Thursday, March 19, 2026
E-PAPER
Homeజాతీయంసంక్షేమం కోసమే అప్పులు!

సంక్షేమం కోసమే అప్పులు!

- Advertisement -

వికలాంగులకు అండగా ఉంటాం : సిఎం చంద్రబాబు – మంగళగిరిలో ‘దివ్యాంగుల శక్తి’ ప్రారంభం

గుంటూరు : వికలాంగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం అప్పులు చేసినా, కేంద్రం నుంచి నిధులు తెచ్చినా పేదల సంక్షేమం కోసమేనని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో బుధవారం ఆర్‌టిసి బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని డిప్యూటీ సిఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌తో కలిసి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం మంగళగిరి బస్‌ స్టేషన్‌ నుంచి పెనుమాక వరకు వికలాంగులతో కలిసి వారు ముగ్గురూ పయనించారు. ఆ తర్వాత క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ వారితో కొద్దిసేపు సమావేశమై యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

అందరినీ ఆప్యాయంగా పలకరించిన ముఖ్యమంత్రి వారితో కలిసి భోజనం చేశారు. ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంపై ముఖ్యమంత్రికి వికలాంగులు ధన్యవాదాలు తెలిపారు. వికలాంగులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వికలాంగుల శక్తిని ప్రపంచానికి చాటేలా, ఆత్మస్థైర్యంతో పని చేసేలా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా వికలాంగులకు ఆత్మగౌరవం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. సాధికారత సాధించడానికి, గౌరవాన్ని మరింత పెంచడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, భవిష్యత్తులోనూ వారిని ఆదుకునేలా మరిన్ని ఆలోచనలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఆసక్తి ఉన్న వికలాంగులకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు వెళ్లేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. వికలాంగులు అంటే విభిన్న ప్రతిభావంతులని, సమస్యను అధిగమించి విజయాలు సాధించే శక్తి ఉన్న వాళ్లని పేర్కొన్నారు.

గతంలో చేయూత కార్యక్రమం ద్వారా వికలాంగులకు సహాయం చేశామని, ట్రైసైకిళ్లతోపాటు టూ వీలర్లు అందించామని గుర్తు చేశారు. పింఛను కింద రూ.6 వేలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని తెలిపారు. తీవ్ర ఆరోగ్య ఇబ్బందుల్లో ఉండే వారికి రూ.10 వేలు, మంచానికి పరిమితమైన వారికి రూ.15 వేలు ఇస్తున్నామని వివరించారు. ప్రస్తుతం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని, ఐదు రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. ‘దివ్యాంగ శక్తి’ పథకం ద్వారా 12.75 లక్షల మందికి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నామన్నారు. మహిళల కోసం తెచ్చిన స్త్రీ శక్తి పథకం ద్వారా ఇప్పటి వరకూ 52 కోట్ల ప్రయాణాలు జరిగాయని తెలిపారు. వికలాంగుల సమస్యలపై పోరాడుతున్నారంటూ మంద కృష్ణమాదిగ, గోనుగుంట్ల కోటేశ్వరరావులను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -