నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సెప్టెంబర్ 25న ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం పట్టణంలోని సుందరయ్య భవనంలో ఆర్. మంజుల అధ్యక్షతన నిర్వహించిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ ఈ పర్యటన వివరాలను వెల్లడించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు జాన్ వెస్లీ ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిని సందర్శించనున్నారని పేర్కొన్నారు. రిమ్స్ ఎస్.ఎన్.సీయూ యూనిట్లో ఏసీ పేలిన దుర్ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రిమ్స్ అభివృద్ధికి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మరణించిన చిన్నారుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ. 25 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 లక్షల చొప్పున మొత్తం రూ. 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ పాల్గొంటారని తెలిపారు.
ఎయిర్పోర్టు భూనిర్వాసితులతో భేటీ
అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అనుకుంట గ్రామంలో జాన్ వెస్లీ పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్పోర్టు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు అండగా నిలిచేందుకు వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. బాధితులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మల్లేష్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంక రాఘవులు, జిల్లా కమిటీ సభ్యులు ఎన్. స్వామి, ఉయికే విష్ణు పాల్గొన్నారు.



