Friday, April 10, 2026
E-PAPER
Homeజాతీయంభారత జీడీపీ 6.6 శాతానికి తగ్గొచ్చు

భారత జీడీపీ 6.6 శాతానికి తగ్గొచ్చు

- Advertisement -

ప్రపంచ బ్యాంక్‌ రిపోర్ట్‌
న్యూఢిల్లీ :
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధానంగా ఇంధన సెగను పెంచుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 90 నుంచి 100 డాలర్ల మధ్య ఊగిసలాడటం భారత్‌కు అతిపెద్ద సవాలుగా మారిందని ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది. చమురు ధరలు పెరిగితే దేశీయంగా రవాణా భారమై, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని.. దీనివల్ల వృద్ధి రేటుపై ఒత్తిడి పడి 2026-27 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.6 శాతానికి నెమ్మదించవచ్చని ప్రపంచ బ్యాంక్‌ హెచ్చరించింది. వాణిజ్యపరంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులపై విధిస్తున్న భారీ టారిఫ్‌లు భారత ఎగుమతిదారులకు ప్రతిబంధకంగా మారాయి.

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో అస్థిరత ఏర్పడి, సరఫరా గొలుసు దెబ్బతినే అవకాశం ఉంది. ఇది ఎగుమతులపై ఆధారపడిన రంగాలను దెబ్బతీస్తూనే దిగుమతి చేసుకునే ముడి సరుకుల ఖర్చును పెంచి తయారీ రంగాన్ని ప్రతికూలతల్లోకి నెట్టే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి భారత్‌ వద్ద పటిష్టమైన విదేశీ మారక నిల్వలు, ఆర్థిక వెసులుబాటు ఉన్నప్పటికీ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే ఈ బఫర్స్‌ కరిగిపోయే ముప్పు పొంచి ఉంది. ప్రభుత్వం ఇంధన ధరలను స్థిరంగా ఉంచడం ద్వారా అస్థిరతను అదుపు చేస్తున్నప్పటికీ అంతర్జాతీయంగా చమురు మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనైతే ఆ భారాన్ని భరించడం ప్రభుత్వానికి పెను సవాలుగా మారుతుంది. ఇవన్నీ కలిసి భారత ఆర్థిక వృద్ధి అంచనాలను కింది వైపునకు నెట్టే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్‌ విశ్లేషించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -