నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) చేపట్టిన ప్రత్యేక విస్తృత ఓటర్ల సవరణ (సర్) ప్రక్రియ తర్వాత, బెంగాల్లో ఓటర్ల జాబితా నుంచి దాదాపు 91 లక్షల మంది ఓటర్లను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై మమతా బెనర్జీ స్పందించారు. కేంద్ర ఎన్నికల నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తానని చెప్పారు. భబానీపూర్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. సుప్రీంకోర్టు ప్రకారం తొలగించిన పేర్లను తెలియజేయాలని, ఈసీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని, మరోసారి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆమె చెప్పారు. అయితే గతంలో కూడా నేరుగా మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో వాదనలు విన్పించారు. అనేక సంద్భరాల్లో కూడా అనైతికంగా బెంగాల్లో ఓట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే ఈ జాబితా సవరణ ప్రక్రియ తర్వాత రాష్ట్రానికి సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. ఫిబ్రవరి 28న విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం, గతేడాది నవంబర్లో సర్ ప్రక్రియ ప్రారంభమైన ప్పటి నుంచి 63.66 లక్షల పేర్లు (అంటే మొత్తం ఓటర్లలో సుమారు 8.3 శాతం) తొలగించారు. దీంతో ఓటర్ల సంఖ్య సుమారు 7.66 కోట్ల నుంచి 7.04 కోట్లకు పైగా తగ్గిపోయింది. 7.04 కోట్ల ఓటర్లలో, ‘పరిశీలనలో ఉన్న’ (అండర్ అడ్జుడికేషన్) కేటగిరీలో 60.06 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. న్యాయాధికారుల పరిశీలనలో ఈ 60.06 లక్షల ‘పరిశీలనలో ఉన్న’ ఓటర్లలో 27.16 లక్షలకు పైగా పేర్లను తొలగించినట్టు ఈసీ డేటా తెలిపింది. ‘పరిశీలనలో ఉన్న’ కేటగిరీ లోని వారిలో 32.68 లక్షల మంది పైగా తుది జాబితాలో చేర్చారు. ఈసీ డేటా ప్రకారం, సర్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి తుది తొలగిం పులు సుమారు 90.83 లక్షలుగా ఉన్నాయి.
కాగా, మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు రెండు దఫాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 23,29 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మే 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.



