Saturday, April 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమామిడి రైతు డీలా

మామిడి రైతు డీలా

- Advertisement -

పూత దశ నుంచే వెంటాడుతున్న చీడపీడల వ్యాప్తి
మంచు ప్రభావంతో రెండు నెలలు ఆలస్యంగా పూత, కాత
వాతావరణ స్థితి అనుకూలించక గణనీయంగా తగ్గిన దిగుబడి
మామిడి తోటలు తొలగించి ప్రత్యామ్నాయ దిశగా యోచన

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించక మామిడి రైతులు డీలా పడుతున్నారు. చలి తీవ్రతతో పూత ఆలస్యమైంది. నవంబర్‌లో రావాల్సిన పూత జనవరిలో వచ్చింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో చీడపీడలు ఆశించి, బూజుపట్టి పిందెలు రాలుతున్నాయి. కాలానుగుణంగా ఆశించిన పూత రాకపోవటం, వచ్చిన కొద్ది మొత్తం మంచు ప్రభావానికి లోనవటంతో రైతులు ఆందోళనలో పడ్డారు. పూతతోపాటు పిందెలు కూడా అరకొరగా రావటం, మరోవైపు చీడపీడల వ్యాప్తి కూడా తీవ్రంగా ఉండటంతో తోటల్లో కాయలు పలుచగా ఉన్నాయి. దిగుబడి ఆశించిన మేరకు లేక రైతులు నష్టాల బాట పడుతున్నారు. రాష్ట్రంలో 3.50 లక్షలకు పైగా ఎకరాల్లో మామిడి సాగవుతోంది. దీనిలో మహబూబ్‌నగర్‌, నల్లగొండ, జగిత్యాల, మహబూబాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం, కుమ్రుంభీం ఆసిఫాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, యాదాద్రి-భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో చీడపీడలు మామిడి తోటలను ఆశించాయి.

దేశంలోనే మామిడి సాగు విస్తీర్ణంలో రాష్ట్రం 9వ స్థానంలో ఉంది. 5వ స్థానంతో మామిడి ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తోంది. ఖమ్మం, మంచిర్యాల వంటి జిల్లాలు అధిక దిగుబడితో విదేశీ ఎగుమతులకు సైతం అనుకూలంగా ఉండేవి. ప్రస్తుత పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో అనేక మంది రైతులు మామిడిని తొలగించి ఆయిల్‌ పామ్‌, ఇతర ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో బాంగనపల్లి, బంగినపల్లి, తోతాపురి, సువర్ణరేఖ వంటి రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. ఖమ్మం, మంచిర్యాల, వనపర్తి వంటి జిల్లాలు మామిడి సాగులో ముందంజలో ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 38,746 ఎకరాల్లో మామిడి సాగవుతోంది. అత్యధికంగా సత్తుపల్లి నియోజకవర్గంలో 19,463, మధిరలో 5,483, అశ్వారావుపేటలో 4,823, పాలేరులో 2,409, ఖమ్మంలో 1,953, వైరాలో 1,930, ఇల్లందులో 1,744, కొత్తగూడెంలో 576, పినపాకలో 319, భద్రాచలంలో 46 ఎకరాలలో సాగు చేస్తున్నారు.

పూత, కాత ఆలస్యం..
సాధారణంగా అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో రావాల్సిన పూత ఈసారి వాతావరణ మార్పుల వల్ల డిసెంబర్‌లో వచ్చింది. అదే సమయంలో భారీగా కురిసిన మంచుతో పూత కాయగా మారలేదు. చాలా తోటల్లో చెట్లు ఉన్నా.. కాయలు కనిపించని పరిస్థితి. మంచు కారణంగా ‘తేనెమంచు పురుగు ఉధృతి పెరిగింది. దీన్ని అరికట్టేందుకు రైతులు మూడు, నాలుగుసార్లు పురుగు మందులు చల్లారు. అయినా ఆశించిన ఫలితం లేదు. తోటలు పూతదశలోనే దెబ్బతినటంతో గతేడాదితో పోల్చితే కాయల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. చాలా తోటల్లో చెట్లు వెలవెలబోతున్నాయి. ఎకరం మామిడితోట ఉంటే లక్షాధికారులమని గతంలో రైతులు భావించేవారు. నేడు ఎన్ని ఎకరాలున్నా.. సాగు ఆర్థిక భారంగా మారుతోందని కర్షకులు చెబుతున్నారు. రెండు, మూడేండ్లుగా సరైన దిగుబడులు రాక అప్పులపాలయ్యే పరిస్థితులు నెలకొన్నాయని వాపోతున్నారు. చీడపీడల బెడద తట్టుకోలేక అనేక మంది ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.

కర్షకులపై ఆర్థిక భారం
పిందెలకు కవర్లు కట్టి, చెట్లకు ఇంజెక్షన్లు వేయాల్సి వస్తుందంటున్నారు. గతంలో మామిడిసాగులో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. కొన్నేండ్లుగా ఉభయ జిల్లాల్లో మామిడిసాగు ప్రశ్నార్థకమవుతోంది. సత్తుపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 19,463 ఎకరాల్లో మామిడి సాగవుతోంది.

30-35 శాతమే కాయలు
మామిడితోటలో పూత ఆలస్యమవటం, మంచు ప్రభావంతో పిందెలు రాలిపోవటంతో 30-35శాతం మాత్రమే కాయలుగా మారాయి. గతేడాది కన్నా ఈసారి అధిక ఆర్థిక భారం పడేలా ఉంది. మార్కెట్‌లో ఆశించిన ధర ఉంటే తప్ప.. పెట్టుబడి ఖర్చులూ పూడే పరిస్థితి లేదు. తెగుళ్లు, అకాల వర్షాల నుంచి కాయలను కాపాడుకోవటానికి రక్షణ సంచులు తొడుగుతున్నాం. కాయ సంరక్షణ కూడా ఇబ్బందికరంగా ఉంది. -జక్కంపూడి కిశోర్‌, మామిడి రైతు, చండ్రుపట్ల, కల్లూరు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -