భారతదేశం వైవిధ్యం, అభివృద్ధి దాని సమాఖ్య వ్యవస్థలో దాగి ఉంది. ”రాష్ట్రాల కలయికే దేశం” అని రాజ్యాంగం ఘోషిస్తున్నప్పటికీ, గత దశాబ్ద కాలంగా కేంద్రంలోని అధికార యంత్రాంగం అనుసరిస్తున్న విధానాలు ఈ పునాదులను కదిలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను ‘సమాఖ్య హక్కుల పరిరక్షణ’ వేదికగా మార్చుకోవాలి. 2017లో జిఎస్‌టి అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలు తమ సొంత పన్ను అధికారాలను కోల్పోయి, కేంద్రమిచ్చే నిధులపై ఆధారపడే ‘నిస్సహాయ స్థితి’కి చేరుకున్నాయి. కేంద్రం రాష్ట్రాల ఆర్థిక స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తూ, వనరులను కేంద్రీకృతం చేస్తోంది. నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు తమ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు చెల్లించడానికి కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఎకనామిక్ సర్వే 2025-26’ ప్రకారం, 2018-19లో రెవెన్యూ మిగులు ఉన్న 19 రాష్ట్రాలు, 2024-25 నాటికి కేవలం పదకొండుకు పడిపోయాయి. రాష్ట్రాల ఉమ్మడి రెవెన్యూ లోటు జీడీపీలో 0.1శాతం నుంచి 0.7శాతానికి పెరగడం దేశ ఆర్థిక ఆరోగ్యంపై ఆందోళన కలిగిస్తోంది. రాజ్యాంగంలోని లొసుగులను వాడుకుని, కేంద్రం సెస్, సర్‌ఛార్జీ రూపంలో భారీగా నిధులను సేకరిస్తోంది. ఇవి రాష్ట్రాలకు పంచాల్సిన అవసరం లేని నిధులు కావడం కేంద్రానికి వరంగా మారింది. 2013-14లో మొత్తం పన్ను ఆదాయంలో వీటి వాటా కేవలం 6.53శాతం. 2023-24 నాటికి ఇది సుమారు 14.5శాతం (సుమారు రూ.5.01 లక్షల కోట్లు)కు చేరింది.ఒకవేళ ఈ నిధులను ‘డివిజబుల్ పూల్’ (రాష్ట్రాలకు పంచే నిధులు)లో చేర్చి ఉంటే, రాష్ట్రాలకు అదనంగా రూ.2.06 లక్షల కోట్లు లభించేవి. 16వ ఆర్థిక సంఘం ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని, సెస్ ఆదాయాన్ని కూడా రాష్ట్రాలకు పంచాలని నిలదీయాలి.
ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ ఒక పెద్ద వైఫల్యంగా మిగిలిపోయింది. 2021-22 నాటికి తయారీ రంగ వాటాను జీడీపీలో 25శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, 2026 నాటి తాజా గణాంకాల ప్రకారం ఇది కేవలం 13.3శాతం వద్దే ఆగిపోయింది. ఇది గత యుపిఏ ప్రభుత్వం సాధించిన దానికంటే తక్కువ కావడం గమనార్హం.ఈ వైఫల్యం వల్ల దేశంలో నిరుద్యోగం నిప్పులా దహించుకుపోతోంది. వికసిత్ భారత్ 2047 వంటి నినాదాలు కేవలం కార్పొరేట్ శక్తులను, అంతర్జాతీయ సామ్రాజ్యవాద శక్తులను సంతృప్తి పరచడానికే తప్ప, సామాన్యుడి కడుపు నింపేవి కావని స్పష్టమవుతోంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో వచ్చిన విబిజి రామ్‌జి-2025 రాష్ట్రాలపై అదనపు భారాన్ని మోపింది. గతంలో కేంద్రం ప్రధాన వాటా భరించేది, కానీ కొత్త చట్టం ప్రకారం రాష్ట్రాలు నలభై శాతం వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. నిధుల కొరతతో ఉన్న రాష్ట్రాలకు ఇది తీరని అన్యాయం.
వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు, ఆధునీకరణ, అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలంటే రాష్ట్రాల వద్ద తగిన నిధులు ఉండాలి. అందుకే, కేంద్రం తన వద్ద ఉంచుకుంటున్న నిధుల్లో యాభై శాతం వాటాను రాష్ట్రాలకు బదిలీ చేయాని ఆలిండియా కిసాన్ సభ (ఎఐకెఎస్) కోరుతోంది. బలమైన రాష్ట్రాలతోనే బలమైన భారతం. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రాలను కేవలం మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చాలని చూస్తోంది. అధికార కేంద్రీకరణ ప్రజాస్వామ్యానికి చేటు. ఒక రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్నప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు కేవలం ఒక పార్టీ గెలుపోటముల నిర్ణయం మాత్రమే కాదు, అది దేశ సమాఖ్య వ్యవస్థ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. కార్పొరేట్ అనుకూల విధానాలను, రాష్ట్రాల హక్కుల అణచివేతను నిరసిస్తూ బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని కిసాన్ సభ పిలుపునిస్తోంది. సమాఖ్య స్ఫూర్తిని కాపాడుకోవడం, ఆర్థిక స్వయంప్రతిపత్తిని సాధించడం, నిరుద్యోగ రహిత దేశాన్ని నిర్మించుకోవడమే నేటి తక్షణ కర్తవ్యం.
మూడ్ శోభన్
9949725951



