Thursday, August 20, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మదర్‌ ఆఫ్‌ ‌లా.. జస్టిస్‌ ‌లీలా

మదర్‌ ఆఫ్‌ ‌లా.. జస్టిస్‌ ‌లీలా

- Advertisement -

జస్టిస్ లీలా సేథ్… ఆమె కేవలం చరిత్ర సృష్టించిన న్యాయమూర్తి మాత్రమే కాదు. చట్టం ప్రజలను రక్షించాలి కానీ వారి జీవితాలను కష్టతరం చేయకూడదని నమ్మిన స్త్రీమూర్తి. లైంగిక దాడులకు సంబంధించిన చట్టాలను బలోపేతం చేయడంలో సహాయపడిన మహిళ. అలాగే తన స్వలింగ సంపర్కుడైన కొడుకు కోసం గళం విప్పి ఎందర్నో ఆలోచింపచేశారు. నిజమైన న్యాయం కేవలం కోర్టు గదులకు పరిమితం కాదని గుర్తు చేశారు. న్యాయవాద వృత్తికి కావాల్సిన మార్గదర్శకాలను అందించిన మహిళా న్యాయమూర్తి. నిజానికి ఆమె న్యాయావాది కావాలని ఎన్నడూ అనుకోలేదు. కానీ ఆమె ఎలా ఈ రంగంలోకి వచ్చిందంటే..

లీలా సేథ్‌ అక్టోబర్‌ 20, 1930లో లక్నో జన్మించారు. పదకొండేండ్ల వయసులో ఆమె తన తండ్రిని కోల్పోయారు. అప్పటి నుండి తల్లి ఆమెను పెంచి పెద్ద చేసింది. అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. అయినా ఆ తల్లి తన బిడ్డను ఉన్నత చదువులు చదివించింది. వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లే ఆమెను ఓ స్వతంత్ర జీవితాన్ని నిర్మించుకోవాలని కృత నిశ్చయంతో ఉన్న ధీరగా మార్చాయి. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే లీలా డార్జిలింగ్‌ హైస్కూల్‌‌లో విద్య పూర్తి చేశారు. అస్సాం రైల్‌ లింక్‌ ప్రాజెక్టులో స్టెనోగ్రాఫర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ప్రేమ్ సేథ్‌ను వివాహం చేసుకున్నారు. భర్తతో కలిసి లండన్ వెళ్లారు.

వృత్తిపట్ల గౌరవంతో…
న్యాయవాద వృత్తిలోకి లీలా అనుకోకుండా వచ్చారు. ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు పిల్లలను పెంచుకుంటూ, రెగ్యులర్ తరగతులకు హాజరు కాకుండా పూర్తి చేయగల కొన్ని కోర్సుల కోసం అన్వేషించారు. అలా 1958లో అక్కడ గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత న్యాయశాస్త్రం అభ్యసించారు. అదే ఏడాది ఐఎఎస్‌ అధికారిగా ఎంపికయ్యారామె. కాని న్యాయవాది వృత్తిపట్ల అభిమానంతో ఆ వృత్తినే చేపట్టారు. ఇండియా తిరిగొచ్చిన తర్వాత ఆమె మొదట కోల్‌కతాలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఆ తర్వాత పట్నాలో, ఢిల్లీలో న్యాయవాద వృత్తిని కొనసాగించారు. 1978లో ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ వ్యవహరించారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన మహిళగా ఆమె రికార్డులలోకి ఎక్కారు. గౌరవనీయమైన న్యాయమూర్తులలో ఒకరిగా ఎదిగేందుకు తాను ఎన్ని అడ్డంకులను ఛేదించిందో తెలిసేలా తన లైఫ్‌ జర్నీ గురించి ‘ఆన్ బ్యాలెన్స్: ఏన్ ఆటోబయోగ్రఫీ’ అనే పుస్తకంలో వివరించారు.

పురుషాధిక్య ప్రపంచంలో…
1958లో ఆమె లండన్ బార్ పరీక్షలో టాపర్‌గా నిలిచిన మొదటి మహిళ ఆమె. ఇది ఆకాలంలో అతిపెద్ద ఘనత. ఆ పరీక్షకు కొన్ని రోజుల ముందే మగబిడ్డకు జన్మనిచ్చారు. దాంతో బిడ్డను ఎత్తుకుని ఉన్న లీలా సేథ్‌ ఫొటోను ‘మదర్‌-ఇన్‌-లా’ అనే క్యాప్షన్‌తో లండన్‌ పత్రిక ప్రచురించింది. అయితే ఆమె న్యాయవాద వృత్తిని ప్రారంభించినప్పుడు, ఒక సీనియర్ న్యాయవాది ఆమె ఆశయాలను కొట్టిపారేస్తూ ‘వెళ్లి పెళ్లి చేసుకో’ అన్నారు. దానికి లీలా ప్రశాంతంగా, ‘నాకు అప్పటికే పెళ్లయింది’ అని బదులిచ్చారు. అక్కడి పక్షపాత బుద్ధి ఆమెను ఆపలేదు. లింగ భేదం కన్నా.. ప్రతిభకే ఎక్కువ ప్రాధాన్యం ఉందని తన పనితో ఆమె నిరూపించారు. లీలా భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు న్యాయస్థానాలలో పురుషుల ఆధిపత్యం అధికంగా ఉండేది. మహిళా న్యాయవాదులు అరుదుగా ఉండేవారు. ఒకవేళ ఉన్నా కూడా వారు కేవలం మహిళల కేసులను మాత్రమే వాదించాలని ఆదేశించేవారు. లీలా ఆ పరిమితులను అంగీకరించడానికి నిరాకరించారు. క్లిష్టమైన రాజ్యాంగ, పన్ను, క్రిమినల్ చట్టపరమైన విషయాలపై వాదించి తనోంటే నిరూపించుకున్నారు.

లైంగిక దాడుల చట్టాల బలోపేతం…
2012లో జరిగిన దారుణమైన ఢిల్లీ సామూహిక లైంగిక దాడి(నిర్భయ) యావత్ దేశాన్ని కుదిపేసింది. పైగా మహిళల భద్రత కోసం మరింత కఠినమైన చట్టాలను డిమాండ్ చేస్తూ విస్తృతమైన నిరసనలకు దారితీసింది. చట్టపరమైన సంస్కరణలను సిఫార్సు చేయడానికి ప్రభుత్వం జస్టిస్ వర్మ కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ లీలా దాని ముగ్గురు సభ్యులలో ఒకరు. ఈ కమిటీ వేగంగా పనిచేసి, లైంగిక హింసకు సంబంధించిన భారతదేశ క్రిమినల్ చట్టాలలో గణనీయమైన మార్పులకు దారితీసిన సిఫార్సులను రూపొందించింది.

నా కొడుకు నేరస్థుడు కాదు..
లీల కుమారుడు ప్రఖ్యాత రచయిత విక్రమ్ సేథ్, స్వలింగ సంపర్కుడు. 2013లో ఒక కోర్టు తీర్పు తర్వాత సెక్షన్ 377 మరోసారి స్వలింగ సంబంధాలను నేరంగా పరిగణించినప్పుడు ఆమె దానికి వ్యతిరేకంగా మాట్లాడారు. లక్షలాది మందిని కదిలించేలా మాట్లాడారామె. అసలు ఆ సెక్షన్ 377 ఎందుకు అన్యాయమో వివరిస్తూ.. ఆమె శక్తిమంతంగా తన గళం వినిపిస్తూ రాశారు. కేవలం తాము ఎలా ఉన్నారో అలా ఉన్నందుకే ఎవరినీ శిక్షించకూడదని వాదించారు. ఎందరో ప్రముఖులు మౌనం వహించిన సమయంలో, ఆమె స్వరం లెక్కలేనంత మంది స్వలింగ సంపర్కుల్లో ఆశాభావాన్ని రేకెత్తించింది. అలా లీలా సేథ్‌ చివరి క్షణం వరకు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం అందిలే సహాయ సహకారాలు అందించారు. ఆమె 2017లో 86 ఏండ్ల వయసులో మరణించారు. ఆఖరికి తన శరీరాన్ని కూడా వైద్య పరిశోధన కోసం దానం చేశారామె.

సమానత్వాన్ని చట్టంలోకి తీసుకొచ్చారు..
సమానత్వం కేవలం మాటల్లోనే కాకుండా చట్టంలో కూడా ఉండాలని జస్టిస్ లీలా విశ్వసించారు. కుమారులతో సమానంగా కుమార్తెలు కూడా వారసత్వ హక్కులను అనుభవించాలని వాదిస్తూ, హిందూ వారసత్వ చట్టానికి మార్పులను సిఫార్సు చేసిన కమిటీకి ఆమె అధ్యక్షత వహించారు. ఆమె సిఫార్సులు 2005 సవరణలో కీలక పాత్ర పోషించాయి. ఇది చివరకు పూర్వీకుల ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కులను కల్పించింది. భారతదేశ వ్యాప్తంగా లెక్కలేనంత మంది మహిళలకు, ఇది కేవలం ఒక చట్టపరమైన సంస్కరణకు మించినది. దీని అర్థం ఆర్థిక భద్రత, స్వాతంత్ర్యం, తమ కుటుంబాలలో సమాన సభ్యులుగా గుర్తింపు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -