Friday, April 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు సంఘం జిల్లా మూడవ మహాసభలను జయప్రదం చేయండి

రైతు సంఘం జిల్లా మూడవ మహాసభలను జయప్రదం చేయండి

- Advertisement -

రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్ 
నవతెలంగాణ – ఆలేరు రూరల్

ఈనెల 7న భూదాన్ పోచంపల్లిలో నిర్వహించనున్న తెలంగాణ రైతు సంఘం  జిల్లా మూడవ మహాసభలను విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్ రైతులకు పిలుపునిచ్చారు.శుక్రవారం ఆలేరు పట్టణంలో తెలంగాణ రైతు సంఘం నూతన పట్టణ కమిటీని ఎన్నుకున్నారు.పట్టణ అధ్యక్షుడిగా లక్కాకుల సుభాష్,ఉపాధ్యక్షుడిగా మొరిగాడి అశోక్,కోశాధికారిగా అంగిరేకుల శ్రీను,గణగాని మల్లేశం, సహాయ కార్యదర్శులుగా మొరిగాడి బాలయ్య తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్  పాల్గొని మాట్లాడుతూ జిల్లా రైతాంగ సమస్యలపై ఇప్పటివరకు రైతు సంఘం అనేక బహుముఖ పోరాటాలు నిర్వహించిందని ఆయన తెలిపారు.రాబోయే కాలానికి ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు ఈ మహాసభలు కీలకమని పేర్కొన్నారు.రైతు లేనిది రాజ్యం లేదని అందరూ చెప్పినా, రైతు శ్రేయస్సు కోసం పాలకవర్గాలు బాధ్యతాయుతంగా పనిచేయడం లేదని ఆయన విమర్శించారు.వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి, రైతులకు సరైన మద్దతు ధరలు,అవసరమైన సౌకర్యాలు కల్పించినప్పుడే వ్యవసాయం సుభిక్షంగా మారుతుందని అన్నారు.కానీ ప్రస్తుతం అమలవుతున్న విధానాలు వ్యవసాయానికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విదేశీ ఒత్తిళ్లకు లోనై వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోందని,పత్తి,జొన్న, మొక్కజొన్న,సోయాబీన్ వంటి పంటలను జీరో టాక్స్‌తో విదేశాల నుండి దిగుమతి చేసుకోవడం వల్ల దేశీయ రైతులకు నష్టం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.దీని ఫలితంగా స్వదేశీ పంటలకు డిమాండ్ తగ్గి రైతులు ఆర్థికంగా దెబ్బతింటారని హెచ్చరించారు.విత్తన సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ బిల్లు విత్తన రంగాన్ని కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి నెట్టేస్తుందని, విత్తన ధరలపై ప్రభుత్వ నియంత్రణ తగ్గి కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచే ప్రమాదం ఉందని అన్నారు.విదేశీ విత్తనాలు విఫలమైతే రైతులకు నష్టపరిహారం కూడా సకాలంలో అందకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యుత్ సవరణ చట్టం అమలైతే రైతులకు లభిస్తున్న సబ్సిడీలు తగ్గే అవకాశం ఉందని,మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, రుణమాఫీ అమలులో కూడా నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. రైతులపై భారాలు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మొరిగాడి దేవేందర్ ,మొరిగాడి జలంధర్,శ్రీను,రాజయ్య,చిన్న బాలయ్య, కిష్టయ్య,లక్కాకుల వెంకటేష్,లక్కాకుల రాజయ్య,మొరిగాడి ఆంజనేయులు,లక్కాకుల శ్రీను, మొరిగాడి రమేష్,లక్కాకుల కృష్ణ, లక్కాకుల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -