంగాణ’ ప్రతినిధికి తమ సమస్యలను ఏకరవు పెట్టారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 5.8 లక్షల జాబ్ కార్డులున్నాయి. వీటిల్లో 11.29 లక్షల మంది కూలీలు నమోదై ఉన్నారు. ఎస్సీ, బీసీ కుటుంబాలకు చెందిన వారితో పాటు చిన్న, సన్నకారు రైతుల కుటుంబాల నుంచి కూడా ఉపాధి పనులు చేస్తున్నారు. వేసవిలో మట్టి పనులు కష్టతరంగా మారినా.. పార, గడ్డపార, తట్టలన్నీ సుర్రున కాలుతున్నా.. చేతులకు బొబ్బలొచ్చినా.. కష్టజీవులు పొట్ట కోసం కష్టపడి పనిచేస్తున్నారు. చట్టం ప్రకారం ఎండాకాలం పని ప్రదేశాల్లో కూలీలకు సేద తీరేందుకు టెంట్లు, చలువ పందిళ్లు వేయాలి. అలాం టివేవీ పని ప్రదేశాల్లో కనిపించడం లేదు.
మంచి నీళ్ల సదుపాయం లేకపోవడంతో ఇంటి నుంచి తీసుకెళ్లిన లీటర్, రెండు లీటర్ల డబ్బా నీళ్లతోనే సరిపుచ్చుకోవాల్సి వస్తుందన్నారు. ఆ నీళ్లు కూడా ఎండకు వేడెక్కడం వల్ల అవి తాగలేకపోతున్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి కుండల్లో నీళ్లు పెట్టాలని కూలీలు కోరుతున్నారు. ఎండల్లో పనిచేస్తున్నందున కొందరికీ డీహైడ్రేషన్ సమస్య తలెత్తి వాంతులు చేసుకుంటున్నారు. తక్షణ ఉపస మనం కోసం మెడికల్ కిట్స్ అందుబాటులో ఉంచాల్సిన అధికారులు వాటి గురించే పట్టించుకోవడంలేదు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూలీలు పనిచేస్తున్నారు. పని ప్రదేశం నుంచి ఇంటికి రావాలంటే మరో ఒకటి నుంచి రెండు కిలో మీటర్లు నడిచి వస్తారు.
రెగ్యూలర్‌గా వేతనాలు ఇవ్వాలి
ఎండల్లో పనులు చేస్తున్న కూడా మాకు రావలసిన కూలి డబ్బులు రెగ్యూలర్‌గా ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఇంట్లో తినాలంటే అన్ని కొనుక్కోవాలి. కూలీ డబ్బులు రెండు వారాలు, ఎనిమిది వారాలు కూడా ఇవ్వకుంటే ఎలా బతకాలి. ఏది కొనాలన్నా ధరలు అధికంగా ఉన్నాయి. కూలి రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. బయట చేద్దామంటే ఎలాంటి పనులూ లేవు.
-పార్వతమ్మ, ఉపాధి కూలీ
ఫొటోలు తీసివేయాలి : వెంకటమ్మ
ప్రభుత్వం రెండు ఫొటోలు తీయాలనే నిబంధన తీసివేయాలి. ఉదయం 7 గంటలకు పనులకు వస్తాం. కేంద్రం తెచ్చిన కొత్త పథకం లో పని మొదలు పెట్టే సమయంలో ఒక ఫొటో, పనులు పూర్తి అయిన తర్వాత మరో ఫొటో తీయాలని అధికారులు చెబుతున్నారు. దాని వల్ల మేము పనులు చేసిన దాని కంటే ఎక్కవ సేపు పని చేసే ప్రాంతంలోనే ఉండాల్సి వస్తుంది. కష్టం చేసుకుని బతుకుతున్నాం. కూలీ డబ్బులు వారం వారం ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. రెండు నెలల నుంచి వేతనాలు రావడం లేదు. మాకు వారం వారం కూలీ డబ్బులు ఇవ్వాలి. ప్రభుత్వాలు పట్టించుకోవాలి.
కేంద్రంపై పోరాడుదాం- ఉపాధి హామీని కాపాడుకుందాం
ఉపాధిహామీ చట్టం రక్షణకు కేంద్రంపై పోరాటం చేసి కాపాడుకుందాం. వీబీజీఆర్‌ఏఎంజీ పథకాన్ని రద్దు చేయాలి. పాత పద్ధతిలోనే ఉపాధి హామీని కొనసాగించాలి. కేంద్రం 90 శాతం నిధులు, రాష్ట్రం 10శాతం నిధులతో ఉపాధి హామీని కొనసాగించాలి. పని ప్రదేశంలో టెంట్లు, మెడికల్ కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మంచినీళ్లు అందుబాటులో ఉంచాలి. ప్రతి కూలీకి పనిముట్లను ఇవ్వాలి. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం రద్దుచేసి ఐరిస్ ఫొటోల ద్వారా హాజరు తీసివేయాలి. వేసవి సందర్భంగా 40శాతం ప్రభుత్వం అదనంగా ఇవ్వాలి. అడిగిన 15 రోజుల్లో పనులు కల్పించకపోతే నిరుద్యోగ భృతి చెల్లించాలి. సంవత్సరంలో 200 రోజుల పని దినాలు, రోజు కూలి రూ.800 ఇవ్వాలి. అడిగిన వారందరికీ వెంటనే జాబ్ కార్డులూ ఇవ్వాలి. పాత పద్ధతి కొనసాగించేందుకు ఈ నెల 20వ తేదీన నిర్వహించే చలో కలెక్టరేట్ జయప్రదం చేయాలి.
-సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.నర్సింలు
పని చేసేందుకు పారలు, గడ్డపారలు ఇవ్వాలి : ప్రవీణ్
పలుగు, పార పట్టి పనిచేయడం వల్ల చేతులకు పొక్కులొస్తున్నాయి. గుడ్డలు కట్టుకుని పని చేస్తున్నాం. ఇంటికెళ్లి బువ్వ తిందామంటే కారం తగిలి ప్రాణం తల్లడిళ్లుతోంది. నీళ్లులేవు, నీడ లేదు. దెబ్బతగిలితే కనీసం కట్టు కట్టుకునేందుకు దిక్కులేదు. ఇవన్నీ అడిగితే ప్రభుత్వం ఇయ్యనిది మేం ఏం చేస్తమంటూ అధికారులు చెబుతుండ్రు.



