ఏటా 130 కోట్ల టన్నుల మేర పారవేత
తీవ్రమైన ఆకలిలో 36.3 కోట్ల మంది ప్రజలు
మధ్యప్రాచ్య యుద్ధంలో బాధితులు 4.5 కోట్ల మంది : యూఎన్ డబ్ల్యూఎఫ్‌పీ సమాచారం
ఇస్తాంబుల్ : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆకలి, పోషకాహారలోప సంక్షోభ తీవ్రత ప్రధాన సమస్యగా మారుతోంది. పలు పేద దేశాలు తమ ప్రజలకు ఆహారాన్ని కూడా అందించలేని స్థితిలో ఉన్నాయి. ఇక ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ ప్రజలు ఆహారాన్ని వృథా చేస్తోన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏటా 130 కోట్ల టన్నుల మేర ఆహారాన్ని పారవేస్తుండటం ఆందోళన కలిగించే విషయం. ఐక్యరాజ్యసమితి (యూఎన్)కు చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) గణాంకాలు పలు విషయాలను వెల్లడిస్తున్నాయి.
డబ్ల్యూఎఫ్‌పీ 2026 గ్లోబల్ అవుట్‌లుక్ ప్రకారం.. ప్రస్తుత ఏడాదిలో 36.3 కోట్ల మంది ప్రజలు ఇప్పటికే సంక్షోభ స్థాయి ఆకలిని లేదా అంతకంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మధ్యప్రాచ్యంలోని సంఘర్షణ ఈ ఆహార సంక్షోభ తీవ్రత ఆందోళనకర స్థాయికి చేరింది. ఇదిలాగే కొనసాగితే.. రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తాయని ప్రపంచ ఆహార కార్యక్రమం హెచ్చరిస్తోంది. 2025లో.. గాజా, సూడాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో రెండు కరువులు సంభవించినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ శతాబ్దంలో ఇది అత్యంత వినాశకరమైన మొదటి సంఘటనగా డబ్ల్యూఎఫ్‌పీ వివరించింది. అనేక ఆహార సంక్షోభాల్లో ప్రతి ఏటా తీవ్రమవుతూ ఉండే అనేక పరస్పర సంబంధిత సమస్యలు ఉంటాయని విశ్లేషకులు చెప్తున్నారు.
ప్రధాన కారణాలేంటి?
ఇలాంటి కఠిన పరిస్థితులకు అనేక కారణాలు ఉంటాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా దేశాల మధ్య సంఘర్షణ, వాతావరణ పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ, స్థానభ్రంశం వంటివి ప్రధానమైనవని చెప్తున్నారు. కారణాలేవైనా బాధితులుగా మారేది పేద, అణగారిన వర్గాల ప్రజలేనని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రపంచ దేశాలు ఐక్యంగా పోరాడాలని సూచిస్తున్నారు.
ఎలా అంతం చేయగలం?
ప్రపంచ ఆహార సంక్షోభాన్ని అంతం చేయడానికి ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థలు, ప్రయివేటు రంగ భాగస్వాముల మధ్య సమన్వయ ప్రయత్నమే ఏకైక మార్గమని డబ్ల్యూఎఫ్‌పీ అభిప్రాయపడింది. సోమాలియా వంటి దేశాల్లో అంతర్జాతీయ సమాజం ఏకమై 2022లో ప్రజలను కరువు అంచు నుంచి కాపాడగలిగింది. ఆకలితో అలమటిస్తున్నవారి ప్రాణాలను కాపాడటానికి, ఆకలి విపత్తు వ్యాప్తిని నిరోధించడానికి, శాంతి స్థాపన ప్రయత్నాలను బలోపేతం చేసేందుకు, సరిహద్దులు, సంఘర్షణ రేఖల మీదుగా సురక్షితమైన వాతావరణం కోసం రాజకీయ, దౌత్యపరమైన పరిష్కారాలు అవసరమని డబ్ల్యూఎఫ్‌పీ నివేదించింది.
మూలకారణాలను గుర్తించి.. పరిష్కరించాలి
అయితే ఆకలితో అలమటిస్తున్న ప్రజలను బతికించడానికి ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వివరించింది. ఇందులో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఆ ఆకలికి మూల కారణాలను పరిష్కరించడం ద్వారా మాత్రమే ఆకలికి, ఆహార సంక్షోభానికి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని గుర్తించింది. వాతావరణ మార్పులకు అనుగుణంగా మారడానికి, మంచి పోషణను ప్రోత్సహించడానికి, ఆహార వ్యవస్థలను మెరుగుపరచడానికి డబ్ల్యూఎఫ్‌పీ చేస్తున్న కృషి లక్షలాది మందికి మరింత సుసంపన్నమైన భవిష్యత్‌కు పునాదులు వేస్తుందని వివరించింది.
కేవలం నాలుగేండ్లలో డబ్ల్యూఎఫ్‌పీ, పలు స్థానిక సంఘాలు ఐదు ఆఫ్రికన్ దేశాల్లోని 1,58,000 హెక్టార్ల బీడు భూములను వ్యవసాయానుకూలంగా, పశువుల దాణాకు అనుకూలంగా మార్చాయి. వాతావరణ-బీమా కార్యక్రమం 2023 నాటికి ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, కరేబియన్‌లోని 18 దేశాల్లో దాదాపు 5,50,000 కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చింది. అదే సమయంలో, డబ్ల్యూఎఫ్‌పీ ప్రపంచవ్యాప్తంగా 83 దేశాల ప్రభుత్వాలతో కలిసి జాతీయ భద్రతా వలయాలను, పోషకాహార-సామాజిక రక్షణను పెంపొందించడానికి కృషి చేస్తోంది.
నిధుల కొరత.. భారీ మూల్యానికి దారి
ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం విషయంలో తీవ్రమైన కృషి సలుపుతోన్న డబ్ల్యూఎఫ్‌పీ తీవ్రమైన నిధుల కొరత కారణంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఫలితంగా తాను నిర్దేశించుకున్న కార్యక్రమాలు, లక్ష్యాలతో పాటు ఇతర చర్యలను ప్రభావవంతంగా చేపట్టలేకపోతోంది. ఈ పరిస్థితులు డబ్ల్యూఎఫ్‌పీని సహాయాన్ని తగ్గించుకోవడానికి దారి తీస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. డబ్ల్యూఎఫ్‌పీ ఉన్నత లక్ష్యాలకు నిధుల కొరత సమస్య ఏర్పడటంతో అత్యంత బలహీన వర్గాల ప్రజలు వెనుకబడిపోతున్నారని వివరించింది. కాబట్టి ఈ కార్యక్రమానికి వనరులను అందుబాటులోకి తీసుకువచ్చి సహాయపడకపోతే ప్రాణనష్టం, కష్టపడి సాధించిన అభివృద్ధి విజయాలు తిరోగమన మార్గంలోకి వెళ్తాయనీ, దీంతో భారీ మూల్యం చెల్లించక తప్పదని డబ్ల్యూఎఫ్‌పీ హెచ్చరించింది.
యుద్ధంతో తీవ్ర ప్రభావం
ఇక మధ్యప్రాచ్యంలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ప్రపంచంలో తీవ్ర అనిశ్చితి నెలకొన్నది. ఇది ఇంధన, ఎరువుల రవాణాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు తగ్గే ప్రమాదం పొంచి ఉంది. ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్యను తీవ్రం చేస్తుందని విశ్లేషకులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో యుద్ధంలో బాధితులు 4.5 కోట్ల మంది వరకు ఉంటారని డబ్ల్యూఎఫ్‌పీ అంచనా వేసింది. అయితే ఈ యుద్ధానికి ముగింపు పలకకపోతే మరింత నష్టం పొంచి ఉంటుందని మేధావులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.



