విద్యుత్ సరఫరా, సాగునీటి విడుదలలో విఫలం : మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్‌ఎస్ భారీ ధర్నా
ప్లాంట్ లోపలికి వెళ్లేందుకు శ్రేణుల యత్నం.. అడ్డుకున్న పోలీసులు
నవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్
వ్యవసాయానికి కరెంట్ సరఫరా చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బొగ్గును సైతం అమ్ముకుంటోందని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉండగా బొగ్గును అమ్ముకుంటూ 2 యూనిట్లలోనే ఉత్పత్తి చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో గురువారం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్లాంట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. భారీగా పోలీసు బలగాలను మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేసి బీఆర్‌ఎస్ శ్రేణులను ఎక్కడికక్కడా నిలువరించారు. మొదట మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ప్లాంట్ లోపలికి వెళ్లి సీఈని కలిసి ఎంత ఉత్పత్తి అవుతుంది, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, సాగుకు అవసరమైన నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ సరిపడా విద్యుత్ అందడం లేదన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌లో ఐదు యూనిట్లకు సరిపోను బొగ్గు సరఫరా చేసి విద్యుత్ ఉత్పత్తి చేయాలని డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను సక్రమంగా అందించాలని, సాగునీటి విడుదలపై స్పష్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ 4 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే.. చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం బొగ్గు సరఫరా చేయకుండా అమ్ముకొని విద్యుత్ ఉత్పత్తిలో ఆటంకం కల్పిస్తున్నదన్నారు. రైతులకు సాగు సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, రెండు పంటలకు అవసరమైన సాగునీటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్ నాయక్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్ది, నోముల భగత్, పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, తిప్పన విజయసింహ రెడ్డి, రాష్ట్ర నాయకులు పిల్లుట్ల రఘు, నరసింహ రెడ్డి, ఇస్లావాత్ రామచందర్ నాయక్, పల్లె రవి, చింతల వెంకటేశ్వరరెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, దుర్గంపూడి నారాయణ రెడ్డి, మందడి సైదిరెడ్డి పాల్గొన్నారు.



