Saturday, March 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసంక్షోభానికి ముందే ప్రమాద ఘంటికలు

సంక్షోభానికి ముందే ప్రమాద ఘంటికలు

- Advertisement -

భారత కీలక రంగాల మందగింపు
ఫిబ్రవరిలో 2.3 శాతానికి పతనం
పశ్చిమాసియా ఉద్రిక్తలతో మరింత తీవ్రమే..!

నవతెలంగాణ – బిజినెస్‌ డెస్క్‌
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభం కాకముందే భారతదేశపు కీలక పారిశ్రామిక రంగాల ఉత్పత్తి అమాంతం మందగించింది. శుక్రవారం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి 2026లో దేశ ఆర్థిక వ్యవస్థలోని ఎనిమిది కీలక రంగాల వృద్ధి 2.3 శాతానికి పడిపోయింది. ఇది మూడు నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఇంతక్రితం జనవరిలోని 4,7 శాతం పెరుగుదలతో పోల్చితే సగానికి పడిపోవడం మందగింపు తీవ్రతను స్పష్టం చేస్తోంది. ఈ ఎనిమిది రంగాలు దేశ మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 40 శాతం పైగా వాటాను కలిగి ఉన్నాయి. అమెరికా సామ్రాజ్యవాదంతో పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా మార్చి నెలలో ఎగుమతులు, సరఫరాపై మరింత ప్రభావం పడి వృద్ధి ఇంకా మందగించే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

దేశీయంగా చమురు, గ్యాస్‌, పెట్రోలియం ఉత్పత్తుల ఉత్పత్తి గత కొన్ని నెలలుగా క్షీణిస్తూ వస్తోందని.. ఇప్పుడు అంతర్జాతీయ సరఫరా ఇబ్బందులు దీనిని మరింత క్లిష్టతరం చేశాయని మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి. మరోవైపు భారత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ 94 చేరువకు పడిపోవడం, విదేశీ మారకం నిల్వలు అమాంతం కరిగిపోవడం, స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలడం దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రమాధ ఘంటికలను మోగిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ”పశ్చిమాసియా సంక్షోభం మొదలవ్వక ముందే ఫిబ్రవరి 2026లో కీలక రంగాల ఉత్పత్తి వృద్ధి 2.3 శాతానికి పడిపోయింది. జనవరిలో నమోదైన 4.7 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే ఇది సగానికి పడిపోవడం గమనార్హం. కేవలం సిమెంట్‌, ఉక్కు రంగాలు మాత్రమే 3.5 శాతం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేయగలిగాయి.” అని ఇక్రా చీఫ్‌ ఎకనామిస్ట్‌ అదితి నాయర్‌ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభానికి ముందే భారత్‌కు గడ్డు కాలం మొదలయ్యిందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తోన్నాయి.

సిమెంట్‌ రంగం ఈ ఏడాది ఫిబ్రవరిలో 9.3 పెరిగినప్పటికీ ఇది కూడా ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి. గత మూడు నెలలుగా కొనసాగుతున్న రెండంకెల వృద్ధికి బ్రేక్‌ పడింది. ఉక్కు రంగం 7.2 శాతం పెరుగుదలను నమోదు చేసినా.. ఇది కూడా మూడు నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ముడిచమురు ఉత్పత్తి వరుసగా ఆరో నెల ఫిబ్రవరిలోనూ 5.2 శాతం క్షీణించింది. సహజ వాయువు ఉత్పత్తి వరుసగా 20 నెలలోనూ 5 శాతం తగ్గింది. రిఫైనరీ ఉత్పత్తుల్లో 1 శాతం తగ్గుదల నమోదయ్యింది.. ఈ ఆర్థిక సంవత్సరంలోని 11 నెలల్లో ఆరు సార్లు ఈ రంగం ప్రతికూల వృద్ధినే కనబరిచింది. ఎరువుల రంగం 3.4 శాతం క్షీణతతో ఐదు నెలల కనిష్టానికి, బొగ్గు రంగం 2.3 శాతంతో మూడు నెలల కనిష్టానికి, విద్యుత్‌ ఉత్పత్తి 0.5 శాతంతో మూడు నెలల కనిష్టానికి మందగించాయి. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగి ఇంధన ధరలు పెరిగితే.. వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని అదితి నాయర్‌ హెచ్చరించారు.

రెండు వారాల్లో 18 బిలియన్లు ఫట్‌..
భారత విదేశీ మారకం నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. మార్చి 13తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక నిల్వలు ఏకంగా 7.05 బిలియన్‌ డాలర్లు తగ్గి 709.76 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. గత రెండు వారాల్లోనే దాదాపు 18 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1.6 లక్షల కోట్లు) నిల్వలు కరిగిపోవడం గమనార్హం. అటు రూపాయి పతనం, ఇటు విదేశీ మారక నిల్వలు కరిగిపోవడం, కీలక రంగాల మందగమనం కలిసి దేశ వాణిజ్య లోటును మరింత పెంచనున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆర్థిక వ్యవస్థను మందగించేలా చేసి.. అంతిమంగా సామాన్యుల ఉపాధి, ఆదాయాలను దెబ్బతీయనున్నాయని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -