Thursday, September 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరపాలి

భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరపాలి

- Advertisement -

పేదలకు భూములు పంపిణీ చేయాలి : సీపీఐ(ఎం)
దీనిపై అఖిలపక్షం నిర్వహించాలని డిమాండ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపించాలనీ, ఆ భూములను అర్హులైన పేదలందరికీ వెంటనే పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ డిమాండ్‌ ‌చేశారు. భూ సమస్యలపై చర్చించి, తగిన చర్యలు తీసుకుంటామని శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పటాన్నీ, 22ఏ కింద ఎన్ని రకాల భూ సమస్యలున్నాయి? ఎన్ని ఎకరాలున్నాయి? అనేదాన్ని తేల్చడానికి వాటి పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదే అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి పూర్తి స్థాయిలో చర్చించాలని విజ్ఞప్తి చేశారు. ‘12 అంశాల ఆధారంగా విచారణ జరిపి సమస్యలను ఏ,బీ,సీ,డీ,ఈలుగా వర్గీకరించి 30 రోజుల్లో పరిష్కార విధానాలను ప్రకటిస్తామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో 700 ఎకరాల కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌‌లో 300 ఎకరాలకు పైగా అసైన్డ్ భూమి ఉందనీ, మై హోమ్, ఇతర సంస్థలు కూడా అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నాయనీ, కేసీఆర్‌ కుటుంబం, ఇతర ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు భూములను ఆక్రమించారనే విషయాలను వెల్లడించారు.

ఈ మొత్తం భూ వ్యవహారం చూస్తే ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, భూదాన్ భూములు, ఫారెస్ట్ భూములు, వక్ఫ్ బోర్డ్ భూములు, పేదలు సాగు చేసుకుంటున్న భూములన్నింటినీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచుకున్నారని స్పష్టమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో లక్షల కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయని వెల్లడైన మాట వాస్తవం. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి’ అని డిమాండ్‌ ‌‌చేశారు. కేవలం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వరకే పరిమితమైతే అది రాజకీయ కక్ష సాధింపుగానే మిగిలిపోతుందని తెలిపారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, కార్పొరేట్ సంస్థలు, ఏ పేరుతో ఉన్న సంస్థలైనా సరే ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే వాటన్నింటిపైనా పక్షపాతం లేకుండా విచారణ జరిపించాలని డిమాండ్‌ ‌చేశారు. విచారణ వివరాలను అసెంబ్లీలో బహిర్గతం చేసి, చర్చించి, ఆక్రమణకు గురైన భూములన్నింటినీ స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని కోరారు. చట్టానికి మించి భూములు కలిగి ఉన్నవారి వివరాలు పరిష్కరిస్తే భూమి లేని పేదలందరికీ భూమి దక్కే అవకాశం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ అన్యాక్రాంతమైన భూములను ప్రభుత్వం తిరిగి తీసుకుంటే అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి వీలవుతుందని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -