మూడు రోజులకో లిఫ్టు.. నాణ్యతలో రాజీ లేదు..! :
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి పనులను శ్రీరామనవమి లోపే పూర్తి చేయాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీరామనవమి, గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రివర్స్ ప్లానింగ్‌తో ముందస్తు కార్యాచరణ రూపొందించాలన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బుధవారం భద్రాచలం చేరుకున్న మంత్రి ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికి వేద ఆశీర్వచనాలతోపాటు తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్‌లతో కలిసి ఉత్తర ద్వారం వద్ద దమ్మక్క విగ్రహం నుంచి నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల ప్రస్తుత దశ, పూర్తికి అవసరమైన సమయం, మానవ వనరులు, నిర్మాణ సామగ్రి తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. లిఫ్టులు, స్లాబ్‌లు, రాతి పనులు, రహదారుల అభివృద్ధి, నిర్మాణ సామగ్రి లభ్యత, సిబ్బంది సమీకరణ, అదనపు నిధులు, సాంకేతిక సమన్వయంపై పనుల వారీగా పురోగతిని పరిశీలించారు. ప్రతి విభాగానికి స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించి వారంవారీ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆలయ పనులకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.275 కోట్లు మంజూరు చేసిందన్నారు. నిర్ణీత గడువులో నాణ్యతతో పూర్తి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో పనిచేయాలన్నారు. ఆలయం, మాడ వీధులు, అంతర్గత, బాహ్య ప్రాకారాల్లో చేపడుతున్న పనులు ముందే పూర్తయ్యేలా చూడాలన్నారు. లిఫ్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచి ప్రతి మూడు రోజులకు ఒక లిఫ్టు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మానవ వనరులు పెంచుకోవాలని, సిబ్బంది కొరతతో పనులు ఆగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నిర్మాణ సామగ్రి లేక అంతరాయం కలగకుండా సెంటరింగ్ సామగ్రిని ముందే సిద్ధం చేసుకోవాలని, అవసరమైన చోట బూమ్ పంపులు, ఇతర యంత్ర పరికరాలను వినియోగించి సామర్థ్యం పెంచాలన్నారు. స్లాబ్ పనుల్లో ఒక దశ పూర్తయ్యే వరకు తదుపరి దశ ఏర్పాట్లు ఆలస్యం కాకుండా సమాంతరంగా చర్యలు చేపట్టాలన్నారు. పనుల మధ్య ఖాళీ సమయం తగ్గించి నిరంతరాయంగా నిర్మాణం సాగేలా సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ప్రతి పనికి వారంవారీ లక్ష్యాలు నిర్దేశించి, పురోగతి లేకపోతే కారణాలు గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. రాతి పనులకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ రోజువారీ లక్ష్యాలు నిర్దేశించాలన్నారు. నాణ్యత, శాస్త్రోక్తత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ వద్దన్నారు. ఆలయ పరిసర రహదారుల అభివృద్ధికి సుమారు రూ.25 కోట్ల ప్రతిపాదనను త్వరితగతిన మంజూరు చేస్తామన్నారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలన్నారు. పనుల పురోగతిపై ప్రజాప్రతినిధులు, కలెక్టర్, సంబంధిత శాఖలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, దేవస్థానం ఈవో దామోదర్ రావు, ఇంజనీరింగ్ అధికారులు, ఆర్కిటెక్ట్‌లు, సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
నవమి నాటికి భద్రాద్రి పనులు పూర్తి కావాల్సిందే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



