యూఎస్‌ను శాశ్వతంగా వదిలి వెళ్లాలనుకుంటున్నాం
40 శాతం మంది భారతీయుల మనోగతం
రాజకీయ పరిస్థితులు, గ్రీన్ కార్డ్ కష్టాలు, వీసా అనిశ్చితి
నిరాశలో ఇండో-అమెరికన్లు
న్యూఢిల్లీ : అమెరికా వెళ్లాలి, డాలర్లు సంపాదించి, సిలికాన్ వ్యాలీలో స్థిరపడాలన్నది కోట్లాది మంది భారతీయులు కల. అయితే ఇప్పుడు ఆ ‘అమెరికన్ డ్రీమ్స్’ కొంత మందికి కల్లగా, మరికొంత మందికి నిరాశగా మారుతున్నాయి. తాజా సర్వే ప్రకారం యూఎస్‌లో ఉన్న భారతీయులలో 40 శాతం మంది అక్కడి నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నారు. దీని వెనుక పలు కారణాలు ఉన్నాయి. వీటిలో రాజకీయ వాతావరణం నుంచి వలస విధానాల వరకు.. భారతీయుల కలలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
అస్థిర పరిస్థితిని ఎదుర్కొంటున్న భారతీయులు
కార్నెగీ ఎండౌమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అలాగే పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. దీంతో యూఎస్ అనే సూపర్‌పవర్‌గా చెప్పబడే దేశంలో ఏం జరిగింది? ఎందుకు భారతీయులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని చూస్తున్నారు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య జరిగిన ఈ సర్వే ప్రకారం.. భారతీయ-అమెరికన్ సమాజం ప్రస్తుతం ‘అస్థిర పరిస్థితిని’ ఎదుర్కొంటోంది. మొత్తం యూఎస్ జనాభాలో 1.5 శాతమే ఉన్నా.. పన్నుల రూపంలో ఆరు శాతం వరకు కల్పిస్తున్న ఈ సమాజం ఇప్పుడు ఎక్కువ నిరాశకు గురవుతోంది. అత్యంత విజయవంతమైన మైనారిటీగా పరిగణించబడిన ఈ సమాజం ఇప్పుడు తాము మోసపోయామని భావిస్తోంది.
ట్రంప్ పాలనలో రాజకీయ విభజన
యూఎస్‌ను వదిలి వెళ్లాలని ఆలోచిస్తున్నవారిలో 58 శాతం మంది ప్రధాన కారణంగా ‘రాజకీయ వాతావరణం’ అని పేర్కొన్నారు. డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ విభజన మరింత పెరిగిందని వారు అంటున్నారు. మొత్తం 71 శాతం మంది భారతీయులు ట్రంప్ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు. మతపరమైన సమానత్వం తగ్గుతోందనే భావన, ‘అమెరికా అమెరికన్లకే’ అనే భావజాలం పెరుగుతుండటంతో భారతీయులలో అభద్రత ఆవహించింది.
డెమోక్రాట్లు, రిపబ్లికన్లకు తగ్గిన మద్దతు
మరోవైపు డెమోక్రాటిక్ పార్టీ పట్ల కూడా భారతీయుల్లో నమ్మకం తగ్గుతోంది. 2020లో 52 శాతం మంది డెమోక్రాట్స్‌కు మద్దతుగా నిలబడగా.. అది ఇప్పుడు 42 శాతానికి పడిపోయింది. రిపబ్లికన్ పార్టీకి 19 శాతం మంది మాత్రమే మద్దతుగా ఉంటున్నారు. దీంతో 30 శాతం మంది భారతీయులు స్వతంత్ర లేదా పార్టీలకు అతీతంగా మద్దతునిస్తున్నారు. వారు ఇప్పుడు రాజకీయ పార్టీల కంటే జీవనోపాధి, కుటుంబం, భద్రత వంటి అంశాలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇమ్మిగ్రేషన్ కష్టాలు
ఇక భారతీయులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలలో ఒకటి ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ. ఒక భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గ్రీన్‌కార్డు పొందడం ఇప్పుడు ‘జీవిత ఖైదు’లాంటిదిగా మారింది. కొన్ని నివేదికల ప్రకారం వారు గ్రీన్‌కార్డు కోసం 30 నుంచి 40 ఏండ్ల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. హెచ్-1బీ వీసాలపై అనిశ్చితి, ప్రతి దశలో ఉండే పేపర్‌వర్క్ భయం.. ఇవన్నీ కుటుంబాలను స్థిరపడకుండా అడ్డుకుంటున్నాయి. అందుకే ఇప్పుడు చాలా మంది భారతీయులు కెనడా, ఆస్ట్రేలియా దేశాల వైపు చూస్తున్నారు.
ఏప్రిల్ 15న విడుదలైన యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ విడుదల చేసిన వీసా బులెటిన్ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చూపించింది. ఈబీ-2 క్యాటగిరీలో (అధిక అర్హతలు ఉన్న నిపుణులు) కటాఫ్ తేదీ 2014 జులై 15 వద్దే నిలిచిపోయింది. ఈబీ-3 క్యాటగిరీ (ఇతర నైపుణ్య కార్మికులు) కటాఫ్ తేదీ 2013 నవంబర్ 15గా ఉంది. అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితులే భారతీయులను అమెరికా నుంచి దూరంగా నడిపిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు.
కూలుతున్న అమెరికా కల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



