తప్పుడు కేసులు, అవమానకర ప్రచారంపై చర్యలు తీసుకోవాలని వినతి
నవతెలంగాణ – హైదరాబాద్: తనపై కొన్నేళ్లుగా కొనసాగుతున్న సోషల్ మీడియా వేధింపులు, అవమానకర ప్రచారం, తప్పుడు కేసులపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ అల్వాల్‌కు చెందిన జర్నలిస్టు సంకసర్ల సువర్ణ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు కమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సువర్ణ మాట్లాడుతూ.. గతంలో అన్నంచిన్ని వెంకటేశ్వరరావుపై లైంగిక వేధింపులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసిన అనంతరం తనపై కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా తనను తీవ్రంగా వేధిస్తున్నారని, తన ఫొటోలు, ప్రొఫైల్‌ను దుర్వినియోగం చేస్తూ అసభ్యకరమైన, అవమానకరమైన పోస్టులు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
తాను న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన ప్రతిసారీ తనపైనే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని సువర్ణ ఆరోపించారు. దీంతో కోర్టుల చుట్టూ తిరుగుతూ మానసికంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులపై జూలై 2026లో అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసినప్పటికీ, సంబంధిత వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు.
సోషల్ మీడియా ద్వారా తన పరువుకు భంగం కలిగిస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని సువర్ణ కమిషన్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో డా. మంచాల లింగస్వామి, కేబీ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



