పోలీసుల బందోబస్తు, ఆశా కార్యకర్తల అరెస్టులు
హామీలు పరిష్కరించకుంటే 28న చలో హైదరాబాద్ : ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధానకార్యదర్శులు జయలక్ష్మీ, నీలాదేవి
నవతెలంగాణ-విలేకరులు
ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి బడ్జెట్ సమావేశాల్లో రూ.18వేల ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం మంత్రుల ఇండ్ల ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇంటిని ఆశా వర్కర్లు ముట్టడించారు. అంతకు ముందు పట్టణంలోని పీఎస్‌ఆర్ గార్డెన్ నుంచి మంత్రి ఇంటి వరకు ర్యాలీ నిర్వహించారు. మంత్రి ఇంటికి ఆశా వర్కర్లు వెళ్లకుండా డీఎస్పీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి మాట్లాడుతూ.. ఆశాలకు రూ.18 వేలు ఫిక్స్‌డ్ వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు 48 గంటల ధర్నా నిర్వహించామని, అయినా ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో తప్పని పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఇండ్ల ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం వేతనంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మంత్రి పీఏ శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. మంత్రితో ఫోన్‌లో మాట్లాడారు. తనకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని, రెండు రోజుల్లో ఆశా వర్కర్లతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి దామోదర్ చెప్పిన విషయాన్ని పీఏ శ్రీధర్ ఆశా వర్కర్స్ దగ్గరికి వచ్చి హామీ ఇచ్చారు.
సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 28న చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుందని, ఆశా వర్కర్లు సిద్ధంగా ఉండాలని జయలక్ష్మి పిలుపునిచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆశావర్కర్లు వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో దుద్యాల గేట్ దగ్గర ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్‌సే షన్‌కు తరలించారు. బొంరాస్‌పేటకు చెందిన ఆశావర్కర్లనూ అరెస్టు చేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని డీఎల్‌ఆర్ గార్డెన్ నుంచి మంత్రి సీతక్క కార్యాలయం వరకు ర్యాలీగా వస్తున్న క్రమంలో పోలీసులు బండారుపల్లి రోడ్డులో వారిని అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు ఆశాలకు మధ్య తోపులాట జరిగింది.
ఆశాలు పోలీసులు తోసుకొని క్యాంపు కార్యాలయం వరకు పరుగులు పెట్టారు. క్యాంప్ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. అనంతరం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ నీలాదేవి ఆధ్వర్యంలో మంత్రి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. హనుమకొండ జిల్లా రామ్‌నగర్‌లోని సుందరయ్య కార్యాలయం నుంచి వరంగల్, హనుమకొండ జిల్లాల ఆశా కార్యకర్తలు భారీ ర్యాలీగా కొండా సురేఖ ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో మంత్రి ఇంటి వద్ద బారీకేడ్లను ఏర్పాటుచేసి లోనికి వెళ్లకుండా పోలీసులు బందో బస్తును నిర్వహించారు. ఈ నేపథ్యంలో లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులకు, కార్యకర్త లకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లోనికి అనుమతించకపోవడంతో రెండు గంటలకు పైగా అక్కడే ఆందోళన చేపట్టారు.
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని నారాయణపేట, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల ఆశా కార్యకర్తలు ముట్టడించి ధర్నా నిర్వహించారు. అంతకు ముందు మక్తల్ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ నుంచి మంత్రి ఇంటి వరకు ర్యాలీగా చేరుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆశాలు పెద్ద పెట్టిన నినాదాలు చేస్తూ బారికేట్ల ను తోసుకుంటూ మంత్రి ఇంటికి చేరుకొని గేట్ ముందు ధర్నా నిర్వ హించారు. అనంతరం మంత్రి పీఏకి వినతి పత్రం అందజేశారు. నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాల ఆశా కార్యక ర్తలు కొల్లాపూర్ మండల కేంద్రంలోని మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటిని ముట్టడించారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్ నుంచి పెద్ద గడియారం వరకు భారీ ర్యాలీ నిర్వహించి మంత్రి కోమటిరెడ్డి కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు మంత్రి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆశా కార్యకర్తలు మంత్రి ఇంటికి చేరుకోగానే.. పోలీసులు జోక్యం చేసుకొని ఆర్డీఓ అశోక్ రెడ్డిని పిలిచి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆశాలు ఆర్టీవోకు వినతిపత్రం అందజేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రం మంకమ్మ తోటలోని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఆశా కార్యకర్తలను అరెస్టుల చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు.



