ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాం
వచ్చే ఎన్నికల్లో చూస్కుందాం
ఔర్ ఏక్‌బార్ కాంగ్రెస్ సర్కార్
ఎవరడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతాం
భారీ మెజార్టీతో విజయం సాధిస్తాం
ప్రజాపాలన ఎందుకు పోవాలో జీవన్‌రెడ్డే చెప్పాలి : రైతు ఉత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో -హైదరాబాద్
‘వచ్చే ఎన్నికల్లో నువ్వో.. నేనో… తేల్చుకుందాం రా.. కేసీఆర్…’ అంటూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ‘ప్రజాపాలన పోవాలి.. కేసీఆర్ రావాలి… అంటూ ఓ పెద్ద మనిషి అంటున్నారు…మా పాలన ఎందుకు పోవాలి? పాపాల భైరవుడి లాంటి కేసీఆర్ ఎందుకు రావాలో ఆయనే చెప్పాలి…’ అని మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని ఉద్దేశించి సీఎం ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రతిపక్షహోదా కూడా ఊడగొట్టకపోతే తన పేరు మార్చుకుంటానంటూ ఆయన శపథం చేశారు. ఔర్ ఏక్‌బార్ కాంగ్రెస్ సర్కార్ అంటూ నినదించారు. ఎవరడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతాం…భారీ మెజార్టీతో మువ్వన్నెల జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరిపల్లిలో నిర్వహించిన ‘ప్రజాపాలన-రైతు ఉత్సవాల’ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. సభావేదిక నుంచి రెండోవిడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్పైనా, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆనాడు డీఎస్, వైఎస్ జోడెద్దుల్లా పని చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. అదే మాదిరిగా పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌తోపాటు కార్యకర్తల సహకారంతో తాను రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని వ్యాఖ్యానించారు. తద్వారా చరిత్రను తిరగరాస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ ఓటమి తప్పదని, అది జగిత్యాలతోనే ప్రారంభమవుతుందని హెచ్చరించారు. ఉప ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటిందని గుర్తు చేశారు. చివరికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సైతం కేసీఆర్‌కు ఘోరీ కట్టామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ ఘోరీ మీద కాంగ్రెస్ జెండాను ఎగరేస్తామని హెచ్చరించారు.
లక్షలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ జెండా మోస్తే.. తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. పార్టీ మారిన జీవన్‌రెడ్డి చరిత్రతోపాటు ఆయన వెనకున్న మచ్చలన్నీ తనకు తెలుసునని ఎద్దేవా చేశారు. 40 ఏండ్లపాటు ఆయన కాంగ్రెస్ నుంచి తన కుటుంబానికి ఎన్నో పదవులు ఇచ్చుకున్నారని గుర్తు చేశారు. 14 సార్లు కాంగ్రెస్ బీ ఫామ్ ఇస్తే.. మోసం చేసి వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోయినప్పటికీ ఆయనకు కాంగ్రెస్ ఎన్నోసార్లు పదవులు ఇచ్చి గౌరవించిందని తెలిపారు. పదవి లేకుండా ఏడాదిపాటు ఉండలేకపోయిన జీవన్‌రెడ్డి కార్యకర్తల గుండెలమీద తన్ని శత్రువు పంచన చేరారని దుయ్యబట్టారు. ఏడాదిపాటు పదవి లేకపోతే ఉండలేరా? అని ప్రశ్నించారు. ఒక నాయకుడికి పదవి రాకపోతే.. ప్రజా ప్రభుత్వం పోవాలా? అని జీవన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెడితే పెండ్లి డప్పు.. పెట్టకపోతే చావు డప్పు కొడతావా? అని నిలదీశారు. ‘కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చాక 70వేల ఉద్యోగాలు ఇచ్చాం. వరి వేస్తే ఉరే అంటూ కేసీఆర్ చెప్పి.. ఆయన పొలంలో వరి పండించుకుని క్వింటాకు రూ. 4,200 చొప్పున అమ్ముకున్నారు. కాంగ్రెస్ రైతు భరోసా ఇచ్చింది. రెండు లక్షల రుణమాఫీ చేసింది. 2.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి… దేశంలో నెంబర్ వన్‌గా నిలిచింది. పేదలకు సన్న బియ్యం తినిపిస్తున్నాం.
నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నాం. రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తున్నం…’ ఇవన్నీ ఇస్తున్నందుకే ప్రజా పాలన పోవాలా? అని ప్రశ్నించారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి రైతులకు నీరిచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని సీఎం తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాన్ని తీసుకొచ్చింది కూడా తమ పార్టీయేనని చెప్పారు. దేశంలోనే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన తొలిపార్టీ కాంగ్రెస్ అని వివరించారు. ” నేరెళ్లలో ఎస్సీలను ఇసుక లారీలతో తొక్కించినందుకే పాపాల భైరవుడైన కేసీఆర్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకు రావాలనుకుంటున్నారా? బాగున్న సచివాలయాన్ని వాస్తు బాగా లేదనే కారణంతో కూల్చి కొత్తగా కట్టుకు న్నారు. బిడ్డ, కొడుకు, తండ్రి ఇలా తలో ఫామ్‌హౌస్ కట్టుకున్నారు. పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలనే ఆలోచన ఏనాడైనా వారికి వచ్చిందా? పేదలు.. దొరల గడీల ముందు ఊడిగం చేస్తూ అలాగే ఉండాలని వారు భావించారు. కటు కోవడానికి పనికిరాని బతుకమ్మ చీరెలను పేదలకు పంచారు.
వేములవాడకు రూ.100 కోట్లు ఇస్తామని ప్రకటించి.. పదేండ్ల్లలో ఒక్క రూపాయీ ఇవ్వలేదు. అక్కడి అంజన్న గుడికి రూ. 127 కోట్లు, ముక్తేశ్వరాలయం అభివృద్ధి, భద్రచలం దేవాలయ అభివృద్ధి, గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తున్నందుకు కాంగ్రెస్ దిగిపోవాలా? అని ప్రశ్నించారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ ప్రకటించిన తాము ఏడాదిలోపే చేసి చూపించామన్నారు. 25.35 లక్షల మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద రూ.22 వేల కోట్లు వేశామని చెప్పారు. తొలి విడతలో రైతుభరోసా కింద 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రెండో విడతగా రూ.5,700 కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు ప్రకటించారు. మిగతా రూ.3,300 కోట్లను కూడా వచ్చే నెలలో రైతుల ఖాతాల్లో వేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మంది పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని గుర్తు చేశారు. గతంలో అలాంటి ఆలోచన ఎవరికైనా వచ్చిందా? అని సీఎం ఈ సందర్భంగా ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ బహిరంగ సభలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జీ.వివేక్, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, బలరాం నాయక్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఎట్లొస్తారో చూస్తాం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



