నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణను సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ పరామర్శించారు. గత వారం సినిమా షూటింగ్లో గాయపడిన బాలకృష్ణకు ఇటీవల మోకాలికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా చంద్రబాబు.. తన బావమరిది అయిన బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన ఎంత వేగంగా కోలుకుంటున్నదీ వాకబు చేశారు. అనంతరం వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడి బాలకృష్ణకు అందిస్తున్న చికిత్స, తదుపరి పునరావాస ప్రణాళికల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ నెల 21న రాజమండ్రిలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నప్పుడు బాలకృష్ణ ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఆయన ఎడమ మోకాలికి తీవ్ర గాయం కావడంతో మరుసటి రోజే ఆయన్ను ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించి ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం బాలకృష్ణ ఎడమ కాలి క్వాడ్రిసెప్స్ టెండన్ (తొడ కండరాన్ని మోకాలి చిప్పకు కలిపే కణజాలం) చిరిగిందని, మోకాలికి ఇరువైపులా ఉన్న సహాయక కణజాలాలు కూడా దెబ్బతిన్నాయని వైద్యులు నిర్ధారించారు.


