వారంలో 10 బిలియన్ డాలర్లు ఫట్
ముంబయి : దేశ ఆర్థిక పటిష్టతకు సూచికగా భావించే విదేశీ మారకం నిల్వలు వేగంగా అడుగంటుతున్నాయి. మార్చి 27తో ముగిసిన వారం వ్యవధిలోనే భారత విదేశీ మారక నిల్వలు 10.29 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.95వేల కోట్లు) తగ్గి 688.06 బిలియన్ డాలర్లకు పడిపోయాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం వెల్లడించింది. అంతకుముందు వారంలో కూడా ఇవి 11.41 బిలియన్ డాలర్లు తగ్గడం ఆందోళకరనం. పశ్చిమాసియాలో చెలరేగిన ఉద్రిక్తతల ప్రభావం భారత రూపాయిపై తీవ్రంగా పడుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న రికార్డు స్థాయిలో 728.49 బిలియన్ డాలర్ల వద్ద ఉన్న నిల్వలు యుద్ధ వాతావరణం నెలకొన్న తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. పతనమవుతున్న రూపాయి విలువను కాపాడేందుకు ఆర్‌బీఐ మార్కెట్లో డాలర్లను విక్రయించడం, స్పెక్యులేషన్‌పై కఠిన చర్యలు తీసుకోవడం వంటి పరిణామాలు ఈ నిల్వల తగ్గుదలకు ప్రధాన కారణమయ్యాయి. మారకం నిల్వలలో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 6.62 బిలియన్ డాలర్లు తగ్గి 551.07 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. పసిడి నిల్వల విలువ కూడా 3.66 బిలియన్ డాలర్లు తగ్గి 113.52 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద ఉండే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్) మాత్రం 17 మిలియన్ డాలర్లు పెరిగి 18.65 బిలియన్ డాలర్లకు చేరాయి.
విదేశీ మారకం నిల్వలు అమాంతం కరిగిపోవడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్లతో పోలిస్తే రూపాయి విలువ వేగంగా క్షీణిస్తుంది. దీనివల్ల విదేశాల నుంచి మనం కొనుగోలు చేసే వస్తువులు ఖరీదవుతాయి. తద్వారా ముడి చమురు దిగుమతి ఖరీదు కావడంతో రవాణా ఖర్చులు పెరిగి, దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. యంత్రాల దిగుమతికి అవసరమైన విదేశీ కరెన్సీ లేక దేశ పారిశ్రామిక వృద్ధి మందగిస్తుంది. అంతిమంగా భారత రుణ పరపతి సామర్థ్యం దెబ్బతిని ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది.
కరుగుతున్న విదేశీ మారక నిల్వలు
- Advertisement -
- Advertisement -



