Sunday, March 29, 2026
E-PAPER
Homeసోపతిరవివర్మ చిత్రం

రవివర్మ చిత్రం

- Advertisement -

రాజారవివర్మ చిత్రం ఒక తరంగ మల్లే లేచి భారతీయ సాహిత్యకారులకూ ప్రేరణనిచ్చి పాటలకు పదాలనిచ్చింది. నాటకరంగానికీ, ఆయన తదనంతరం మొదలైన సినిమాలకు రవివర్మ చిత్రాలలోని రూపాల వేషధారణ ఆధారమైంది. రవివర్మ చిత్రాల గురించి తెలుసుకునేముందు ఆయన ఎదిగిన బాటను ఒక ఉపమానంతో పోల్చి చూడవచ్చు. రైతులు భూములు సాగుచేసి విత్తనం వేసి వారికి కావలసిన పంటలు పండిస్తారు. ఆ సమయాన గట్టుమీది మొక్కలు ఆ భూమి సారంతో పూలు, పండ్లు, తాటిచెట్టుగా ఎదుగుతాయి.

రవివర్మ చిత్రకారుడిగా ఎదిగిన కాలం, తీరు అలాంటిదేను. 1848లో జన్మించాడు. 1906లో ఈ లోకం వదిలాడు. ఆ సమయాన బ్రిటీష్‌వారు ఎన్నో పథకాలు, ఆర్ట్‌స్కూళ్లు నిర్వహిస్తూ, వారు నేర్పేవే ఆధునిక కళలని భారతీయ కళాభూమిని సాగుచేశారు. రవివర్మ ఎవ్వరి ప్రోద్బలానికి గురికాకుండా, ఏ ఆర్ట్‌ స్కూల్‌కి వెళ్లకుండా తన నాగలి తనే పట్టి తన కళాభూమిని తనే దిద్దుకున్నాడు.

రవివర్మ కిలిమనూర్‌ (కేరళ) రాజ కుటుంబంలో పుట్టి చిత్రకారుడిగా ఎదిగి రాజుల్లో చిత్రకారుడు, చిత్రకారుల్లో రాజు అని పిలువబడ్డాడు. 1860లో, త్రివేడ్రం ఆస్థాన చిత్రకారుడు, ఇతని మామ అలిగిరి నాయుడు వద్ద చిత్రం వేయటం మొదలెట్టాడు. అలాగే రామస్వామి నైకర్‌ వద్ద నేర్చాడు. ఇతని మామ సిఫారసు వల్ల త్రివేండ్రం ఆస్థానంలో వుండి చిత్రం అభ్యసించాడు. 1868లో థియోడర్‌ జెన్‌సన్‌ అనే డచ్‌ కళాకారుడిని త్రివేండ్రం ఆస్థానానికి పోట్రేటు చిత్రకారుడిగా ఆహ్వానించారు. ఆ రోజుల్లో తైలవర్ణ పోట్రేటు చిత్రాలు భారతీయ రాజులను ఆకర్షించేవి. ఇతని వద్ద తైలవర్ణంలో చిత్రించే పద్ధతి నేర్చుకోవాలని రవివర్మ ప్రయత్నించినా, జెన్‌సన్‌ అనుమతి లేక, చాటుగా చూస్తూ అర్థం చేసుకున్నాడు. యూరప్‌ నుండి వచ్చిన కళాపత్రికల్లోని చిత్రాలు చూసి అభ్యాసమూ చేశాడు. ట్రావెంకూర్‌ రాజు రాణి చిత్రాలు వేసి రాజువద్ద ‘వీరశృంగల’ అనే గౌరవనామం పొందాడు.



ఇతని చిత్రాలు ఉన్న ఊరు వదిలి బయట ప్రదర్శనలూ చేయమొదలెట్టాయి. 1873లో మద్రాసు ఫైన్‌ఆర్ట్‌ ప్రదర్శనల్లో పాల్గొని బహుమానమూ అందుకున్నాడు. ఆ ప్రదర్శన కోసం వేసిన శకుంతలా ప్రత్రలేఖనం చిత్రాన్ని మోనియర్‌ విలియమ్స్‌ తన అనువాద పుస్తకం ‘శకుంతల’ ముఖ చిత్రంగా వేసుకున్నాడు. ఆపై దూర ఆస్థానాల రాజులూ ఆహ్వానించారు. 1881లో బరోడా గైక్వాడ్‌ మహారాజా సాయాజీరావు సింహాసనారోహణ కార్యక్రమానికి ఆహ్వానించబడి, 1882లో మహారాజ అధిరోహణ పోట్రేటును పూర్తిచేశాడు. 1885లో మైసూరు మహరాజా కృష్ణవడియార్‌ 10, ఆహ్వానంపై వారి కుటుంబ పోట్రేటులు చిత్రించాడు.
బరోడా రాజు సాయాజీరావు – 3, తన కొత్త రాజమహల్‌, లక్ష్మీవిలాస్‌ ప్యాలెస్‌ నిర్మిస్తూ రవివర్మని ఆహ్వానించగా 1888- 1891 మధ్య ఈ ప్యాలెస్‌ కోసం వేసిన 14 పురాణాల చిత్రాలు, రవివర్మ కళాపథంలో గొప్ప చిత్రాలుగా నిలిచాయి. గంగ – శంతను, సత్యవతి- శంతను, విశ్వామిత్ర- మేనక, సుభద్రార్జునీయం వంటి ముఖ్య చిత్రాలు ఇక్కడి ప్యాలెస్‌వేను. ఈ రాజమహల్‌ ఆవరణలో రవివర్మ పనిచేసిన స్టూడియో, ఈ నాటికీ నిలిచి వుంది.

1892లో షికాగో అంతర్జాతీయ ప్రదర్శనకూ ఈయన చిత్రం ‘పదిమంది స్త్రీలు వారి వేరు వేరు స్థితిగతలు’ చేరింది. బహుమానమూ అందుకుంది. 1899లో త్రివేండ్రం ప్యాలెస్‌ కోసం చిత్రించిన ‘హంస దమయంతి’ చిత్రం, మైసూర్‌ ప్యాలెస్‌ కోసం ‘గాలక్సీ ఆఫ్‌ మ్యుసీషియన్స్‌’ అనే సంగీతకారులైన వివిధ స్త్రీల చిత్రం, ఎంతో ప్రాముఖ్యమైన చిత్రాలైనాయి. 1901- 02 ఉదరుపూర్‌ ఆస్థానం వారి ఆహ్వానంపై మహారాణా ప్రతాప్‌ పోట్రేట్‌ను చిత్రించాడు. ఇలా ఉత్తర భారత ఆస్థానాల వరకూ చేరాడు. అలాగే ఇతని పురాణ కథల చిత్రాలూ ప్రఖ్యాతి గాంచాయి. 1904 లో మైసూరు జగమోహన్‌ ప్యాలెస్‌ కోసం 9 పురాణ గాథల చిత్రాలు చిత్రించాడు.
1904లో బ్రిటిష్‌ ప్రభుత్వం రవివర్మని ‘కేసరిహిందు’ అనే బిరుదుతో గౌరవించే ప్రఖ్యాతి గాంచాడు. భారతీయులు, పాశ్చాత్యులు ఇతని కళను గుర్తించి గౌరవించారు. రవీంద్రనాథ్‌ టాగూర్‌, బాలేంద్రనాథ్‌ టాగూర్‌ ఇతని కళని ప్రశంసించారు. భారతీయతను ప్రతిబింబించే చిత్రాలను వేశాడని భారతీయ కాంగ్రెస్‌ పార్టీవారు అభినందించారు. రవివర్మ తమ్ముడు రాజరాజ వర్మ మరణం తరువాత రవివర్మ కొడుకు రామవర్మ తండ్రికి సాయం చేయమొదలెట్టాడు. ఇతని చిత్రాలలోని ప్రకృతి దృశ్యాల నైపుణ్యం రాజవర్మదనీ, 1906లో రవివర్మ మరణం తర్వాత ఇతని కొడుకు రామవర్మ కొన్ని తండ్రి చిత్రాలను పూర్తి చేశాడని కుటుంబ లేఖల వల్ల తెలుస్తుంది.



బ్రిటిష్‌ వారి ఆధిక్యత ప్రదర్శితమౌతున్న రోజుల్లో తనకు తానై చిత్రం నేర్చుకుని నిలుచున్న ఇతని చిత్రానికి అంత పేరు ప్రఖ్యాతులు ఎలా వచ్చాయి అని ప్రశ్న వేసుకుంటే ఇతని ఆలోచనా ప్రతిభే అందుకు కారణమని అర్థం అవుతుంది.
ఆనాటి సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు ఒక గందగోళ పరిస్థితుల్లో ఉన్నాయి. భారతీయ సమాజం, విదేశీయుల ఆధునికత, భారతీయత మధ్య ఆందోళనతో ఇరుకునపడింది. ఇతని చిత్రాల్లో యూరోపియన్లు ప్రచారం చేసిన ఫొటో గ్రాఫులాంటి నిజమనిపించే తీరు, తైలవర్ణంతో చిత్రించే పద్ధతి రెండూ వుంటాయి. యూరోపియన్ల చిత్రాలు కెమెరాలో బంధించిన ఒక క్షణంలా వుంటే, ఇతని చిత్రాలు భారతీయ సంప్రదాయ చిత్రాలు వేసిన పద్ధతిలో ఒక కథను వివరిస్తున్నట్టు వుంటాయి. ఈయన చిత్రాలు నిలువెత్తు నిజ రూపాలు. ఇతని చిత్రాలలో పట్టువస్త్రాలు, నగలు, రూపాల వస్త్రధారణ చాలా డాంబికంగా వుంటుంది. తైలవర్ణ పద్ధతి మెరుపుని ఇందులో చక్కగా వాడాడు. ఇతని చిత్రాలు చూస్తే ఏదో నాటకం సాగుతోంది, అందులోని ఒక సీను చిత్రించాడు అనిపిస్తుంది. ఇతనికి, ఇతని తమ్ముడు రాజవర్మకు నాటక ప్రదర్శనలు చూడడానికి సమయం కేటాయించి వెళ్లడం ఎంతో ఇష్టం. కిర్లోస్కర్‌ నాటకమండలివారు ప్రదర్శించిన ‘అర్జునసుభద్రా పరిణయం’ చూడటానికి సతారా వరకు వెళ్లి చూసివచ్చారు. ఇతను వేసిన ‘సుభద్రా పరిణయం’ అనే చిత్రం ఆ నాటకంలోని సీను అయి వుంటుందని అర్థం అవుతుంది. ఇతని చిత్రం ‘కీచక సైరంధ్రీ’ వంటి కొన్ని చిత్రాలు చూస్తే వేదిక అలంకరణలు, పరదాలు కూడా చిత్రించి ఇవి నాటక ప్రభావిత చిత్రాలని తెలుస్తుంది.
రవివర్మ చిత్రాలలో గమనించవలసిన మరో ముఖ్య విషయం, పురాణ చిత్రాలలోని రూపాలు, ఇవి భగవత్‌ రూపాలు, అవతలి లోకపు మిధ్యారూపాలు అనిపించదు. విశ్వామిత్ర మేనక చిత్రంలోని రూపాలు, గంగశంతను, సత్యవతీశంతను, రాధాకృష్ణులు, యశోదాకృష్ణులు ఏ రూపాలు చూసినా మన చుట్టుపక్కల కనిపించే మనుషుల రూపాలివి అనిపిస్తుంది. అంజనీబాయి మాల్పేకర్‌ అనే ఒక గాయనిని తన చిత్రాలలోని రూపాలకు ఆధారంగా కూర్చోబెట్టేవాడు. ఇలా చుట్టుపక్కల వారినే తన రూపాలకు ఆధారం చేయడం వలన, నాటకంలోని సీనులకు మల్లే కథనాత్మకం చేయటం వలన దర్శకులు ఈ చిత్రాలను తమతో పోల్చుకుని మానసిక సంబంధం ఏర్పరచుకోగలిగారు. మనం పోల్చుకోగల రూపాలు అవటం వలన ఆదేవతా రూపాలూ ఏవో లోకాలవు కాదు మన పక్కనే వున్న మనుషులనిపిస్తుంది. ఇలా నిజానికి, మిధ్యకి మధ్య దూరం చెరిపేశాడు.

ఇతని చిత్రాలు మనమీద కొన్ని ప్రశ్నల వర్షం కురిపిస్తాయి. ఇతని ‘జటాయువధ’ చిత్రం, రావణుడు సీతను అపహరించి తీసుకువెళ్తుండగా జటాయువు అడ్డు పడగా రావణుడు ఆ పక్షి రెక్కలు ఖండిస్తాడు. రెక్కలు చెల్లాచెదరై జటాయువు అక్కడే వాలిపోతుంది. రావణుడు దక్షిణ దిక్కుగా సీతను తీసుకువెళ్లాడని ముందుగా జటాయువే రాముడికి తెలియజేస్తుంది. రామాయణ కథలో హనుమంతుడు వంటి వీరులందరి గురించి ప్రసంశలు ఎన్నో వెలువడ్డాయి. రవివర్మ తన చిత్రం ద్వారా జటాయువు కథ చూపించి, అందరికంటే ముందుగా గుర్తించవలసిన వీరుడు జటాయువు కదా అని మనల్ని ప్రశ్నించినట్టుంటుంది. ‘సుభద్రాపరిణయం’ చిత్రం చూపి, మనం రాధాకృష్ణులను ప్రేమకు ప్రతిరూపంగా పరిగణిస్తాము. సుభద్రార్జునుల ప్రేమా అంతే ముఖ్యం కదా అని ప్రశ్నించినట్టుంటుంది. తను చుట్టుపక్కల చూసిన తల్లిబిడ్డల చిత్రం వేసి యశోదాకృష్ణ అని పేరు పెట్టాడు. ఏ తల్లిప్రేమైనా తన బిడ్డ కోసం తక్కువేమీ కాదు కదా అని ప్రశ్నించినట్టుంటుంది. ఈయన చిత్రాలలో స్త్రీ పాత్రల చిత్రాలు ఎక్కువగా కనిపిస్తూ వారిని గౌరవిస్తున్నట్టు అర్థం జనించడమే కాదు, కీచకులు, రావణులు కూడా మన చుట్టుపక్కలే వున్నారు అని మన సమాజం మీద వ్యాఖ్య చెప్పినట్టుంటుంది. తన చుట్టుపక్కల మనుషులనే చూపుతూ చిత్రాలు వేయటం వలన, చిత్రాలలో భావాలు నిజ భావప్రకటనతో నిండి వుంటాయి. ఇందుకు ఈయన నాటకాలను, తన చుట్టూవున్న మనుషుల రాగద్వేషాలను చక్కగా ఉపయోగించే, మనల్ని మనం పోల్చుకోగల చిత్రాలు, ప్రశ్నించుకోవలసిన విషయాలనూ మన ముందు వుంచి ఇది మన సమాజ జీవితం అని వ్యాఖ్య చెపుతాడు. శకుంతలా పత్రలేఖనం వంటి చిత్రంలో ఎంత సున్నితత్వం చూపించాడో, ఇంద్రుడిని జయించి సచీదేవిని బంధించి తండ్రియైన రావణుడికి బహుమతిగా తెచ్చిన మేఘనాధుడి రాక్షసత్వమూ అంతే భావోద్వేగాలతో చిత్రించాడు. ‘సీత భూమి ప్రవేశం’ చిత్రంలో సీత దయనీయ స్థితి, తల్లి భూమి ఆవేదన అంతే సమపాళ్లలో చూపాడు. కాళిదాసు కావ్యాల ఊర్వశి పురంధర చిత్రాలు వేసి, ఆ సున్నితత్వము చిత్రాలలో తెచ్చాడు.

ఈయన చిత్రాలు చూసి ఒక విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది. మనం రామాయణ మహాభారతాలంటే, రాముడు, కృష్ణుడు మటుకే కథానాయకులుగా చిత్రాలు, కథలు చూస్తాం, ఇష్టపడతాము. ఇతని చిత్రాలు ఇంద్రజిత్తు కథలు, జటాయువు కథలు కూడా ముందుకు తెస్తాయి. విశ్వామిత్ర – మేనక, శంతను – గంగ, శంతను – సత్యవతి లేక భారతమే లేదు కదా అని మూలాలను శోధించి ఈ పాత్రలు అంతే ముఖ్యమైనవని, మనం తెర వెనుక వదిలిన రూపాలను ముందు తెచ్చి చూశారా? అని ప్రశ్నించినట్టుంటుంది. ఇతని ఈ ఆలోచనలు మానవతా దృక్పథంతో (నబఎaఅఱరఎ) అందరినీ సమానంగా చూడగలగాలనే ఆలోచన ప్రదర్శిస్తుంది. మనలోనూ యశోదలు, ప్రేమమూర్తులు వున్నారని చెపుతున్న మానవాళి విలువలు వుంటాయి.
రవివర్మ సామాజిక స్పృహ కూడా అంతే బలమైనది. కళలు, చిత్రాలు ఆనాటి వరకు రాజ ఆస్థానాలకు, ధనికులకు మాత్రమే పరిమితమైనాయి. బ్రిటిష్‌వారు నేర్పిన ఆర్ట్‌ స్కూల్‌లో నేర్చిన కళాకారులను వారు ఒక వేదికపై నిలబెట్టి వారు ఆధునిక కళాకారులన్నారు. వారి చిత్రాలూ అందరికీ అర్థమై, అందుబాటులోకి రాలేదు. ఆ కాలంలో రవివర్మ, తన చిత్రాలను అందరు చూడగలిగేటట్టు ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆలోచన చేశాడు. అతను వేసిన లక్ష్మి, సరస్వతి, విష్ణు వంటి దేవతా రూపాలను, ఓలియోగ్రాఫు పద్ధతిన ముద్రించి, ఎన్నో చిత్రాలుగా తక్కువ ధరకే సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడు. ఇలా సగటు మానవులకు దగ్గరై దేశమంతా గుర్తించగల చిత్రకారుడయ్యాడు.

ఆనాడు ఆధునికత వెనక్కు నెడుతున్న భారతీయ సంస్కృతి ఒక సందిగ్దావస్థలో వుంది. అలాగే బ్రిటిష్‌ వారి విద్యారంగాలలో ఉత్తీర్ణులైన వారికి యూరప్‌ వెళ్లి వచ్చిన వారికీ ఆధునిక తైలవర్ణ చిత్రం, నిజమనిపించేలా చిత్రించిన ఫొటోగ్రాఫులాంటి రవివర్మ చిత్రాలు నచ్చాయి. భారతీయత కోసం ఆరాటపడుతున్న వారికి మన పురాణ కథల చిత్రాలు అభిమానం పెంచాయి.
ధనిక వర్గాలవారికి ఈ విషయాలతోపాటు ఇతని చిత్రాలలోని ఆర్భాటమైన వస్త్ర, ఆభరణాలు నచ్చాయి. ఎక్కడా ఆర్ట్‌ స్కూల్‌కి వెళ్లి నిజమనిపించే చిత్రం వేయటానికి కావలసిన కొలతల చిత్ర పద్ధతి అతను నేర్చుకోలేదు. అందువల్ల కొన్ని సార్లు అతని చిత్రాలలో చేతులు, కాళ్లు, వేళ్లు కొలతల్లో తేడా కనిపిస్తుంది. ఇతని ఆడంబర వస్త్రాలు నగలు ఆ తేడా కప్పివేస్తాయి.
రవివర్మ చిత్రాలను సంప్రదాయ చిత్రమనాలా, ఆధునికమనాలా అనే ప్రశ్న తలెత్తింది. పురాణేతిహాసాలు చిత్రాలుగా వేశాడని సంప్రదాయ చిత్రమనాలన్నారు. ఆధునిక తైల వర్ణ, నిజమనిపించే చిత్రాలు వేశాడని ఆధునికుడని మరికొందరన్నారు. అతను ఆధునిక చిత్రకారుడే. అందుకు కారణం తైలవర్ణం, బ్రిటిష్‌ పద్ధతి మాత్రమేకాదు. సంప్రదాయాన్ని లోతుల వరకూ ఆలోచించకుండా మంచి, చెడుల ఆలోచన లేకుండా అనుకరిస్తే అది సంప్రదాయ అనుకరణ అవుతుంది. రవివర్మ తన చిత్రాల ద్వారా పురాణేతిహాసాలలో మనం గుర్తించని విషయాలను ఎత్తి చూపి ముఖ్యమైన అన్ని కోణాలకు గుర్తింపు ఇవ్వాలని చూపాడు. మానవతా దృష్టి, సామాజిక కోణంలో ఆలోచించడమూ ఆధునికతేను. మనం మిధ్యారూపాలుగా చూసే పురాణేతిహాసాలు, మన సమాజంలోని రూపానికి, మిధ్యా రూపాలకు మధ్య దూరం తగ్గించి, మనలోనూ అలాంటి గొప్ప వ్యక్తులు వుంటారని మనలాంటి వారికి తన చిత్ర రూపాల ద్వారా ఆలోచనలు ప్రేరేపించాడు. కళలు ఖజానా గారాల వారికే సొంతం కాదని, సమాజానికి తన ప్రదర్శనల ద్వారా ముద్రణ కళ ద్వారా సగటు మానవులకూ దగ్గర చేశాడు. ఆయన చిత్రించిన లక్ష్మీ సరస్వతులు ప్రతి సగటు ఇల్లూ చేరాయి. సంప్రదాయ కాగడాని అందుకుని ముందుకు అందించడం కాదు. అందు విషయాలను విశ్లేషణ చేసి ముందుకు సాగటం ఆధునికత. సగటు మానవుల భావోద్రేకాలను తన చిత్రంలో చూపటం, మానవీయ ఆధునికత. ఇతని ఆధునిక చిత్రం సగటు సమాజం అర్థం చేసుకోగలిగింది. భారతదేశంలో అందరినీ మెప్పించిన చిత్రం వేసి, భారతీయతను ఒకే మార్గాన ఏకం చేశాడు. రవివర్మ చిత్రం ఇలా ఒక గొప్ప మైలురాయిలా ఆధునికతకు మరో దారి చూపింది.
భారతీయ ఆర్కియాలజీ సంస్థ వారు ఎన్నుకున్న భారతీయ కళారత్నాలు తొమ్మిది కళా రత్నాలలో ఈయన చిత్రం చేర్చారు.

డా||యమ్‌.బాలామణి, 8106713356

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -