Homeజాతీయందానం పిటిషన్‌ కొట్టివేత

దానం పిటిషన్‌ కొట్టివేత

- Advertisement -

హైకోర్టు తీర్పులో జోక్యానికి సుప్రీం నిరాకరణ
పార్టీ ఫిరాయింపుపై వాడీవేడిగా వాదనలు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్టీ ఫిరాయింపుల్లో భాగంగా ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా దానం నాగేందర్‌పై అనర్హ‌త వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి.మోహన్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. పదో షెడ్యూల్‌ను హైకోర్టు చట్టపరంగా సరైన రీతిలో అర్థం చేసుకుని తీర్పు ఇచ్చిందని ధర్మాసనం పేర్కొంది. అందులో జోక్యం చేసుకునే కారణం కనిపించడం లేదని తెలిపింది. దానం నాగేందర్ తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదిస్తూ.. పదో షెడ్యూల్‌లోని 2(1)(బి) కింద పార్టీ విప్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన సభ్యుడి చర్యను పార్టీ క్షమించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడానికి సంబంధించిన 2(1)(ఎ) నిబంధనకు ఈ మినహాయింపు వర్తించదని ధర్మాసనం స్పష్టం చేసింది. దానం నాగేందర్‌ చర్యను బీఆర్‌ఎస్‌ క్షమించలేదని ఆ పార్టీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆయనపై అనర్హత పిటిషన్‌ దాఖలు చేసింది కూడా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనేనని వివరించారు. బీజేపీ ఎమ్మెల్యే త‌ర‌పు న్యాయవాది సైతం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ దానం పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.

‘ఆయారాం.. గయారాం.. ఫిర్‌ ఆయారాం’
పార్టీ ఫిరాయింపుల అంశంపై వాదనలు జరుగుతున్న సమయంలో దానం నాగేందర్ తరపు న్యాయవాది వాదనల నేపథ్యంలో ధర్మాసనం ‘ఆయారాం.. గయారాం.. ఫిర్‌ ఆయారాం’ అంటూ వ్యాఖ్యానించింది. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లి, తిరిగి సొంత పార్టీలోకి వచ్చినట్లుగా దానం వ్యవహారాన్ని వివరిస్తున్నారా? అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా పార్టీ విప్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన అంశానికి సంబంధించిన 2(1)(బి) నిబంధనను, పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడానికి సంబంధించిన 2(1)(ఎ) నిబంధనతో కలిపి చూడలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునే కారణం లేదని పేర్కొంటూ దానం నాగేందర్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పు అమల్లోకి రానుంది. 2024 ఏప్రిల్‌ 23 నుంచి దానం నాగేందర్‌పై అనర్హత అమల్లోకి వస్తుందని హైకోర్టు గతంలో పేర్కొంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరపున ఖైరతాబాద్‌ నుంచి దానం నాగేందర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేశారు. ఈ అంశాన్ని ఆయన పార్టీ మారినట్టు పరిగణిస్తూ హైకోర్టు అనర్హతకు ప్రాతిపదికగా తీసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -