నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ అత్యంత అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించనున్నారని, ఆమెతో స్వచ్ఛందంగా రాజీనామా చేయించేందుకు సీనియర్లు యత్నిస్తున్నారనే ప్రచారం ఊపందుకున్న సమయంలో… ఆమె సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టేందుకు అపాయింట్మెంట్ కోరడం కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను అధిష్ఠానం తీవ్రంగా పరిగణించిందని, ఆమెపై వేటు వేసేందుకు కూడా సిద్ధపడిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ రకమైన తీవ్రమైన రాజకీయ ఉద్రిక్తతల నడుమ కొండా సురేఖ నేరుగా ముఖ్యమంత్రిని కలిసేందుకు ఆసక్తి చూపడం ప్రాధాన్యత సంతరించుకుంది.



