Homeఆటలుపతక మోత

పతక మోత

- Advertisement -

రిలే రేసులో మిక్స్‌‌డ్‌ జట్టుకు రజతం
వుషూలో రొషిబినా దేవికి సిల్వర్‌
మరో మూడు కాంస్య పతకాలు సైతం
2026 ఆసియా క్రీడలు

ఆసియా క్రీడల్లో టీమ్‌ ఇండియా పతక మోత మోగుతోంది. గురువారం రెండు రజతాలు సహా ఐదు మెడల్స్‌ ‌సాధించిన భారత్‌ పతకాల సంఖ్య 17కు చేరుకుంది. అథ్లెటిక్స్‌‌లో రెండు మెడల్స్‌ ‌రాగా.. వుషూలో రోషిబినా ఆసియాలో హాట్రిక్‌ ‌కొట్టింది. రోయింగ్‌, షూటింగ్‌‌లో పతకాలు రాగా.. కబడ్డీలో మహిళలు, పురుషుల జట్లు మెడల్స్‌ ‌ఖాయం చేశారు.

నగోయ (జపాన్‌)​
అథ్లెటిక్స్‌‌లో భారత పతక వేట మొదలుపెట్టింది. ట్రాక్‌ అండ్‌ ‌ఫీల్డ్‌‌లో గురువారం భారత్‌ ‌రెండు మెడల్స్‌ ‌ఖాతాలో వేసుకుంది. మిక్స్‌‌డ్‌ ‌జట్టు 4*400 రిలే రేసులో భారత్‌ ‌రెండో స్థానంలో నిలిచి సిల్వర్‌ మెడల్‌ ‌కైవసం చేసుకుంది. గురువారం జరిగిన పతక రేసులో మిక్స్‌‌డ్‌ ‌జట్టు తరఫున మను, పూవమ్మ, విశాల్‌, విథ్య బరిలోకి దిగారు. మను తొలుత దూకుడుగా మొదలెట్టినా, పూవమ్మ కాస్త నెమ్మదించింది. బ్యాటన్‌ అందుకున్న విశాల్‌ ‌వేగం పెంచాడు. ఆఖర్లో విథ్య రామరాజ్‌ చిరుత వేగంతో దూసుకెళ్లింది. 3.12.87 సెకండ్లతో బహ్రెయిన్‌ అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకం సాధించగా, భారత్‌ 3.14.46 సెకండ్లతో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచి సిల్వర్‌ ‌మెడల్‌ ‌కైవసం చేసుకుంది. 3.14.54 సెకండ్లతో వియత్నాం కాంస్య పతకం దక్కించుకుంది. పూవమ్మ బ్యాటన్‌‌తో ఉండగా పతక ఆశలు కోల్పోయిన భారత్‌.. విథ్య రామరాజ్‌ ‌పరుగుతో పతకం పట్టుకొచ్చింది. అథ్లెటిక్స్‌‌లో సీమా కుమారి మరో పతకం సాధించింది. 10000మీటర్ల పరుగులో సీమా కుమారి కాంస్య పతకం సాధించింది. 32.50.05 టైమింగ్‌‌తో సీమా కుమారి పరుగును పూర్తి చేసింది. మూడో స్థానంలో నిలిచి కాంస్య నెగ్గింది. యావి (32.39.18), టనక(32.41.54) పసిడి, రజత పతకాలు దక్కించుకున్నారు.

​వుషూలోనూ సిల్వర్‌ ‌షో
మహిళల 60 కేజీల శాండ విభాగంలో రోషిబినా దేవి సిల్వర్‌ ‌మెడల్‌ ‌సాధించింది. రోషిబినా దేవికి ఆసియా క్రీడల్లో ఇది వరుసగా మూడో పతకం. గురువారం జరిగిన పసిడి ఫైట్‌‌లో చైనా అథ్లెట్‌ ‌జాంగ్‌ ‌చేతిలో 0-2తో రొషిబినా దేవి ఓటమిపాలైంది. రెండు రౌండ్లలోనూ రొషిబినా పైచేయి సాధించలేదు. తొలి రౌండ్లో 2-6, 3-6, 2-6, 2-6, 2-8తో ఓడిన రొషిబినా.. రెండో రౌండ్లో 2-10, 3-8, 3-7, 3-7, 1-6తో నిరాశపరిచింది. 2022 హాంగ్జౌ క్రీడల్లోనూ చైనా అథ్లెట్‌ ‌చేతిలో ఓడి సిల్వర్‌‌తో సరిపెట్టుకున్న రొషిబినా.. 2108 జకర్తాలో కాంస్య పతకం సాధించింది.

​రోయింగ్‌‌లో చారిత్రక మెడల్‌
ఆసియా క్రీడల రోయింగ్‌ ‌డబుల్‌ ‌స్కల్స్‌ ‌విభాగంలో భారత్‌ తొలిసారి పతకం సాధించింది. సల్మాన్‌ ‌ఖాన్‌, సత్నామ్‌ ‌సింగ్‌ ‌జోడీ నగోయాలో కాంస్య పతకంతో మెరిసింది. సల్మాన్‌ ‌ఖాన్‌ ఆర్మీలో, సత్నామ్‌ ‌సింగ్‌ ‌నేవిలో పనిచేస్తున్నారు. 6 నిమిషాల 13 సెకండ్లలో రేసు పూర్తి చేసిన ఈ జోడీ.. సిల్వర్‌ మెడలిస్ట్‌‌లు (ఉబ్బెకిస్తాన్‌)‌కు 3 సెకండ్ల వెనుకంజలో నిలిచారు. కాంస్యం నెగ్గినా.. పసిడి చేజారిందనే ఆవేదన సల్మాన్‌, సత్నామ్‌‌లో ఎక్కువగా కనిపించింది.

​కబడ్డీలో మెడల్స్‌ ‌ఖాయం
కబడ్డీలో టీమ్‌ ఇండియా ఆధిపత్యం కొనసాగుతోంది. అటు మహిళలు, అటు పురుషుల జట్లు మ్యాట్‌‌పై దుమ్మరేపుతున్నారు. మహిళల విభాగంలో భారత్‌ ‌గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో నిలిచింది. జపాన్‌‌పై 50-25తో ఏకపక్ష విజయం సాధించి సెమీఫైనల్‌‌కు చేరుకుంది. పురుషుల విభాగంలో భారత్‌ ‌గ్రూప్‌-ఏలో అగ్రస్థానం నిలుపుకుంది. చైనీస్‌ ‌తైపీపై 37-21తో గెలుపొంది సెమీస్‌‌కు చేరుకుంది. సెమీఫైనల్‌‌కు చేరుకుని మహిళల, పురుషల జట్లు మెడల్స్‌ ‌ఖాయం చేశాయి.

​షూటింగ్‌‌లో కాంస్యం
షూటింగ్‌ ‌స్కీట్‌ ‌మిక్సడ్‌ ‌టీమ్‌ ఈవెంట్‌‌లో భారత్‌ ‌పతకం సాధించింది. పరినాజ్‌, నరుకాలు 48 షాట్లలో కేవలం నాలుగు మాత్రమే మిస్‌ ‌చేశారు. ఓ దశలో సిల్వర్‌ ‌మెడల్‌ ‌సాధించిన దక్షిణ కొరియాతో భారత్‌ ‌సమవుజ్జీగా నిలిచింది. కానీ ఎలిమినేటర్‌‌లో దక్షిణ కొరియా ముందంజ వేసింది. 44 షాట్లతో భారత జోడీ కాంస్య పతకం నెగ్గగా.. చైనా (45), దక్షిణ కొరియా (44) బంగారు, వెండి పతకాలు సాధించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -