Tuesday, July 1, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలు11న కాళేశ్వరం కమిషన్‌ విచారణకు కేసీఆర్‌

11న కాళేశ్వరం కమిషన్‌ విచారణకు కేసీఆర్‌

- Advertisement -

అంతకు ముందే హాజరు కానున్న హరీశ్‌రావు
కేటీఆర్‌తోనూ మంతనాలు
దీటుగా ఎదుర్కొనే యత్నం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

కాళేశ్వరం న్యాయ కమిషన్‌ విచారణను దీటుగా ఎదుర్కోవాలని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించుకున్నారు. అందుకు సన్నద్ధమవుతున్నారు. న్యాయ కమిషన్‌ చైర్మెన్‌ పీసీ ఘోష్‌ ఈనెల 5న విచారణకు హాజరుకావాలంటూ వారం రోజుల క్రితమే కేసీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. దీనికి ఆయన అదనపు సమయం కావాలనీ, వచ్చే11వ తేదీన వస్తానని చేసిన విజ్ఞప్తికి కమిషన్‌ అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ ఇప్పటికే పలుమార్లు పార్టీ నాయకులతో అంతర్గతంగా మంతనాలు జరిపారు. ప్రధానంగా కాళేశ్వరం నిర్మాణ సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అల్లుడు తన్నీరు హరీశ్‌రావు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కుమారుడైన కే.తారకరామారవుతోనూ ఓ దఫా చర్చించారు. అలాగే న్యాయవాదులు, ఇతర నీటిపారుదలరంగ నిపుణులతో ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో చర్చలు సాగుతున్నట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిన నాటి నుంచి నిర్మాణం పూర్తయ్యేవరకు మాజీ సీఎం కేసీఆర్‌ కనుసన్నల్లో జరిగిన విషయం విదితమే. ఇప్పుడదే ఆయనకు తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టు ప్రాంతం, డిజైన్లు, సాంకేతిక అంశాలు, నిర్మాణం, నిధులు తదితర విషయాల్లో ఇంజినీర్ల సలహాలు, సూచనలు కాకుండా తాను అనుకుందే ఆచరణలో చేసి చూపించారనే ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తిన విషయమూ తెలిసిందే. అయితే కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ ప్రాంతాల్లో భూసారపరీక్షలు చేయకుండా నిర్మించారనీ, సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లో నిర్ణయించిన విధంగా కాకుండా మరో చోట బ్యారేజీలను నిర్మించారని విజిలెన్స్‌ కమిషన్‌ తేల్చింది. నీళ్లున్న చోట్ల కాకుండా మరో చోట ప్రాజెక్టును ప్రతిపాదించారనేది ఇంకో ఆరోపణ. వీటన్నింటిపై ఇప్పటికే పీసీ ఘోష్‌ విచారణ జరిపింది. ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, ఇతర నిపుణులతో మాట్లాడింది. ఎవిడెన్స్‌ కింద అఫిడవిట్లు తీసుకుంది. కాళేశ్వరం ఫైళ్లన్నీంటిని తెప్పించుకుని అధ్యయనం చేసింది. విచారణ దాదాపు పూర్తికావచ్చింది. ప్రజాప్రతినిధులను మాత్రం విచారించాల్సిన అవసరం లేదని తొలుత భావించిన కమిషన్‌, ఆనక వారికీ నోటీసులు ఇచ్చింది. జూన్‌ 30 నాటికి విచారణను పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలనే సంకల్పంతో కమిషన్‌ పనిచేస్తున్నది. ఈ తరుణంలో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఈనెల 11న కేసీఆర్‌ కమిషన్‌ ముందుకు రానున్న నేపథ్యంలో ఆయన ప్రాజెక్టుపై అవగాహన చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు ఉద్దేశం, లక్ష్యం, ఇతర అంశాలను కమిషన్‌ దృష్టికి తేవాలని భావిస్తున్నారు. డిజైన్లు, సాంకేతిక అంశాలు, భూసార పరీక్షలు తదితర విషయాలు నీటిపారుదల శాఖకు సంబంధించినవిగా చెప్పే అవకాశాలు ఉన్నాయని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. కాగా కేసీఆర్‌కు ముందే మాజీ మంత్రి హరీశ్‌రావు కమిషన్‌ ఎదుటకు రానున్నారు. హరీశ్‌రావు సైతం న్యాయవాదులు, మాజీ అధికారులు, నిపుణులతో ఇప్పటికే చర్చలు జరిపారు. దీనిపై మీడియాకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే దాన్ని వాయిదా వేశారు. విచారణకు ముందు ప్రజెంటేషన్‌ ఇస్తారా ? తర్వాత ఇస్తారా ? అనే అంశం తేలాల్సి ఉంది. అయితే అనుమతి ఇస్తే కమిషన్‌కు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వడం ద్వారా తన వాదనలను బలంగా వినిపించాలని హరీశ్‌రావు భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయా అధికారులు, ఇతరులను కమిషన్‌ అడిగిన ప్రశ్నలను ఇటు కేసీఆర్‌, అటు హరీశ్‌రావు అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -