నవతెలంగాణ – తుంగతుర్తి
స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో, అఖండ భారతావనికి, విశేష సేవలందించిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని తుంగతుర్తి సొసైటీ చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా స్థానిక సర్పంచ్ మల్లెపాక సాయిబాబుతో కలిసి మండల కేంద్రంలోని వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. ఈ మేరకు విద్యార్థి దశ నుండే అంటరానితనానికి వ్యతిరేకంగా, కుల వివక్ష పై, అణగారిన వర్గాల అభ్యున్నతికి, దేశ నిర్మాణానికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు.
భారతదేశ చరిత్రలో సుదీర్ఘకాలం పని చేసిన కేంద్ర క్యాబినెట్ మంత్రిగా రికార్డ్ సృష్టించారని అన్నారు. కార్మిక శాఖ,సమాచార, రోడ్డు రవాణా, రైల్వేలు, రక్షణ శాఖ, నీటిపారుదల శాఖ, వ్యవసాయం లాంటి ఎన్నో శాఖలను సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు సాధించారని అన్నారు. భారత జాతి గర్వించదగ్గ జాతీయ నాయకులు, దళితుల జీవితాల్లో వెలుగు రేఖలు నింపిన వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే బాపూజీకి మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో వారి వెంట పట్టణ అధ్యక్షులు ఉప్పుల రాంబాబు, కొండరాజు, పోలేపాక రామచంద్రు, గుగులోత్ దీప్ల, దాసరి శీను, గుగులోత్ భాస్కర్, మాచర్ల అనిల్ క్యాస్ట్రో, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.



