Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeమానవిఔష‌ద మొక్క‌ల హైమావ‌తి

ఔష‌ద మొక్క‌ల హైమావ‌తి

- Advertisement -

ప్రకృతి అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. చుట్టూ పచ్చదనం.. పక్షుల కువకువలు.. రంగురంగుల పువ్వులు.. ఇలా ఎన్నో అద్భుతమైన దృశ్యాలను మనం కేవలం ప్రకృతిలో మాత్రమే చూడగలుగుతాం. అందుకే ప్రకృతిలో మమేకం కావడం కోసం ఎందరో పర్యాటక ప్రదేశాలకు వెళ్తుంటారు. అందమైన ప్రకృతి ఒడిలో సేదతీరి వస్తుంటారు. ఇదే ప్రకృతిలో ఎన్నో ఔషధ మొక్కలు వుంటాయనే విషయం అందరికి తెలిసిందే. అయితే రాను రాను ఆదరణ లేక అవి అంతరించిపోతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఒక వృద్ధ మహిళకు తన తర్వాతి తరాలకు వీటి గొప్పతనం తెలియాలనే ఆలోచన వచ్చింది. అంతే తన ఇంటినే ఓ ఉద్యానవనంగా మార్చేశారు. ఆమే ఔషధ మొక్కల హైమావతి. ఆమెను మానవి పలకరించింది. ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆ విశేషాలు మీరూ చదవండీ…
ఔషధ మొక్కల హైమావతి అంటే ఎక్కడే మారుమూల గ్రామంలో ఉంటుందనుకున్నారా! అలా అనుకుంటే మీరు పొరబడినట్టే. కాంక్రీట్‌ జంగీల్‌కు మారుపేరైన హైదరాబాద్‌లోని, కూకట్‌పల్లికి సమీపంలోని వసంత్‌నగర్‌లో ఆమె నివాసం. మొక్కలతో అనుబంధం గురించి అడిగితే తన చిన్ననాటి జ్ఞాపకాల దొంతరల్లోకి వెళ్లి పోయి ఎన్నో విషయాలు పంచుకున్నారు.
మొక్కలంటే ప్రాణం
హైమావతికి మొదటి నుండి మొక్కలంటే పంచప్రాణాలు. చిన్నతనంలో వారి అక్క వాళ్ళ గ్రామానికి వెళ్ళినప్పుడల్లా కనిపించిన పూల మొక్కలు తెచ్చి గ్రామాల్లో ఉండే కాలువగట్ల మీద నాటే వారు. అవి పెరిగి పెద్దయి పూలు పూస్తుంటే, ఆ పూలని నలుగురు కోసుకుని వెళ్తుంటే ఆమె మనసు పులకించిపోయేది. ఆ వయసులోనే ఆమెకు మొక్కలు పెంచాలనే ఆలోచన మనసులో గాఢంగా నాటుకు పోయింది. పెండ్లి తర్వాత కూడా ఆ ఇష్టం అలాగే కొనసాగింది. ఆమె భర్త మధు గౌడ్‌ మొక్కల సేకరణలో ఆమెకు ఎంతో సహకారాన్ని అందించేవారు. భర్త సహకారంతో ఎంత దూరమైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే ఆ మొక్క తమ ఇంటి ఆవరణలో ఉండి తీరాలన్నది ఆమె పట్టుదల. అలా పట్టుదలతో ఆమె సేకరించిన మొక్కలతో ఇప్పుడు వారి ఇల్లు ఒక ఔషధాలయంగా విరాజుల్లుతోంది.
లెక్కకు మించిన మొక్కలు
ప్రస్తుతం హైమవతి సుమారు వందకు పైగా ఔషధ మొక్కలను కన్నబిడ్డల్లా పెంచుతున్నారు. వీటిని సంపాదించడం వెనక ఆమె కృషి ఎంతో ఉంది. తన దృష్టికి వచ్చిన మొక్కలు నగరంలో దొరకకపోతే వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా తెప్పించి తన పెరట్లో నాటే వరకు ఆమె మనసు కుదురుగా ఉండేది కాదు. తులసి, పసుపు, అర్జున, తిప్పతీగ, గలిజేరు, సదాపాకు, కామంచే, వడపత్రి, అశ్వగంధ, కినోవా, అలోవేరా ఇలా వందకు పైగా ఔషధ మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కలన్నీ ప్రకృతి వైద్యంలో ఎంతగానే ఉపయోగపడతాయి. కొన్ని రకాల మొక్కలైతే సర్వ రోగ నివారణ కూడా ఉపయోగిస్తుంటారు. చర్మ, దంత సమస్యలు, జుట్టు ఊడటం, క్యాన్సర్‌ వ్యాధి నివారణకు, దగ్గు, జలుబు, నులిపురుగుల నివారణకు, కీళ్ల నొప్పులు, విరిగిన ఎముకలకు, మధుమేహం ఇలా రకరకాల జబ్బులకు చెక్‌ పెట్టే ఔషధ మొక్కలు ఆమె ఇంటి పెరట్లో మనకు దొరుకుతాయి.
పది గంటలు మొక్కలతోనే…
సాధారణంగా అయితే ఆ వయసులో చాలామంది టీవీ సీరియల్స్‌ చూస్తూనో లేదా ఇరుగు పొరుగు వారితో పిచ్చా పాటి కబుర్లు చెప్పుకుంటూనో తమ సమయాన్ని గడిపేస్తారు. కానీ హైమావతి మాత్రం అంతరించిపోతున్న ఔషధ మొక్కలకు జీవం పోస్తున్నారు. నేటి తరానికి తెలియాలి వాటిని తీసుకువచ్చి పెంచి, ఆ మొక్కలను అడిగిన వారికి ఉచితంగా పంచుతూ వాటిపై అవగాహన కలిగించడం నిజంగా గొప్ప విషయం. ఆమె రోజులో కనీసం పది గంటల వరకు చెట్ల పర్యవేక్షణకే కేటాయిస్తారు. ఈరోజు వరకు ఎటువంటి అనారోగ్యం తన దరికి చేరలేదని, వైద్యుడిని సంప్రదించే అవసరం రాలేదని, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే చూడటానికి తప్ప తాను ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి రాలేదు ఎంతో గర్వంగా అంటున్నారు హైమవతి. నిత్యం మొక్కలతో గడపడం వల్లనే తాను ఇంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాని కూడా ఆమె చెబుతున్నారు. ఆ ఇంటికి వెళ్ళిన ఎవరికైనా పచ్చని మొక్కలతో ఒక బృందావనంలా కనిపిస్తుంది. ఆ బృందావనంలో ఎంతసేపు విహరించినా తనివి తీరదు.
– పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img