Thursday, March 19, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిచర్చ పేరుతో రచ్చ!

చర్చ పేరుతో రచ్చ!

- Advertisement -

‘ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం’ అన్నట్లుగా ఏ చట్ట సభను చూసినా అదే అనిపిస్తున్నది. చర్చ పేరుతో రచ్చ తప్ప జనానికి ఉపయోగపడే అంశాలు ప్రస్తావనకు రావటం లేదు. కాపురం చేసే కళ కాళ్లగోళ్ల దగ్గరే తెలుస్తుందన్నది లోకోక్తి. తెలంగాణా 2026-27 బడ్జెట్‌ సమావేశాలు ఎలా జరిగేదీ గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో అధికార, ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు వెల్లడించింది. ప్రతియేటా బడ్జెట్‌కు ముందు రాష్ట్ర గవర్నర్‌ అసెంబ్లీ, శాసనమండలి సభ్యుల సంయుక్త సమావేశంలో ప్రసంగించే ప్రక్రియను సోమవారం నాడు ఈ ఏడాది కూడా నూతన గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా పూర్తి చేశారు. ఆ ప్రసంగంపై మంగళ, బుధవారాల్లో చర్చ పేరుతో రచ్చ జరిగింది తప్ప రాష్ట్ర ప్రజానీకం తెలుసుకొనే అంశాలేవీ ప్రస్తావనకు రాలేదంటే అతిశయోక్తి కాదు. బడ్జెట్‌ పద్దులపై అయినా అర్ధవంతమైన చర్చ సాగుతుందా? అడ్డు సవాళ్లతో సరిపెడతారా అన్నది చూడాల్సి ఉంది.

వరుసగా అరవై రోజుల పాటు చట్ట సభలకు హాజరుకాకపోతే సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చనేది నిబంధన. తెలంగాణాలో ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్‌కు కాబినెట్‌ హోదా ఉంది. అయినప్పటికీ ఎలాంటి కారణం చెప్పకుండా సభను బహిష్కరిస్తున్నారు. ‘ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు మేం లేమా’ అని బీఆర్‌ఎస్‌, ఇతర నేతలు తర్కానికి నిలవని వాదనలు చేస్తున్నారు. రాష్ట్రాల్లో గవర్నర్‌, కేంద్రంలో రాష్ట్రపతి ప్రసంగాలైనా ఆయా ప్రభుత్వాల మంత్రివర్గాలు రూపొందించేవే. రాజ్యాంగ నిబంధనలోనే అలా పెట్టుకున్నాము. అయితే బీజేపీ నియమించిన గవర్నర్లు ఇతర పార్టీల పాలిత రాష్ట్రాలలో మంత్రివర్గాలు రూపొందించిన ప్రసంగాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే పేరాలు ఉంటే వాటిని చదివేందుకు నిరాకరించటం, స్వంతపైత్యాన్ని జోడించటం వంటి పనులు చేస్తూ స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు. తెలంగాణా గవర్నర్‌కు అలాంటి అవకాశం రాలేదు, ఎందుకంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్రం మీద ఎలాంటి విమర్శలనూ దానిలో చేర్చకపోవటమే. తెలంగాణాకు కేంద్ర ప్రభుత్వం అనేక అంశాల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నది.

ఇతర సందర్భాలలో కాంగ్రెస్‌ పార్టీ వాటిని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నప్పటికీ అధికారిక ప్రసంగంలో ప్రస్తావించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. కేంద్రంతో సఖ్యతగా ఉంటే పనులవుతాయన్న భ్రమలకు రేవంత రెడ్డి సర్కార్‌ లోనవుతున్నదా? ఇప్పటి వరకు కేంద్రంతో ఘర్షణ పడిందేమీ లేదు, పెద్దగా ఒరిగిందేమీ లేదు. గవర్నర్‌ ప్రసంగాలంటే ప్రభుత్వం ప్రచారం చేసుకొనే అంశాలు, రాబోయే ఏడాది చేపట్టబోయే కొత్త అంశాల గురించి సూచన ప్రాయంగా తెలియచేయటం ఉంటుంది. సోమవారం నాటి గవర్నర్‌ ప్రసంగం పాత విషయాల పునశ్చరణ తప్ప కొత్తవేమీ లేవు. రైతు భరోసా కొత్తదేమీ కాదు, ఇతర పథకాలన్నీ గత రెండేళ్లుగా అమలు చేస్తున్నవే. జలయజ్ఞం పనులను మూడేళ్లల్లో పూర్తి చేస్తామని చెప్పారు. అదెంతమేరకు సాకారమవుతుందో బడ్జెట్‌ కేటాయింపుల తరువాత మరోసారి ముచ్చటించుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు, వాటికి ఇంతవరకు చేసిన ఖర్చు, ఇంకా ఎంత అవసరమో తెలుపుతూ శ్వేతపత్రం ప్రకటిస్తే జనం అర్ధం చేసుకుంటారు.

అలాగే ఎన్నికల వాగ్దానాల్లో ఇంతవరకు వెలుగుచూడని వాటి కార్యాచరణ గురించి ఎక్కడా మాట మాత్ర ప్రస్తావనలేదు. రెండేళ్లుగా ఉద్యోగులు కొత్త వేతన సవరణ కోసం, ఐదు డిఏ బకాయిల విడుదల గురించి ఎదురు చూస్తున్నారు. వాటి ఊసులేదు, ఉమ్మడి రాష్ట్రంలో అసంఘటితర రంగ కార్మికులకు జరిగిన వేతన సవరణ తప్ప బంగారు తెలంగాణా, ఇందిరమ్మ రాజ్యంలోనూ వామపక్షాలు, కార్మిక సంఘాలు తప్ప ఏ ఒక్క పార్టీ, ప్రభుత్వం కూడా ప్రస్తావించటం లేదు. ఆర్థిక అంశాల గురించి ఈ ఏడాది మార్చినెల వరకు తనను అడగవద్దని ముందే చెప్పిన ముఖ్యమంత్రి తర్వాత కూడా అదే చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు గవర్నర్‌ ప్రసంగ అంశాలున్నాయి.

అసంఘటిత రంగ కార్మికులకు వేతనాలు పెంచితే ప్రభుత్వం మీద పైసా భారం పడదని తెలిసినప్పటికీ వాటిని ఎందుకు సవరించరు? కారణమేమిటంటే పారిశ్రామిక, వాణిజ్యవేత్తల మెప్పు, తద్వారా ఎన్నికల నిధులు పొందేందుకు తప్ప ఇతర కారణాలేమీ కనిపించటం లేదు. మోడీ సర్కార్‌ ఆర్భాటంగా ప్రకటించిన వికసిత్‌ భారత్‌లో 2047 నాటికి జిడిపి 30లక్షల కోట్ల డాలర్లని ఊరిస్తున్నారు. ఇదేవిధంగా తెలంగాణా మూడు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని సంకల్పం చెప్పుకున్నారు. ఐదు కోట్ల జనాభాకు పైబడిన రాష్ట్రాలు పన్నెండు. అవి కూడా ఇలాంటి లక్ష్యాలనే నిర్ణయించుకుంటే ఆ మొత్తమే 36లక్షల కోట్ల డాలర్లు అవుతాయి. మిగిలిన పదహారు పెద్ద రాష్ట్రాలు, చిన్న, కేంద్ర పాలిత ప్రాంతాల సంగతేమిటి? కబుర్లకు పిసినారితనం ఎందుకన్నట్లుగా ఈ లక్ష్యం ఉంది తప్ప వాస్తవాల ప్రాతిపదికన లేదని చెప్పక తప్పదు!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -