Saturday, April 4, 2026
E-PAPER
Homeఆటలుఉడ్తా పంజాబ్‌

ఉడ్తా పంజాబ్‌

- Advertisement -

సూపర్‌కింగ్స్‌పై 5 వికెట్లతో గెలుపు
ఛేదనలో చెలరేగిన శ్రేయస్‌ అయ్యర్‌
చెన్నై 209/5
పంజాబ్‌ 210/5


పంజాబ్‌ కింగ్స్‌కు ఎదురు లేదు. తొలి మ్యాచ్‌లో టైటాన్స్‌ను చిత్తు చేసిన శ్రేయస్‌ సేన.. చెపాక్‌లో సూపర్‌కింగ్స్‌ను మట్టికరిపించింది. శ్రేయస్‌ అయ్యర్‌ (50 నాటౌట్‌) అర్థ సెంచరీకి తోడు కూపర్‌ (36), ప్రభుసిమ్రన్‌ (43), ప్రియాన్షు ఆర్య (39) మెరవటంతో 210 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ కింగ్స్‌ ఊదేసింది. మరో 8 బంతులు ఉండగానే 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యువ బ్యాటర్‌ ఆయుశ్‌ మాత్రె (73) అర్థ సెంచరీకి తోడు శివం దూబె (45 నాటౌట్‌) రాణించటంతో చెన్నై సూపర్‌కింగ్స్‌ 209 పరుగులు చేసింది. ఈ సీజన్లో సూపర్‌కింగ్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి.

నవతెలంగాణ-చెన్నై
ఐపీఎల్‌ 19లో పంజాబ్‌ కింగ్స్‌ వరుసగా రెండో విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఊదేసిన పంజాబ్‌ కింగ్స్‌ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై గెలుపొందింది. 26 బంతుల్లో అర్థ సెంచరీతో శ్రేయస్‌ అయ్యర్‌ (50, 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఛేదనలో కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ నమోదు చేశాడు. ప్రభుసిమ్రన్‌ సింగ్‌ (43, 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), ప్రియాన్షు ఆర్య (39, 11 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అదిరే ఆరంభం అందించారు. ప్రియాన్షు ఆర్య 4 ఫోర్లు, 3 సిక్సర్లతో పవర్‌ప్లేలో పంజా విసిరాడు. కూపర్‌ కానొలి (36, 22 బంతుల్లో 6 ఫోర్లు) మరోసారి కీలక ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. ఆఖర్లో శ్రేయస్‌ అయ్యర్‌ నిష్క్రమించినా.. శశాంక్‌ సింగ్‌ (14 నాటౌట్‌), మార్కస్‌ స్టోయినిస్‌ (9 నాటౌట్‌) లాంఛనం ముగించారు. 18.4 ఓవర్లలోనే 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. సూపర్‌ కింగ్స్‌ బౌలర్లు ఏ దశలోనూ పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టలేదు. టాప్‌-4 బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాట్‌ ఝులిపించారు. 17 ఓవర్లలోనే 186 పరుగులు చేసిన పంజాబ్‌ కింగ్స్‌ గెలుపు లాంఛనం చేసుకుంది. సూపర్‌కింగ్స్‌ బౌలర్లలో మాట్‌ హెన్రీ (2/54), అన్షుల్‌ కంబోజ్‌ (2/43) వికెట్లు పడగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌కింగ్స్‌ ఆయుశ్‌ మాత్రె (73, 43 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), శివం దూబె (45 నాటౌట్‌, 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించటంతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది.

ఆయుశ్‌ అర్థ సెంచరీ
యువ బ్యాటర్‌ ఆయుశ్‌ మాత్రె (73) అర్థ సెంచరీతో రాణించాడు. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (28)తో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించిన ఆయుశ్‌.. చెన్నై సూపర్‌కింగ్స్‌ భారీ స్కోరు సాధించేందుకు గట్టి పునాది వేశాడు. పవర్‌ప్లేలోనే క్రీజులోకి వచ్చిన ఆయుశ్‌ మాత్రె వస్తూనే దూకుడు మంత్ర జపించాడు. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 29 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ మరో ఎండ్‌లో తడబాటుకు గురయ్యాడు. రెండు ఫోర్లు కొట్టినా.. వేగంగా పరుగులు సాధించటంలో విఫలమయ్యాడు. 22 బంతుల్లో 28 పరుగులే చేశాడు. ఆయుశ్‌, రుతురాజ్‌లు రెండో వికెట్‌కు 55 బంతుల్లోనే 96 పరుగులు జోడించారు. ఆయుశ్‌ మరో సిక్సర్‌, రెండు ఫోర్లు బాది వికెట్‌ కోల్పోగా.. రుతురాజ్‌ను చాహల్‌ సాగనంపాడు. కార్తీక్‌ శర్మ (1)ను మార్కో యాన్సెన్‌ అవుట్‌ చేశాడు. దీంతో 110/1తో పటిష్టంగా సాగిన సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌.. 130/4తో కష్టాల్లో కూరుకుంది. ఈ సమయంలో శివం దూబె (45 నాటౌట్‌), సర్ఫరాజ్‌ ఖాన్‌ (32, 12 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) దంచికొట్టారు. సర్ఫరాజ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దూబె ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో మెరవటంతో సూపర్‌కింగ్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఓపెనర్‌ సంజు శాంసన్‌ (7) మరోసారి నిరాశపరచగా.. ప్రశాంత్‌ వీర్‌ (6 నాటౌట్‌, 7 బంతుల్లో 1 ఫోర్‌) ఒత్తిడిలో తనదైన షాట్లు ఆడలేకపోయాడు. పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లలో విజరు కుమార్‌ వైశాక్‌ (2/38), యుజ్వెంద్ర చాహల్‌ (1/21), మార్కో యాన్సెన్‌ (1/43), జేవియర్‌ బార్ట్‌లెట్‌ (1/48) వికెట్లు పడగొట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -