విద్యా వైద్య రంగాలకు అధిక నిధులు కేటాయించాలి
రాష్ట్రాల ఆదాయ వనరులను కేంద్రం లాక్కోవడం దారుణం
బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు తక్కువ నిధుల కేటాయింపు అన్యాయం
పేదల సంక్షేమానికి సంపన్నులపై పన్నుల శాతాన్ని పెంచాలి
బడ్జెట్‌పై సీపీఐ(ఎం) రౌండ్ టేబుల్లో వక్తలు
బడ్జెట్‌ను సవరించకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు : జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు అధిక నిధులను కేటాయించాలనీ, ఆ రెండు రంగాలను ప్రభుత్వ వ్యవస్థలోనే బలోపేతం చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమంలాంటి ప్రాధాన్యతా రంగాలకు కేటాయింపులు పెంచాలనీ, లేకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రాల ఆదాయ వనరులను కేంద్ర ప్రభుత్వం లాక్కోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒకలా, బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు మరోలా నిధులు కేటాయించడాన్ని తప్పుబట్టారు. పేదల సంక్షేమం కోసం సంపన్నులపై పన్నులు పెంచా ల్సిందేనని నొక్కి చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అధ్యక్షతన బడ్జెట్‌పై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆర్థిక విశ్లేషకులు, ప్రొఫెసర్ పాపారావు మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వం సెస్‌లు, సర్‌చార్జీల రూపంలో వసూలు చేస్తూ రాష్ట్రాలకు వాటా దక్కకుండా చేస్తున్న తీరును ఎత్తిచూపారు.
స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పడిపోతున్నదనీ, కేంద్రం ఆధిపత్యంతో రాష్ట్రాల ఆదాయ వనరులు గణనీయంగా పడిపోయాయని వివరించారు. వనరులు తగ్గటంతో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పారు. ద్రవ్యోల్బణం తక్కువ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటనీ, దీంతో తెలంగాణ ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్నదని తెలిపారు. సంపద పంపిణీలో తీవ్ర అసమానతలుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ పదేండ్లలో ఆరు లక్షల కోట్లకుపైగా అప్పు చేసి పోతే కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లలోనే 3.49 లక్షల కోట్ల అప్పు చేసిందని ఎత్తిచూపారు. ఈసారి బడ్జెట్లో రూ.82 వేల కోట్ల అప్పు చేయబోతున్నట్టు పొందుపర్చారని వివరించారు. రాష్ట్ర బడ్జెట్లో పైపై మెరుగులు తప్ప ఏమీ లేదనీ, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి మనుగడ కష్టమని హెచ్చరించారు.
తెలంగాణను కాపాడుకునేందుకు మరోమారు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. యూఎస్‌లో తమపై 40 శాతం పన్ను వేయాలని అక్కడి ధనికులు పాలకులను కోరుతున్నారనీ, ప్రజల్లో తిరుగుబాట్లు మొదలవుతుండటం, సోషలిస్టు భావజాలం విస్తరిస్తుండడంతోనే ఇలా చేస్తున్నారని తెలిపారు. మన దేశంలోని సంపన్నులపై అదనంగా రెండు శాతం పన్ను వేస్తే పేదలకు సంక్షేమం సాధ్యమని ప్రభాత్ పట్నాయక్ చెబుతున్న విషయాన్ని గుర్తుచేశారు. స్వీడన్లో ధనికులపై 60 శాతం పన్నులు వేస్తారనీ, ఆ దేశంలో విద్య, వైద్యం, రవాణా రంగాలను ప్రభుత్వమే ఉచితంగా కల్పిస్తున్నదని వివరించారు. ఆ మూడూ ఉచితంగా ఇస్తే ఆటోమేటిక్‌గా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని చెప్పారు. చిన్నరాష్ట్రంలో 13 ప్రయివేటు వర్సిటీలు ఎందుకని ప్రశ్నించారు.
దీని వెనుక ప్రభుత్వ స్కూళ్లను, కాలేజీలను, వర్సిటీలను నిర్వీర్యం చేసే కుట్ర ఉందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేటుకు ఎందుకు పంపిస్తారని ప్రశ్నించారు. బడ్జెట్లో విద్యకు ఢిల్లీ 24 శాతం, కేరళ 23 శాతం, రాజస్తాన్ 21 శాతం కేటాయిస్తుంటే తెలంగాణలో 8 శాతానికే ఎందుకు పరిమితం చేస్తున్నారని నిలదీశారు. బ్రెజిల్ తన బడ్జెట్లో విద్యకు 24 శాతం కేటాయిస్తుంటే మన కేంద్ర ప్రభుత్వం మూడు శాతానికే పరిమితం కావడాన్ని ఆక్షేపించారు. నిమ్స్‌కు రూ.600 కోట్లు ఇస్తే అత్యున్నత ప్రమాణాలతో పేదలకు వైద్యం అందించడం సాధ్యం కాదా? అని ప్రశ్నించారు. టీజేఎస్ అధ్యక్షులు, ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ… కేంద్రానికే పంపే వాటాలో తిరిగి తెలంగాణకు 42 శాతమే వస్తున్నదని ఎత్తిచూపారు. ఎక్సైజ్, స్టాంప్స్, కస్టమ్స్, వాహనాల కొనుగోళ్ల ద్వారా వచ్చే ఆదాయమే కీలకంగా మారుతున్నదని చెప్పారు.
కేంద్రం తీరుతో సంక్షేమం, అభివృద్ధికి నిధులను బ్యాలెన్స్ చేయలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్లో కేంద్రం నుంచి రూ. 24 వేల కోట్ల గ్రాంట్లు వస్తాయని రాసుకున్నప్పటికీ వాస్తవానికి అవి రూ.7 నుంచి రూ.8 వేల కోట్లకు మించట్లేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం నిధుల్లో కోత పెట్టిందనీ, సర్వశిక్ష అభియాన్ జీతభత్యాలను కూడా పెంచడం లేదని ఎత్తిచూపారు. గతంలో తక్కువ వడ్డీకి ఎల్ఐసీ, చిన్నమొత్తాల సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తీసుకునేవనీ, దీనిపై కేంద్రం ఆంక్షలు విధించడంతో రాష్ట్ర ప్రభుత్వాలు తప్పని సరి పరిస్థితుల్లో 10 శాతం వడ్డీకి అప్పులు తేవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలు, కేటాయింపులు, ఖర్చుల విషయానికి వచ్చేసరికి 10 నుంచి 15 శాతం మేరకు వ్యత్యాసం ఉంటున్నదని పేర్కొన్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ..బడ్జెట్లో ఎక్కువగా రుణాలు, వడ్డీలు, జీతభత్యాలకే పోతే సంక్షేమం, అభివృద్ధి ఎలా అని ప్రశ్నించారు. ఆరుగ్యారంటీలకు నిర్ధిష్ట కేటాయింపులు ఏవని నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్లకు రూ.5 వేల కోట్లు ఎలా సరిపోతాయని అడిగారు. కొత్తరేషన్ కార్డులు ఇచ్చారు సరే నిధుల పెంపు ఏదని ప్రశ్నించారు. విద్యకు 8.2 శాతం కేటాయించడం దారుణమన్నారు. దళితుల సంక్షేమానికి నిధులు తగ్గించడాన్ని తప్పుబట్టారు. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ, వైద్య రంగాలకు అరకొర నిధులు కేటాయించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌ను సవరించాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల్లోనూ రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
సవరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నేత డీజీ నర్సింహారావు, రైతు సంఘం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరాంనాయక్, వత్తిదారుల సంఘం సమన్వయ కమిటీ కన్వీనర్ రమణ, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి అబ్బాస్, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ. వెంకటేశ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్, తదితరులు పాల్గొని మాట్లాడారు. ఆయా రంగాలకు బడ్జెట్లో నిధులు పెంచాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.



