Friday, April 10, 2026
E-PAPER
Homeఆటలుముకుల్‌ మెరిసె లక్నో మురిసె

ముకుల్‌ మెరిసె లక్నో మురిసె

- Advertisement -

కోల్‌కతాపై సూపర్‌జెయింట్స్‌ గెలుపు
ఛేదనలో చెలరేగిన ముకుల్‌ చౌదరి
నైట్‌రైడర్స్‌ 181/4, సూపర్‌జెయింట్స్‌ 182/7

నవతెలంగాణ-కోల్‌కతా
యువ ఆటగాడు ముకుల్‌ చౌదరి (54 నాటౌట్‌, 27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరువగా, లక్నో సూపర్‌జెయింట్స్‌ మురిసింది. 182 పరుగుల ఛేదనలో 14.4 ఓవర్లలో 125/6తో సూపర్‌జెయింట్స్‌ కష్టాల్లో కూరుకుంది. బ్యాటర్లు డగౌట్‌కు చేరగా, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గెలుపు లాంఛనమే అనిపించింది. కానీ కుర్ర క్రికెటర్‌ ముకుల్‌ చౌదరి కండ్లుచెదిరే హిట్టింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఏడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదిన ముకుల్‌ చౌదరి భయమెరుగని బ్యాటింగ్‌తో చెలరేగాడు. అవేశ్‌ ఖాన్‌ (1 నాటౌట్‌)తో కలిసి 24 బంతుల్లోనే 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

కార్తీక్‌ త్యాగి, కామెరూన్‌ గ్రీన్‌ ఓవర్లలో 29 పరుగులు పిండుకున్న ముకుల్‌ చౌదరి..ఆఖరు ఓవర్లో 14 పరుగులు అవసరం కాగా వైభవ్‌ అరోరాపై రెండు సిక్సర్లు సంధించాడు. ముకుల్‌ చౌదరి మెరుపులతో లక్నో సూపర్‌జెయింట్స్‌ 3 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై మెరుపు విజయం సాధించింది. అంతకుముందు, ఆయుశ్‌ బదొని (54, 34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో కదం తొక్కాడు. మిచెల్‌ మార్ష్‌ (15), ఎడెన్‌ మార్‌క్రామ్‌ (22), రిషబ్‌ పంత్‌ (10), నికోలస్‌ పూరన్‌ (13), అబ్దుల్‌ సమద్‌ (2) నిరాశపరిచారు. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో వైభవ్‌ అరోరా (2/38), అనుకూల్‌ రాయ్ (2/32) రాణించారు. లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఇది రెండో విజయం కాగా.. నైట్‌రైడర్స్‌కు ఇది మూడో పరాజయం.

రాణించిన రహానె, రఘువంశీ
తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సొంతగడ్డపై ఆశించిన ప్రదర్శన కనబరచలేదు. ఆత్మవిశ్వాసం లోపించిన నైట్‌రైడర్స్‌ బ్యాటింగ్‌లో అంచనాలను అందుకోలేదు. ఫిన్‌ అలెన్‌ (9) మరోసారి మిస్‌ఫైర్‌ కాగా.. అజింక్య రహానె (41, 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రఘువంశీ (45, 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఇటు రహానె, అటు రఘవంశీ రాణించటంతో పది ఓవర్లలో కోల్‌కతా 98/1తో మంచి స్థితిలో నిలిచింది. కానీ ద్వితీయార్థంలో నైట్‌రైడర్స్‌ బ్యాటింగ్‌ ట్రాక్‌ తప్పింది. కామెరూన్‌ గ్రీన్‌ (32 నాటౌట్‌, 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయంగా నిలిచినా బౌలర్లపై ఎదురుదాడి చేయలేదు. రింకు సింగ్‌ (4) నిరాశపరిచాడు. రోవ్‌మాన్‌ పావెల్‌ (39 నాటౌట్‌, 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. సూపర్‌జెయింట్స్‌ బౌలర్లలో ప్రిన్స్‌ యాదవ్‌ (1/47), మణిమరన్‌ సిద్దార్థ్‌ (1/34), దిగ్వేశ్‌ (1/25), అవేశ్‌ ఖాన్‌ (1/44) రాణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -