నాడు తెలంగాణలో నైజాం పాలనపై తిరగబడ్డ ప్రాంతాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాది ప్రత్యేక చరిత్ర. రజాకార్ల రాచరిక దోపిడీ, దౌర్జన్యాలను ఎదిరించడంలో కమ్యూనిస్టులతో పాటు వారికి అండగా నిలబడిన ప్రజల పాత్ర మరువలేనిది. ఈ పోరాటంలో నాయకులే కాదు, వారి కుటుంబ సభ్యులు కూడా అనేక నిర్భందాలకు గురికావాల్సి వచ్చింది. ఆ పోరాటంలో ముందుభాగాన నిలబడ్డ వారిలో కామ్రేడ్ మేదరమెట్ల సీతా రామయ్య-అనసూయ దంపతులను చెప్పుకోవచ్చు. హుజూర్నగర్ పాత తాలూకా రంగాపురంలోని ధనిక రైతు కుటుంబంలో జన్మించిన అనసూయ తుదిశ్వాస వరకు అట్టడుగు వర్గాల, పీడిత జనం కోసమే నడిచింది. సీతారామయ్యకు వెన్నంటే ఉండి చంద్రునికో నూలుపోగులా విప్లవ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించింది.
1944లో కామ్రేడ్ సీతారామయ్యతో వివాహం జరిగేనాటికి అనసూయకి రాజకీయాలు తెలియవు.కానీ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, సాగిన నిర్బంధం ఆమెపై ప్రత్యక్ష ప్రభావం చూపింది. రైతాంగ పోరాటంలో దళ నాయకుడిగా పనిచేస్తున్న కామ్రేడ్ సీతారామయ్యఫై తీవ్రమైన నిర్బంధం కొనసాగుతున్న కాలంలో ఆయన రహస్య జీవితం గడపవలసి వచ్చింది. ఆ కాలంలో కామ్రేడ్ అనసూయ రంగాపురం తన తల్లిగారి ఇంట్లో ఉండేది. అక్కడ కూడా తీవ్రమైన నిర్బంధం వచ్చింది.అనేకసార్లు పోలీసు మిలిటరీ ఆ ఇంటిని దోపిడీ చేశారు.అనసూయతో పాటు అమ్మమ్మ రాఘవమ్మ తల్లి ఎర్రమ్మలను విపరీతంగా కొట్టి అనేక చిత్రహింసలకు గురిచేశారు.తల వెంట్రుకలు తీసి గుండు కొట్టించారు. అయినప్పటికీ అనసూయలో ధైర్యం సడలలేదు. అనేక ఇబ్బందులను, అవమానాలను భరించింది. కమ్యూనిస్టు రాజకీయాలతో మమేకం కావడంతో కలిగిన చైతన్యమిది.
కులం పట్టింపులు అంటరానితనం,అసమానతలు లాంటివి విపరీతంగా రాజ్యమేలుతున్న రోజుల్లో ఆమె వాటిని వ్యతిరేకించి, అన్ని బంధుత్వాల కన్నా రాజకీయ ఐక్యతే బలమైనదిగా నమ్మింది. నిర్బంధాలు, ఆర్థిక ఇబ్బందులను ఏనాడు లెక్కచేయలేదు.అన్నిటికి మించి ఆమెతో కమ్యూనిస్టు రాజకీయాలు విప్లవ పోరాటాలు పెనవేసుకోవడంతో కారుచీకటిలో కాంతిరేఖలా సీతారామయ్యకు ఎల్లవేళలా అండగా నిలిచింది. తుదిశ్వాస వరకు ధైర్యసహసాలతో ముందుకు సాగింది. సాయుధ పోరాట విరమణ అనంతరం ఉద్యమాల్లో కామ్రేడ్ మేదరమెట్ల సీతారామయ్య అనేక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. పార్టీ నాయకత్వాన సాగిన లింగగిరి, హుజుర్నగర్, అగ్రహారం గ్రామాల్లో జరిగిన భూపోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రజలకు భూములు పంచారు. హుజూర్నగర్ ప్రాంతంలో ముఖ్యంగా మార్క్సిస్టు పార్టీ పైన తీవ్రమైన నిర్బంధం సాగింది. ఎంతోమంది నాయకులను హత్య చేశారు.
ఇలాంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్న రోజుల్లో శత్రు శిబిరాలను గడగడలాడించిన వ్యక్తి సీతారామయ్య. ఆయన పేరు వింటేనే శత్రువుల గుండెల్లో దడ పుట్టేది. పార్టీపై నిర్బంధం వచ్చినప్పుడల్లా పార్టీ క్యాడర్ రోజుల తరబడి సీతారామయ్య ఇంట్లో తలదాచుకునేవారు. కామ్రేడ్ అనసూయ అందరితో మమేకమై కష్టాల్లో ఉన్న క్యాడర్‌కు (కార్యకర్తలకు నాయకులకు) ధైర్యాన్ని నూరిపోసేవారు. వారికి భోజనం పెట్టేవారు. ఆమె ధన్యజీవి. సంపూర్ణమైన విప్లవ జీవితం గడిపారు.ఆమెకు నలుగురు కూతుళ్లు. ఆడపిల్లలని ఆమె ఏనాడు కలత చెందలేదు. వారంతా ఇప్పుడు ప్రయోజకులయ్యారు. స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ కూడా అనసూయ నిరాకరించారు. ఆమె నీతి, నిజాయితీ, నిబద్ధత, ధైర్య సాహసం, చివరికంటూ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)గా జీవించటమే అనసూయలో ఉన్న గొప్ప లక్షణం. ఆమె కొంతకాలంగా అనారోగ్యానికి గురై 25 మార్చి 2026 న తుదిశ్వాస విడిచారు. నేడు వెలిదండలో సంతాప సభ సందర్భంగా ఆమెను స్మరించుకోవడం, ఆమె ఆశయబాటలో ముందుకు సాగడమే అనసూయకిచ్చే నిజమైన నివాళి.
ములకలపల్లి రాములు
9490098338



