Monday, August 24, 2026
E-PAPER
Homeఖమ్మంపంట దశను బట్టి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి

పంట దశను బట్టి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి

- Advertisement -

– ఏడీఏ పెంటేల రవికుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట

వర్షాధారంగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న పత్తి పంటలో ప్రస్తుతం రైతులు పంట దశను బట్టి యాజమాన్య పద్ధతులు చేపట్టాలని ఏడీఏ పెంటేల రవికుమార్ సూచించారు. పత్తి పంట ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో 40, 60, 80 రోజుల దశల్లో ఉందని తెలిపారు. పంట దశను బట్టి పైపాటుగా ఎరువులు అందించాలన్నారు.

ఎకరాకు 25 కిలోల యూరియా, 10 కిలోల మూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ అందించాలని సూచించారు. నేలలో తగినంత తేమ ఉన్నప్పుడే ఎరువులు వేయాలన్నారు. ఎరువులను వెదజల్లకుండా మొక్కకు నాలుగు అంగుళాల దూరంలో, అదే లోతులో వేసి మట్టితో కప్పాలని తెలిపారు. అడపాదడపా కురుస్తున్న చిరుజల్లులతో పత్తి మొక్కలు నిలదొక్కుకుంటున్నాయని పేర్కొన్నారు.

అంతర కృషితో తేమ నిల్వ:
పత్తి పొలాల్లో తరచుగా అంతర కృషి చేయడం ద్వారా మట్టి మల్చింగ్‌ ఏర్పడి నేలలో తేమ నిల్వ ఉంటుందని ఏడీఏ తెలిపారు. దీంతోపాటు కలుపు మొక్కల ఉధృతిని అణచివేయవచ్చన్నారు. వర్షాధార పంటల్లో నేల తేమను సంరక్షించుకోవడం కీలకమని సూచించారు.

రసం పీల్చే పురుగులపై నిఘా:
ఎక్కువ రోజులు బెట్ట పరిస్థితులు నెలకొన్నప్పుడు పత్తిలో రసం పీల్చే పురుగులు, ముఖ్యంగా తామర పురుగులు ఆశించే అవకాశం ఉందన్నారు. తొలుత వేపనూనెను లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు. పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే ఫిప్రోనిల్‌ 2 మిల్లీలీటర్లు లేదా ఫ్లోనికమైడ్‌ 0.3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. పత్తిలో తామర పురుగుల నివారణకు నీలి రంగు జిగురు అట్టలను ఎకరాకు 10 చొప్పున ఏర్పాటు చేసుకోవడం ఉపయోగకరమని వ్యవసాయ సూచనల్లోనూ పేర్కొంటున్నారు.

గులాబీరంగు పురుగుపై నిఘా:
బెట్ట పరిస్థితుల్లో గులాబీరంగు పురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉందని ఏడీఏ తెలిపారు. దీని ఉనికిని ముందుగానే గుర్తించేందుకు ఎకరాకు 8 నుంచి 10 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పురుగు ఉనికి గుర్తించిన వెంటనే వ్యవసాయ అధికారుల సలహాతో నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -