Sunday, March 29, 2026
E-PAPER
Homeసోపతిప్రగతి పద్దుల వెలుగు.. గ్రంథాలయాల చీకటి

ప్రగతి పద్దుల వెలుగు.. గ్రంథాలయాల చీకటి

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ మొత్తం రూ. 26,674 కోట్లను ప్రతిపాదించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ కేటాయింపుల్లో 0.64 శాతం స్వల్ప పెరుగుదల కనిపించినప్పటికీ, బడ్జెట్‌ అంతరార్థాన్ని గమనిస్తే ప్రభుత్వం తన ప్రాధాన్యతలను మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో కేవలం నిర్వహణ ఖర్చులకే పరిమితమైన నిధులు, ఈసారి ‘ప్రగతి పద్దు’ (Development Fund) వైపు మళ్లడం విశేషం. అంటే, కేవలం జీతభత్యాలు, రోజువారీ ఖర్చులకే కాకుండా, శాశ్వత ప్రాతిపదికన జరిగే అభివద్ధి పనులపై సర్కారు దష్టి సారించింది.

పాఠశాల విద్యారంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్‌ ఊతమిస్తోంది. గతేడాది ప్రగతి పద్దు కింద కేవలం రూ. 379 కోట్లు మాత్రమే ఉండగా, ఈసారి దాన్ని ఏకంగా రూ. 1,367 కోట్లకు పెంచడం గమనార్హం. ఇది దాదాపు మూడు రెట్ల కంటే ఎక్కువ పెంపు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో భవనాల నిర్మాణం, డిజిటల్‌ తరగతి గదుల ఏర్పాటు వంటి పనులు వేగవంతం కానున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల ఏర్పాటు కోసం రూ. 500 కోట్లు కేటాయించడం, కార్పొరేట్‌ స్థాయి విద్యను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంగా కనిపిస్తోంది.
సంక్షేమ పథకాలు, సమగ్ర శిక్షా ప్రాజెక్టు: విద్యార్థుల ఆరోగ్యం, హాజరు శాతాన్ని పెంచే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘సీఎం బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీమ్‌’ కు ఈ బడ్జెట్‌లో రూ. 505.40 కోట్లు కేటాయించారు. ఆకలితో ఉన్న చిన్నారికి అక్షరం అబ్బదు అనే సూత్రాన్ని నమ్మి, ఉదయం పూట పౌష్టికాహారాన్ని అందించడం స్వాగతించదగ్గ పరిణామం. అలాగే, కేంద్ర-రాష్ట్ర ఉమ్మడి భాగస్వామ్యంతో నడిచే సమగ్ర శిక్షా అభియాన్‌ కు నిధులను రూ. 1,952.17 కోట్ల నుండి రూ. 2,404 కోట్లకు పెంచారు. ఈ నిధులు మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను పెంచడానికి, పాఠశాలల్లో కనీస వసతుల కల్పనకు ఉపయోగపడతాయి.



కేటాయింపుల్లో వ్యత్యాసాలు:
బడ్జెట్‌ అంటే కేవలం పెంపు మాత్రమే కాదు, అవసరాలను బట్టి సర్దుబాటు చేయడం కూడా. ప్రగతి పద్దు కింద అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ (వయోజన విద్య) కు నిధులను రూ. 15.67 కోట్ల నుండి రూ. 19.30 కోట్లకు పెంచడం ద్వారా నిరక్షరాస్యత నిర్మూలనపై దష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పరీక్షల విభాగానికి కూడా రూ. 7.50 కోట్లు కేటాయించారు. అయితే, ఇదే సమయంలో సొసైటీ గురుకులాలకు నిధులు స్వల్పంగా తగ్గాయి. గతేడాది రూ. 670.24 కోట్లు ఉండగా, ఈసారి వాటిని రూ. 610.82 కోట్లకు పరిమితం చేశారు. ఇది ఆయా విద్యాసంస్థల నిర్వహణపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
వెన్నెముక విరుగుతున్న వేళ: విద్యా వ్యవస్థకు గ్రంథాలయం వెన్నెముక వంటిది. కానీ, దురదష్టవశాత్తూ ఈ బడ్జెట్‌లో అత్యధికంగా నష్టపోయిన విభాగం గ్రంథాలయాలే. గతేడాది కంటే రూ. 10 కోట్లు తగ్గించి, కేవలం రూ. 4.75 కోట్లు మాత్రమే కేటాయించడం విచారకరం. ”గ్రంథాలయం ఉన్న చోటే అసలైన విద్యా వాతావరణం ఉంటుంది” అనే మాటను ప్రభుత్వాలు విస్మరిస్తున్నట్లుగా ఉంది. ఒకవైపు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెంచుతున్నామని చెబుతూనే, విద్యార్థుల మేధో సంపత్తిని పెంచే గ్రంథాలయాలకు నిధులు తగ్గించడం వైరుధ్యంగా ఉంది. కేవలం నిర్వహణ ఖర్చులకే సరిపోని ఈ నిధులతో కొత్త పుస్తకాలు కొనడం లేదా డిజిటలైజేషన్‌ చేయడం అసాధ్యం.

పాఠ్యపుస్తకాల విభాగానికి భారీ కోత: విద్యార్థికి ప్రాథమిక అవసరమైన పాఠ్యపుస్తకాల (ువఞ్‌ దీశీశీసర) విభాగానికి బడ్జెట్‌ కేటాయింపుల్లో కోత విధించడం ఆందోళన కలిగించే విషయం. గతేడాది రూ. 18.29 కోట్లు ఉండగా, ఈసారి దాన్ని రూ. 5.49 కోట్లకు తగ్గించారు. కాగితం ధరలు, ముద్రణ ఖర్చులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, కేటాయింపులు తగ్గించడం వల్ల పుస్తకాల నాణ్యతపై లేదా సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది. ”పుస్తకం లేని పాఠశాల, ఆయుధం లేని సైనికుడి వంటిది”. డిజిటల్‌ విద్య వైపు అడుగులు వేస్తున్నప్పటికీ, పాఠ్యపుస్తకాల ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గదు.
గ్రంథాలయం ఒక నిశ్శబ్ద తరగతి గది: పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల దాకా గ్రంథాలయం అనేది ఒక ”నిశ్శబ్ద తరగతి గది”. అది పాఠం చెప్పని గురువు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు కేవలం విషయాన్ని బోధిస్తే, గ్రంథాలయంలో విద్యార్థి ఆ విషయాన్ని అన్వయించుకోవడం, విశ్లేషించుకోవడం నేర్చుకుంటాడు. ”టుడే ఎ రీడర్‌, టుమారో ఎ లీడర్‌” అనే నానుడి నిజం కావాలంటే విద్యార్థికి పుస్తకాలతో స్నేహం కుదరాలి. గ్రంథాలయాల్లో కూర్చునే విద్యార్థి కేవలం సమాచారాన్ని మాత్రమే కాదు, క్రమశిక్షణను, విలువలను మర్శనాత్మక ఆలోచనా దక్పథాన్ని అలవర్చుకుంటాడు.
పాఠశాల స్థాయిలో పఠనాభిరుచి – విత్తనం నాటే సమయం: పిల్లల్లో పఠనాభిరుచిని పెంచడానికి పాఠశాల స్థాయి గ్రంథాలయాలే సరైన వేదికలు. కేవలం మార్కుల కోసం చదివే పాఠ్యపుస్తకాలకు అతీతంగా, కథలు, జీవిత చరిత్రలు, విజ్ఞాన సర్వస్వాలను చదవడం వల్ల వారి సజనాత్మకత పెరుగుతుంది. ”సెల్ఫ్‌ లెర్నింగ్‌” లేదా స్వయం అభ్యసనం అనే భావనకు ప్రాణం పోసేది గ్రంథాలయ సంస్కతే. నేటి ఇంటర్నెట్‌ యుగంలో సమాచారం విచ్చలవిడిగా దొరుకుతున్నా, ఏది సరైనదో, ఏది ప్రామాణికమైనదో తెలియజేసే శక్తి ఒక్క పుస్తకానికే ఉంది.

ఉన్నత విద్యలో గ్రంథాలయం ఒక దిక్సూచి: డిగ్రీ, పీజీ స్థాయికి వచ్చేసరికి గ్రంథాలయం ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. సిలబస్‌ పరిధి దాటి లోతుగా అధ్యయనం చేయాలనుకునే విద్యార్థులకు గ్రంథాలయం ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. ఆధునిక సబ్జెక్టులలో వస్తున్న మార్పులు, పరిశోధనా పత్రాలు, రిఫరెన్స్‌ పుస్తకాలు విద్యార్థికి ప్రపంచస్థాయి జ్ఞానాన్ని అందిస్తాయి. ”క్లాస్‌రూం టీచర్‌ నిన్ను పరీక్షకు తయారు చేస్తే, లైబ్రరీ నిన్ను జీవితానికి తయారు చేస్తుంది”. ఉన్నత విద్యా ప్రమాణాలు పెరగాలంటే గ్రంథాలయాలు ఆధునికీకరించబడాలి.
విశ్వవిద్యాలయాల మేధో కేంద్రాలు: విశ్వవిద్యాలయ స్థాయిలో గ్రంథాలయం లేని పరిశోధనను ఊహించలేము. రెఫరెన్స్‌ సెక్షన్లు, జర్నల్స్‌, థీసిస్‌లు ఒక విశ్వవిద్యాలయ గ్రంథాలయాన్ని ”జ్ఞాన భాండాగారంగా” మారుస్తాయి. ”రిసెర్చ్‌ అంటే గ్రంథాలయంలో మొదలై గ్రంథాలయంలోనే ముగిసే ప్రయాణం”. పురాతన తాళపత్ర గ్రంథాల నుంచి తాజా డిజిటల్‌ డేటాబేసుల వరకు అన్నీ ఒకే చోట లభించే గ్రంథాలయం పరిశోధకులకు దేవాలయం వంటిది. కానీ నేడు నిధుల కొరత వల్ల జర్నల్స్‌ సబ్‌స్క్రిప్షన్లు నిలిచిపోవడం, డిజిటల్‌ లైబ్రరీల నిర్వహణ భారంగా మారడం బాధాకరం.
బడ్జెట్‌ కేటాయింపులు – పాలకుల బాధ్యత: గ్రంథాలయాలపై పెట్టే ప్రతి రూపాయి, భవిష్యత్‌ తరాల మేధస్సులో పెట్టే మూలధనం”. ఈ సత్యాన్ని పాలకులు గుర్తించాలి. కేవలం భవనాలకు రంగులు వేయడం, గోడలు మెరవడం వల్ల విద్య అందదు; ఆ గదుల్లో పుస్తకాలు మెరవాలి, విద్యార్థి కళ్లలో జ్ఞాన కాంతి వెలగాలి. ప్రస్తుతం గ్రంథాలయాలకు కేటాయిస్తున్న నిధులు ఎక్కువగా భవన అద్దెలు, విద్యుత్‌ బిల్లులు, సిబ్బంది వేతనాలకే సరిపోతున్నాయి. దీనివల్ల ఆటోమేషన్‌, ఈ-రిసోర్సెస్‌, ఇంటర్నెట్‌ వంటి ఆధునిక సదుపాయాలు కనుమరుగవుతున్నాయి.

పరిష్కార మార్గాలు, భవిష్యత్‌ కార్యాచరణ
గ్రంథాలయాల అభివద్ధి కోసం ప్రభుత్వం ”లైబ్రరీ ఫస్ట్‌ పాలసీ”ని అవలంబించాలి.
1. ప్రత్యేక నిధులు: ప్రతి విద్యా ప్రాజెక్టులో కనీసం 5-10 శాతం నిధులను గ్రంథాలయాల కోసం కేటాయించాలి.
2. సిబ్బంది భర్తీ: ఖాళీగా ఉన్న గ్రంథపాలకుల పోస్టులను భర్తీ చేయడం ద్వారా వత్తిపరమైన నిర్వహణ సాధ్యమవుతుంది.
3. డిజిటలైజేషన్‌: ప్రతి మండల కేంద్రంలో డిజిటల్‌ లైబ్రరీని ఏర్పాటు చేసి, గ్రామీణ విద్యార్థులకు కూడా ఈ-బుక్స్‌ అందుబాటులోకి తేవాలి.
4. సమగ్ర విధానం: పాఠశాల, కళాశాల, పబ్లిక్‌ లైబ్రరీలను అనుసంధానించే ఒక ఇంటిగ్రేటెడ్‌ విధానం అమలు చేయాలి.
జ్ఞాన రాజధానికి ద్వారాలు: జ్ఞానం అనేది ఒక సంపద అయితే, గ్రంథాలయాలు ఆ సంపదను కాపాడే కోటలు. 2026-27 బడ్జెట్‌ గణాంకాలు చూస్తుంటే, విద్యపై ఉన్న శ్రద్ధ గ్రంథాలయాలపై లేదని స్పష్టమవుతోంది. విద్యావేత్తలుగా, గ్రంథపాలకులుగా మనమందరం కలిసి ఈ లోపాన్ని ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లాలి. ”పుస్తకాల దుకాణాల్లా కనిపించే గ్రంథాలయాలు, శిథిలమైన భవనాల్లా మిగిలిపోవడం” ఆరోగ్యకరమైన సమాజానికి మంచిది కాదు. విద్య నాణ్యత పెరగాలన్నా, పరిశోధనలు మెరుగుపడాలన్నా గ్రంథాలయాల బలోపేతం అనివార్యం. అప్పుడే మన విద్యా వ్యవస్థ సంపూర్ణమైన ‘ప్రగతి’ని సాధిస్తుంది.

– డా|| రవికుమార్‌ చేగొని, 9866928327

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -