సభకు ముందు
పడుక్కి ఇంటిని తెల్లగా మెరిపిచ్చినట్లు
దారులను సున్నంతో సింగారిస్తరు
అప్పుదెచ్చి పెండ్లి అగాదాలు పూడ్చినట్లు
రోడ్లని మొరంతో మేకప్ జేస్తరు
సభా ప్రాంగణం సొంత డబ్బా పాటలతో
డ్యాన్న్స్ లతో ఊగిపోతుంటది
సి సి కెమెరాలు సి ఐ డి నిఘా చూపులు
చీమ కాళ్ల వేళ్ళను సైతం రికార్డు చేసీ చెసి అలసిపోతయి
కల్వట్లు, ఎలుక పొక్కలు నిరసన కదలికలను
మెటల్ డిటెక్టర్, సర్కారు జాగిలాలు
అడుగు అడుక్కి మురికి సూసీ సూసి మూర్చిల్లుతయి
దారికడ్డం ఇనుప గోడలు, జవాన్లు
వాళ్లకు నాగజముడులా కాపలా ఉంటరు
ఆ రోజంతా రోడ్ల కు తాలాలు పడి
అంగుళానికో లాఠీ అడ్డమొచ్చి
సొంతూరు వాళ్ళని పరాయిలుగా చేస్తది
దారికి రెండు పక్కలబడి పిల్లలు
స్వాగతాలఎదురు చూపులు చూసి చూసి
కండ్లు అట్టిపోయి,కాళ్ళు కట్టెలయిపోతయి
నియమాలు నియ్యతులు సూరుకు తలిగేసి
తెల్లజెర్రీలముందుగుస్సాడీ ఆడుతయి
నైంటి ప్లస్ బిర్యానీపొట్లాల గొర్రెలకోసం
పొద్దుగాల్లనే లారీలు ఊళ్ళే దిగుతయి
ఓడిన సర్పంచ్ నుంచి కొత్త మొఖం దాకా
సభసక్సెస్‌కి థరంజుగా సాగీసాగి సిటీకి చేరుకుంటది
సభ మధ్యలో
సభలో మాటలచినుకులు రాలడంతోనే
అబద్ధపు హామీలకు మొసలునుమించిఏడ్చిఏడ్చి
మైకు గుండె నిండా గాట్లు పడి
నల్లటి దుఖాన్ని కారుస్తుంటది
కిరాయిసీటీలు, చప్పట్లు కొన్ని
వాళ్ళ ఉద్దెర మాటలకు జైకొడ్తునే ఉంటయి
కుర్చీ కిందున్న కుక్క స్పీచ్ లు వింటూ వింటూ
నా భాషలోనే అరుస్తున్నారనితెగమురిసిపోతది
సభ సక్సెస్ కోసం ఇంటి కాల్స్ ని కట్ చేస్తూ
జేబులోనే మొబైల్ ను జోకొడుతూ జోకొడుతూ
కాపలా కాస్తుంటాడు హోమ్ గార్డ్
సభ తరువాత
కిందికి దిగిన ఖాదీ తోడేళ్లు
జీడీ పప్పుచీర్స్ చికెన్ డిన్నర్లు కానిచ్చి
వూరు శివారం డాటంగనే ఎడ్డిజనాలమొఖాలని
తలుచుకుంటూ తల్చుకుటూ
పగల బడి నవ్వుకుంటూ దారి పడ్తయి
ఖాళీ గ్రౌండులోహామీలమొలలుకుచ్చుకున్నమంది
కుంటుకుంటూ కుంటుకుంటూ ఇంటి దారిని వెతుక్కుంటరు
డా. ఉదారినారాయణ, 9441513666
బహిరంగ సభ
- Advertisement -
- Advertisement -



