ప్రధాని వైఫల్యం వల్లే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఇబ్బందులు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.అబ్బాస్
సిరిసిల్లలో నిరసన
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధం ఆపాలని, ప్రపంచ శాంతి కోసం భారత ప్రభుత్వం ఇతర దేశాలతో కలిసి కృషి చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.అబ్బాస్ అన్నారు. మోడీ వైఫల్యం వల్లే దేశంలో గ్యాస్ పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. యుద్ధం వద్దు.. శాంతి ముద్దు.. గ్యాస్ పెట్రోల్ డీజిల్ కొరతను అరికట్టాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా గురువారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు నెహ్రునగర్ ఆర్ఎంపీ భవన్లో సీపీఐ(ఎం) విస్తృత స్థాయి సమావేశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తెగమంటి ఎల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎండి.అబ్బాస్ మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కనీసం మానవత విలువలు పాటించకుండా ఇరాన్‌పై దాడి చేయడాన్ని ప్రపంచమంతా ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. ఇరాన్లో తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్టించి ఆ దేశ చమురు నిల్వలను కొల్లగొట్టాలనే కుట్రతోనే అమెరికా ఇలాంటి దుస్సాహసానికి పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం మన అలీన విదేశాంగ విధానాన్ని వదిలేసి అమెరికా, ఇజ్రాయిల్ వైపు మొగ్గు చూపుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం ఆపడానికి కృషి చేయకుండా అమెరికాకు లొంగుబాటు వైఖరి తీసుకున్నదని విమర్శించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు.
హోటల్స్, హాస్టల్స్ మూతపడ్డాయని, వేలాది మంది ఉపాధి కోల్పోయారని వివరించారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న కోటి మంది భారతీయుల ఉపాధి, ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాకు భయపడి యుద్ధం పట్ల నోరు మెదపకుండా ఉన్న మోడీ.. కరోనా నాటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునివ్వడం సిగ్గుచేటన్నారు. ప్రపంచ శాంతి కోసం, యుద్ధాల వల్ల జరిగే నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మోడీ విధానాలను ఖండించాలని పిలుపునిచ్చారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు టి.స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. శాంతి కోసం కృషి చేసేందుకు భారత ప్రభుత్వం పాటుపడాలన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం భారతదేశానికి తీరని ద్రోహం చేస్తోందని, యువతరం దానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మూషం రమేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజీ విమల, కోడం రమణ, మల్లారపు అరుణ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, గురిజాల శ్రీధర్, అన్నల్దాస్ గణేష్, ప్రజాసంఘాల నాయకులు మిట్టపల్లి రాజమల్లు, ఎలిగేటి రాజశేఖర్, గీస బిక్షపతి, మనోజ్, సురేష్, కమలాకర్, ఆడెపు రజిత, దాసరి రూప, వడ్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



