గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి: మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో 2కే రన్
నవతెలంగాణ-సిటీబ్యూరో/ఉస్మానియా యూనివర్సిటీ
భగత్ సింగ్ స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని పుణికిపుచ్చుకుని, సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా యువత పోరాటాలకు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ‘భగత్ సింగ్ యువజనోత్సవాలు’ ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు ‘2కే రన్’ నిర్వహించి, గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ.. నేడు సమాజంలో సామ్రాజ్యవాద దోపిడీ కొత్త రూపాల్లో కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యా, వైద్య రంగాలు పేదలకు అందని ద్రాక్షగా మారుతున్నాయని, నిరుద్యోగం, మతోన్మాదం, అసమానతలు పెరిగిపోతున్నాయని తెలిపారు. ప్రపంచంపై ఆధిపత్యం కోసం అమెరికా.. వివిధ దేశాలపైన యుద్ధాలు చేస్తూ దేశ అధ్యక్షులను, దేశ ప్రజలను హతమరుస్తుందన్నారు. పశ్చిమాసియా దేశాల యుద్దాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడి ధరలు పెరిగిపోతున్నాయని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్‌కు లొంగిపోయి మౌనంగా ఉండటం సిగ్గుచేటన్నారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రాణాలర్పించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ స్ఫూర్తితో నేటి అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించాలని యువతకు దిశానిర్దేశం చేశారు.
డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత గంజాయి, డ్రగ్స్ వంటి దురలవాట్లకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. ప్రభుత్వాలు నిరుద్యోగాన్ని పెంచి పోషించడం వల్లే యువత చెడు వ్యసనాల వైపు మళ్లుతున్నారని తెలిపారు. డ్రగ్స్ రవాణా చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలనీ, యువతను బలిగొంటున్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తూ.. యువతను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈనెల 15 నుంచి 23 వరకు భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాల్లో యువత భాగస్వాములు కావాలని కోరారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.ఎల్.మూర్తి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్ర అని విమర్శించారు. చరిత్రను వక్రీకరించి మత విద్వేషాలను రెచ్చగొడుతున్న విధానాలను ఖండించారు. భగత్ సింగ్ బాటలో అవినీతిని అంతం చేయడానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్, అశోక్ రెడ్డి, జావీద్తో పాటు ప్రజా సంఘాల నాయకులు కొమ్ము విజయ్, సంగీత, మారన్న, సైదులు, పవన్, వెంకటరెడ్డి, రాజయ్య, సునీల్, రవి, నాగేందర్, రజనీకాంత్, అర్జున్, ప్రవీణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



