Sunday, March 29, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపళ్లెం పెద్దదైతే సరిపోద్దా…?

పళ్లెం పెద్దదైతే సరిపోద్దా…?

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ గురించి ఓ ఆర్థిక నిపుణుణ్ని అడగ్గా…’పళ్లెం పెద్దదైతే సరిపోతుందా? దాంట్లో తినటానికి సరిపడా ఆహార పదార్థాలు ఉండాలి కదా..?’ అని కామెంట్‌ చేశారు. నిజమే మరి.. ఏడాదికేడాది మన పద్దులు, వాటిలోని కేటాయింపులు ఆకాశాన్నంటుతున్నాయి.. కానీ ఖర్చు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటోంది. ఈసారి రూ.3,24,234 కోట్లతో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం గతేడాది వేసుకున్న అంచనాలు, ఆదాయ తీరు తెన్నులను పూర్తిగా విస్మరించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.3.05 లక్షల కోట్లతో పద్దును ప్రవేశపెట్టగా.. అధికారిక లెక్కల ప్రకారం అందులో అరవై శాతం మేర మాత్రమే ఆదాయం వచ్చింది.

మిగతా నలబై శాతం రాబడి రాకపోవటంతో ఆ మేరకు సంక్షేమ రంగాలకు కోతలు విధించారు. దీంతో ఆసరా పింఛన్ల పెంపు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం తదితర ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలు, ఎన్నికల హామీలు మరుగున పడిపోయాయి. అయినా ఈసారి కూడా తగ్గేదేలే.. అంటూ మరోసారి భారీ బడ్జెట్‌ను వండి వడ్డించారు ప్రభుత్వ పెద్దలు. అలాంటప్పుడు వేసుకున్న అంచనాలను చేరుకోవటానికి తమ దగ్గరున్న మార్గాలేమిటి? ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులను ఏమైనా సృష్టించుకోగలరా? అనే ప్రశ్నలకు వారు జవాబు చెప్పాల్సి ఉంటుంది. ప్రతీ బడ్జెట్‌ సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగానీ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శిగానీ విధిగా పాత్రికేయుల సమావేశం నిర్వహించి, ఈ సందేహాలకు జవాబులు చెప్పే ఆనవాయితీ ఉంది.

కానీ ఈసారి అలాంటి జవాబులు చెప్పలేకే కావొచ్చు.. పాత్రికేయుల సమావేశమే నిర్వహించకపోవటం గమనార్హం. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, బకాయిలు, ఇతర ఆర్థిక సాయాల విషయంలో మోడీ సర్కారు మొండిచేయి చూపుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మౌనం దాల్చటం విడ్డూరం. వాటిని రాబట్టుకోవటానికి నికరంగా ఏం చేస్తారనేది చెప్పకపోవటం కాంగ్రెస్‌ ప్రభుత్వ బలహీనతకు నిదర్శనం. గత బీఆర్‌ఎస్‌ సర్కారు చేసిన అప్పుల గురించి పదేపదే చెబుతున్న ప్రభుత్వాధినేతలు…వాటిని తీర్చేందుకు నానా తంటాలు పడుతున్నామని వాపోతున్నారు. అలాంటప్పుడు రూ.8.50 లక్షల కోట్ల అప్పులు, వాటికి ఏడాదికి రూ.13 వేల కోట్ల వడ్డీల భారం మోస్తూనే.. సంక్షేమ, అభివృద్ధి రంగాలను ఎలా సమతూకం చేస్తారనేది అర్థంగాని విషయం.

బడ్జెట్‌పై డిస్కషన్‌ సందర్భంగా ఇలాంటి విషయాలన్నింటిపై అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరుగుతుందని, తద్వారా రాష్ట్ర ప్రజానీ కానికి స్పష్టత వస్తుందని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. ప్రధాన ప్రతిపక్షంపై దూషణ భాషణలతో అధికారపక్షం చెలరేగితే..నిర్మాణాత్మక సూచనలు,సలహాలను ఇవ్వటంలో విఫలమైన ప్రధాన ప్రతిపక్షం తిట్ల పురాణాలకే పరిమితమైంది. ఇక్కడ ప్రజలు కేంద్ర బిందువుగా సాగాల్సిన బడ్జెట్‌, దానిపై చర్చలు.. వ్యక్తుల వాగాడంబరం, వాగ్దాటిలో కొట్టుకుపోవటం విచారకరం. రాష్ట్ర బడ్జెట్‌ అంటే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను నిర్దేశించేది. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ అంశానికి ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం, సభ్యులు తగిన ప్రాధాన్యతను ఇవ్వకపోవటం నిజంగా బాధ్యతారాహిత్యమే.

మరోవైపు సమావేశాల్లో ఒకరోజు టీ బ్రేక్‌ అని చెప్పి.. సభను 2.50 గంటలపాటు వాయిదా వేయటం దేనికి సంకేతం? ఆ సమయంలో సభా కార్యకలాపాలను, దాని పనితీరును వీక్షిద్దామని వచ్చిన పాఠశాల విద్యార్థులకు మన చట్టసభలు ఇచ్చే సందేశమేమిటి? ఏతావాతా తేలేదేమంటే.. రాజ్యాంగం ప్రకారం, సాంకేతికంగా సభను నడపాలి కాబట్టి నడుపుతున్నారుగాని.. దాని పట్ల నికరమైన చిత్తశుద్ధి, ప్రజల పట్ల అంకితభావం లేదనేది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో చట్టసభల పనితీరు పట్ల, బడ్జెట్‌లోని వివిధ మౌలికాంశాల పట్ల ప్రజల్లో విస్తృత చర్చ చేపట్టాలి. ఇలాంటి చర్చలు, సమాలోచనల ద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలి.

  • బి.వి.ఎన్‌ పద్మరాజు
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -