Monday, March 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపార్టీలో, ప్రభుత్వంలో మహిళలకు సముచిత స్థానం

పార్టీలో, ప్రభుత్వంలో మహిళలకు సముచిత స్థానం

- Advertisement -

– మహేశ్‌కుమార్‌ గౌడ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కాంగ్రెస్‌ పార్టీలో, ప్రభుత్వంలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులుగా, రాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులుగా అనేక హోదాలతో మహిళలకు గుర్తింపునిచ్చిన పార్టీ కాంగ్రెస్‌ అని తెలిపారు. భవిష్యత్తులోనూ కాంగ్రెస్‌ అదే వైఖరితో ముందుకెళ్తుందని ఆయన చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మొదటి ఐదేండ్లలో ఒక్క మహిళను కూడా మంత్రిని చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ఇచ్చినన్ని అవకాశాలు మహిళలకు మరే పార్టీ ఇవ్వలేదన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలు పెరగబోతున్నాయనీ, ప్రజలతో సంబంధాలు కలిగి పార్టీ కోసం పని చేసే మహిళకు మంచి అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. కాంగ్రెస్‌ లో పని చేసే వారికి గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్‌ఎస్‌యూఐ జిల్లా నాయకునిగా ప్రారంభమైన తాను టీపీసీసీ అధ్యక్షునిగా పార్టీ అవకాశం ఇచ్చిందన్నారు. పీసీసీ కార్యవర్గంలోకి మహిళలను తీసుకుంటామనీ, సీనియార్టీని బట్టి ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులుగానూ అవకాశాలిస్తామని చెప్పారు. ఏప్రిల్‌లో కార్పొరేషన్‌ చైర్మెన్‌ పదవులు 70 నుంచి 80 పదవులు భర్తీ చేయబోతున్నామనీ, అందులో 20 శాతం వరకు మహిళలకు రాబోతున్నాయని తెలిపారు.
డ్రగ్స్‌ కేసులో రాజకీయం లేదు
మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్‌ బృందం సమాధానం చెప్పాలని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఈ కేసులో ఈగల్‌ బృందం తమ కర్తవ్యాన్ని నెరవేర్చిందనీ, దీనిలో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు. ”డ్రగ్స్‌ రహిత సమాజం కోసం ఈగల్‌ బృందం దాడులు చేపడుతోంది. కేటీఆర్‌, ఆయన అనుచరులు డ్రగ్స్‌ తీసుకుంటున్నట్టు అనుమానాలు ఉన్నాయి. అవసరమైతే డ్రగ్స్‌ పరీక్షలకు కేటీఆర్‌ సిద్ధం కావాలి. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం పరీక్షలు చేయించుకుందాం. డ్రగ్స్‌ రహిత తెలంగాణ కోసం సీఎం రేవంత్‌ కృషి చేస్తున్నారు” అని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు.

ట్రంప్‌ ఆదేశాలను పాటిస్తున్న మోడీ:అల్క లంబ
దేశ ప్రజల ప్రయోజనాలను వదిలేసి ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలను పాటిస్తున్నారని మహిళా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు అల్క లంబ విమర్శించారు. అమెరికా, ఇజ్రాయిల్‌ యుద్ధం చేస్తుంటే దాంతో మనం నష్టపోతు న్నామని ఆమె తెలిపారు. గ్యాస్‌ కొరతతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడి వ్యాపారాలు దెబ్బతినీ, ఉపాధి కోల్పోతూ ప్రజలు ఇబ్బంది పడుతుంటే మోడీ ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారని తప్పుపట్టారు. అమెరికా వద్ద మోకరిల్లిన మోడీకి బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. గాంధీ శాంతియుత ఆలోచనల కోసం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పోరాడుతున్నారని తెలిపారు. ఆయనకు మద్దతుగా మహిళలను సమాయత్తం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కామాక్షి రాజన్న, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు సునీతారావు, నేరెళ్ల శారద, పీసీసీ ఉపాధ్యక్షు రాలు కోట నీలిమ, ఎంపీ కావ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -